
పల్లె బాట పడుతున్న చైనా యువకులు
బీజింగ్: ప్రపంచంలో పల్లెలు పట్నాలకు వలసపోతుంటే చైనా యువకులు ఉపాధి అవకాశాల కోసం పల్లెలకు బాట పట్టారు. పల్లెల్లో తాము బతకడంతోపాటు పల్లెవాసులకు తమ బాటలో బతుకుతెరువు చూపిస్తున్నారు. గ్రామీణ పేదరికాన్ని నిర్మూలించేందుకు తమవంతు కృషి చేస్తున్నారు. వారిలో చెన్ జీన్ అనే 26 ఏళ్ల యువకుడు ఒకరు. పేదరికం ఎక్కువగా ఉన్న నింగ్‌జియా హుయి రాష్ట్రంలోని ఓ కుగ్రామానికి వెళ్లిన చెన్ అక్కడ స్థానికంగా దొరికే జాతికి చెందిన 200 తేనె టీగలను సేకరించారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడించి చెన్ తేనెటీగలను పెంపకాన్ని ప్రారంభించారు. వాటి నుంచి ఆయన ఇప్పటికే రెండు టన్నుల స్వచ్ఛమైన తేనెను సేకరించారు. దాన్ని మార్కెట్‌గా సరఫరా చేయడం ద్వారా 45 వేల డాలర్లు వస్తుందని ఆశిస్తున్నారు. కాలుష్య రహిత గ్రామం అవడం వల్ల, స్థానిక జాతికి చెందిన తేనెటీగలు అవడం వల్ల తన తేనె తియ్యగా, స్వచ్ఛంగా ఉందని ఆయన చెప్పారు.
ఇప్పుడు తాను ఓ కంపెనీని, బ్రాండ్‌ను రిజిస్టర్ చేయించాలనుకుంటున్నానని చెప్పారు. ఇప్పుడు గ్రామానికి చెందిన పలువురు యువకులు తాను చూపిన మార్గంలోనే నడుస్తున్నారని చెన్ వివరించారు. తేనెటీగలు పెంచేందుకు పెద్ద పెట్టుబడులు అవసరం లేదని, అయినా గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలను పెంచే ప్రాజెక్టులకు ప్రభుత్వం రుణాలు కూడా ఇస్తోందని చెప్పారు. తాను తేనెతో వైన్ కూడా తయారు చేసే ఆలోచనలో ఉన్నానని చెన్ తెలిపారు. 2020 నాటికి ఐదున్నర కోట్ల మంది గ్రామీణ ప్రజలకు వార్షికాదాయం 430 అమెరికా డాలర్లకు పెంచాలన్నది తన లక్ష్యమని చెన్ తెలిపారు.
పల్లెల నుంచి పట్నాలకు ప్రజల వలసలను అరికట్టడమే కాకుండా పల్లెల స్వయం సమృద్ధికి చైనా ప్రభుత్వం ఇప్పుడు ప్రత్యేక శ్రద్ధను తీసుకుంటోంది. పల్లెల్లో ఆధునిక వ్యవసాయ పద్ధతుల్లో రైతులు శిక్షణ ఇచ్చేందుకు అధికారులను పల్లెలకు పంపిస్తోంది. కొత్తకొత్త ప్రాజెక్టులు చేపట్టేందుకు వీలుగా గ్రామీణ యువకులకు శిక్షణ ఇచ్చేందుకు యూనివర్శిటీ విద్యార్థుల సేవలను చైనా ప్రభుత్వం ఉపయోగిస్తోంది. ఈ విషయంలో విద్యార్థులకు బీజింగ్ రెన్‌మిన్ యూనివర్శిటీ ప్రత్యేక తరగతులను నిర్వహిస్తోంది. ఇక్కడ శిక్షణ పొందిన విద్యార్థులు వేసవి సెలవుల్లో పల్లెలకు వెళ్లి అక్కడి యువకులకు అవసరమైన రంగాల్లో శిక్షణ ఇస్తున్నారు. కొత్త కొత్త ప్రాజెక్టులను చేపట్టేందుకు మెళకువలను నేర్పుతున్నారు.