
అన్నీ నేనే ఇస్తే మీరేం చేస్తారు?
- ప్రజలనుద్దేశించి ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్య
- మీ తీరు చూస్తుంటే వంట కూడా నన్నే చేయమనేటట్లు ఉంది
- నేను కష్టపడుతుంటే మీరు ఇళ్లల్లో పడుకుంటారా?
పొట్టిపాడు (గన్నవరం): రేషన్ దుకాణాల్లో పామాయిల్, కందిపప్పు ఇవ్వడం లేదని ఫిర్యాదు చేసిన పాపానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఓ వ్యక్తికి గట్టిగా క్లాస్ తీసుకున్నారు. అన్నీ నేనే ఇస్తే ఇక మీరేం చేస్తారని ప్రశ్నించారు. జనం తీరు చూస్తుంటే వారి వంట కూడా నన్నే చేయమనేటట్లు ఉన్నారని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. వంట చేసుకోలేని వారి కోసం అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేస్తున్నానని చెప్పారు. అశాస్త్రీయంగా జరిగిన రాష్ట్ర విభజన వల్ల తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్‌ను గాడిలో పెట్టేందుకు, ప్రపంచంలోనే టాప్-5 రాజధానుల్లో ఒకటిగా అమరావతిని నిలిపేందుకు తాను నిరంతరం శ్రమిస్తుంటే ప్రజలు ఇళ్లల్లో పడుకోవడం పద్ధతి కాదని అన్నారు. కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం పొట్టిపాడులో విశ్రాంత చీఫ్ ఇంజినీర్ గూడవల్లి సీతారామస్వామి ఏర్పాటు చేసిన నందమూరి తారకరామారావు విగ్రహాన్ని చంద్రబాబు శనివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.బాబు ప్రసంగిస్తుండగా ఓ వ్యక్తి లేచి.. రేషన్ దుకాణాల్లో పామాయిల్, కందిపప్పు ఇవ్వడం లేదని ఫిర్యాదు చేశాడు. దీంతో సీఎం వ్యంగ్యాస్త్రాలు విసిరారు.
డిపాజిట్లు రానోళ్లు పరోక్ష ఎన్నికల్లో గెలిస్తే ఎలా?
సాక్షి, అమరావతి: ప్రత్యక్ష ఎన్నికల్లో డిపాజిట్ కూడా తెచ్చుకోలేని వామపక్షాలు.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిస్తే ఎలా అని తమ పార్టీ నేతలను టీడీపీ అధ్యక్షుడు, సీఎం చంద్రబాబు ప్రశ్నించారు. ఈసారి వామపక్షాల అభ్యర్థులు మండలిలో ప్రవేశించకుండా చూసే బాధ్యత నేతలదేనని.. ఇందుకు అన్ని రకాల సహాయ సహకారాలు పార్టీ, ప్రభుత్వ పరంగా ఉంటాయని తమ నేతలకు అభయమిచ్చారు. వచ్చే ఏడాది లో ఉపాధ్యాయ, పట్టభద్రుల నియోజకవర్గాలకు ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో గ్రామ, మండల, జిల్లా, రాష్ట్ర స్థాయి నేతలతో ఆయన శనివారం టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించి సూచనలు చేశారు.