పారిశ్రామికవేత్తలకు ఆహ్వానం..
* ఏపీలో పరిశ్రమలు స్థాపించండి
* చైనా పారిశ్రామికవేత్తలు, అధికారులతో సీఎం చంద్రబాబు
* రెండోరోజు వ్యాపారవేత్తలతో బాబు బృందం భేటీ
* సీసీఈసీసీ, ఏపీ ప్రభుత్వాల ఒప్పందం
* 3.5 బిలియన్ డాలర్ల పెట్టుబడికి ఫ్యాక్స్‌కాన్ సిద్ధం
* ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టి పరిశ్రమలు స్థాపించాలని చైనా పారిశ్రామిక, వ్యాపారవేత్తలను సీఎం చంద్రబాబు కోరారు.
* చైనాలో పర్యటిస్తున్న చంద్రబాబు నేతృత్వంలోని ప్రతినిధి బృందం సోమవారం రెండోరోజు పలువురు పారిశ్రామిక, వ్యాపారవేత్తలతో పాటు అధికార, అనధికార ప్రముఖులతో సమావేశమైంది.
* పరిశ్రమలకు అన్ని వసతులు కల్పిస్తామని, 21 రోజుల్లో అనుమతులు ఇస్తామని సీఎం వారికి చెప్పారు.
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లో పరిశ్రమలు పెట్టడంతో పాటు పరిశ్రమలు స్థాపించాలని చైనా పారిశ్రామిక, వ్యాపారవేత్తలను సీఎం చంద్రబాబు కోరారు. చైనాలో పర్యటిస్తున్న బాబు నేతృత్వంలోని ప్రతినిధి బృందం సోమవారం రెండోరోజు పలువురు పారిశ్రామిక, వ్యాపారవేత్తలతో పాటు అధికార, అనధికార ప్రముఖులతో సమావేశమైంది. పరిశ్రమలకు అన్ని వసతులు కల్పిస్తామని, 21 రోజుల్లో అనుమతులు ఇస్తామని సీఎం వారికి చెప్పారు. సీఎం బృందం సమావేశాల వివరాలను హైదరాబాద్‌లోని రాష్ర్ట ప్రభుత్వ సమాచార సలహాదారు కార్యాలయం పత్రికలకు విడుదల చేసింది.
* ఎలక్ట్రానిక్స్ రంగంలో ప్రసిద్ధి చెందిన జియోమీ సంస్థ అధ్యక్షుడు లిన్‌బెన్, ఉపాధ్యక్షుడు హ్యుగో బర్రా, ఫ్యాక్స్‌కాన్ ప్రతినిధి మైక్‌ఛాంగ్‌లతో బాబు భేటీ అయ్యారు. ఎలక్ట్రానిక్స్ రంగంలో పెట్టుబడులు పెట్టాలని కోరారు.
* వచ్చే మూడు నాలుగేళ్లలో 3.5 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెడతామని, 1.2 మిలియన్ల మందికి ఉపాధి కల్పిస్తామని ఫ్యాక్స్‌కాన్ ఉపాధ్యక్షుడు ఫాగ్లర్ చెప్పారు.
* ఐదు వేల మెగావాట్ల సోలార్ విద్యుత్ ప్లాంట్ ఏర్పాటుకు సిద్ధంగా ఉన్నట్లు సుమెక్ సంస్థ ఎండీ క్రిస్టఫర్ టాన్ చెప్పారు. దీనిపై మే నెలలో ప్రధాని మోదీ చైనా పర్యటన సందర్భంగా ఒప్పందాలు చేసుకోవచ్చని సీఎం పేర్కొన్నారు.
* రాజధాని అమరావతి నగరంలో ట్రాఫిక్ మేనేజిమెంట్‌లో ఈ-మొబిలిటీ సొల్యూషన్స్, శాటిలైట్ సొల్యూషన్స్, సొల్యూషన్స్ ఫర్ ఎయిర్‌పోర్టులకు సంబంధించి సమగ్ర ప్రాజెక్టు రిపోర్టుతో త్వరలో కలుస్తామని సీమన్స్ కంపెనీ ఉపాధ్యక్షుడు మస్లమ్ యాకిసన్ చెప్పారు.10-15 కి.మీ. పరిధిలో పెలైట్ ప్రాజెక్టు చేపట్టాలని, పీపీపీ పద్ధతిలో ముందుకెళ్లాలని బాబు సూచించారు.
* ఏపీలో ఇండస్ట్రియల్ పార్కులు నెలకొల్పే ప్రతిపాదన ఉందని, జూన్, జూలై నెలల్లో సమగ్ర ప్రతిపాదనలతో కలుస్తామని సినోమా ఇంటర్నేషనల్ ఇంజినీరింగ్ కంపెనీ ప్రతినిధులు చెప్పారు.
* రాష్ట్రంలో మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్‌నుగానీ, అసెంబ్లింగ్ యూనిట్‌నుగానీ ఏర్పాటు చేయాలని ఎల్‌ఇడీ డిస్‌ప్లేల తయారీలో కంపెనీ షెన్ జెన్ మేరీ ఫొటో ఎలక్ట్రిక్ సంస్థ ప్రతినిధులను సీఎం కోరారు.
* బీజింగ్‌లో హవాయీ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ సెంటర్‌ను సందర్శించిన బాబు రాష్ట్రంలో ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్స్ టెక్నాలజీ (ఐసీటీ)ని పరిపాలనలో సమర్థంగా వినియోగించుకునే అవకాశాలపై ఆ కంపెనీ సాంకేతిక నిపుణులతో చర్చించారు. రాష్ట్రంలో హార్టువేర్ మ్యాన్‌ఫ్రాక్చరింగ్ అభివద్ధికి సహకరించాలని సీఎం కోరారు.
* ఏపీలో మౌలిక సదుపాయాల కల్పనతోపాటు పెట్టుబడులకు సౌకర్యం కల్పించేందుకు ఏపీ ప్రభుత్వం, చైనా సివిల్ ఇంజినీరింగ్ కనస్ట్రక్షన్ కార్పొరేషన్ (సీసీఈసీసీ) ఒప్పందం చేసుకున్నాయి. ఏపీ ప్రభుత్వ ఇంధన, మౌలిక సదుపాయాలు, పెట్టుబడుల కల్పన శాఖ కార్యదర్శి అజయ్‌జైన్, సీసీఈసీసీ ఏజీఎం వాంగ్ క్సియాడాంగ్ ఒప్పందంపై సంతకాలు చేశారు.
* చైనా వైస్ ప్రీమియర్ వాంగ్ యాంగ్‌తో, బీజింగ్ మేయర్ వాంగ్ అన్ శున్‌తో చంద్రబాబు వేర్వేరుగా భేటీ అయ్యారు. చైనాలో పెట్టుబడులకు భారతీయులను తాము ఆహ్వానిస్తున్నామని, భారత్‌కు వెళ్లాలని చైనా కంపెనీలకు సూచిస్తున్నామని వాంగ్ అన్ శున్ చెప్పారు. ఏపీ పర్యటనకు రావాలని వారిని సీఎం ఆహ్వానించారు.