భెల్, కోల్ ఇండియా డిజిన్వెస్ట్‌మెంట్ | Coal India, BHEL stake sale: PM seeks options from Ministries | Sakshi
Sakshi News home page

భెల్, కోల్ ఇండియా డిజిన్వెస్ట్‌మెంట్

Published Wed, Dec 4 2013 2:48 AM | Last Updated on Sat, Sep 2 2017 1:13 AM

భెల్, కోల్ ఇండియా డిజిన్వెస్ట్‌మెంట్

భెల్, కోల్ ఇండియా డిజిన్వెస్ట్‌మెంట్

న్యూఢిల్లీ: బడ్జెట్‌లో ప్రతిపాదించిన రూ. 40,000 కోట్ల డిజిన్వెస్ట్‌మెంట్ లక్ష్యాన్ని సాధించే యోచనలో భాగంగా ప్రధాని మన్మోహన్ సింగ్ తాజాగా భెల్, కోల్ ఇండియాలపై దృష్టిసారించారు. ఇందుకు అనుగుణంగా ప్రభుత్వరంగ కంపెనీల(పీఎస్‌యూలు) నుంచి బైబ్యాక్ లేదా ప్రత్యేక డివిడెండ్ చెల్లింపు వంటి ప్రణాళికలను సిద్ధం చేయమంటూ బొగ్గు, భారీ పరిశ్రమల శాఖల మంత్రులను ప్రధాని ఆదేశించారు. ఈ విషయాలను ఆర్థిక మంత్రి పి.చిదంబరం వెల్లడించారు. డిజిన్వెస్ట్‌మెంట్‌పై సమీక్షలో భాగంగా ప్రధాని మంగళవారం వివిధ శాఖల మంత్రులతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి ఆర్థిక మంత్రి చిదంబరంతోపాటు, బొగ్గు శాఖ మంత్రి శ్రీప్రకాష్ జైస్వాల్, భారీ పరిశ్రమల మంత్రి ప్రఫుల్ పటేల్ తదితరులు హాజరయ్యారు.
 
 డిజిన్వెస్ట్‌మెంట్‌లో భాగంగా ప్రభుత్వం వివిధ ప్రభుత్వ రంగ దిగ్గజాలలో కొంతమేర వాటాలను విక్రయించడం ద్వారా నిధులను సమీకరిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇందుకు స్టాక్ మార్కెట్లు అనుకూలించని కారణంగా పీఎస్‌యూలు సొంత షేర్లను కొనుగోలు చేయడం(బైబ్యాక్), ప్రత్యేక డివిడెండ్‌ను ప్రకటించడం వంటి ప్రత్యామ్నాయాలను పరిశీలించమంటూ ప్రధాని సంబంధిత మంత్రులకు ఆదేశాలు జారీ చేశారని చిదంబరం వివరించారు. 2012-13 బడ్జెట్‌లో డిజిన్వెస్ట్‌మెంట్ ద్వారా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ. 40,000 కోట్లను సమీకరించాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. అయితే ఇప్పటికి 8 నెలలు గడిచినప్పటికీ ఆరు పీఎస్‌యూలలో వాటాల విక్రయం ద్వారా కేవలం రూ. 1,325 కోట్లను మాత్రమే ప్రభుత్వం సమీకరించగలిగింది. ఈ నేపథ్యంలో జరిగిన డిజిన్వెస్ట్‌మెంట్ సమీక్షలో దిగ్గజ కంపెనీలు భెల్, కోల్ ఇండియాలపై ప్రధాని దృష్టి పెట్టారు.
 
 నిర్ణయంకాలేదు
 కోల్ ఇండియా డిజిన్వెస్ట్‌మెంట్‌పై చర్చలు జరుగుతున్నాయని, ప్రస్తుతం ఇంకా ఒక నిర్ణయానికి రాలేదని సమావేశం అనంతరం జైస్వాల్ చెప్పారు. కార్మిక సంఘాల వ్యతిరేకత కారణంగా కోల్ ఇండియాలో వాటా విక్రయ వ్యవహారం వాయిదా పడు తూ వస్తోంది. ఇక భెల్‌లో 2011లోనే డిజిన్వెస్ట్‌మెంట్‌కు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినప్పటికీ స్టాక్ మార్కెట్ పరిస్థితులు అనుకూలించక వాయిదా పడుతూ వచ్చింది. ప్రస్తుతానికి భెల్ వాటా విక్రయంపై నిర్ణయం తీసుకోనప్పటికీ తగిన అవకాశాల ను అన్వేషిస్తున్నామని ప్రఫుల్ తెలిపారు.
 
 కోల్ ఇండియాలో ప్రభుత్వం తొలుత 10% వాటాను విక్రయించాలని భావించిం ది. కార్మిక సంఘాల నుంచి వ్యతిరేకత నేపథ్యంలో వాటా విక్ర య యోచనను 5%(31.58 కోట్ల షేర్లు)కు పరిమితం చేసుకుం ది. షేరు ప్రస్తుత ధర రూ. 274 ప్రకారం కోల్ ఇండియా డిజిన్వెస్ట్‌మెంట్ ద్వారా ప్రభుత్వానికి రూ. 8,600 కోట్లు లభించవచ్చు. కోల్ ఇండియాలో ప్రభుత్వానికి 90% వాటా ఉంది. ఇక భెల్ షేరు ప్రస్తుత ధర రూ. 158 ప్రకారం 5% వాటా(8.28 కోట్ల షేర్లు) విక్రయానికిగాను రూ. 1,300 కోట్లు సమకూరే అవకాశముంది. ఇవికాకుండా ఇతర సంస్థలు హిందుస్తాన్ జింక్, బాల్కోలలో గల వాటాలను విక్రయించే అవకాశాలపై  కూడా ప్రభుత్వం దృష్టి పెట్టింది. ప్రభుత్వానికి హిందుస్తాన్ జింక్‌లో 29.5%, బాల్కోలో 49% చొప్పున వాటా ఉంది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement