పార్లమెంట్లో ఎంపీల తీరుపై విచారణ కమిటీ
లోక్సభలో గురువారం ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ బిల్లు ప్రవేశపెట్టిన సమయంలో సభలో చోటుచేసుకున్న పరిణామాలపై విచారణకు స్పీకర్ మీరాకుమార్ శుక్రవారం సెక్యూరిటీ కమిటీని ఏర్పాటు చేశారు. ఆ కమిటీకి డిప్యూటీ స్పీకర్ అధ్యక్షత వహిస్తారని తెలిపారు. సెక్యూరిటీ కమిటీ సోమవారం సమావేశం కానుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనకు సంబంధించిన బిల్లును గురువారం లోక్సభలో ప్రవేశపెట్టారు. అయితే ఆంధ్రప్రదేశ్ విభజనను వ్యతిరేకిస్తున్న సీమాంధ్ర ప్రాంతానికి చెందిన లోక్సభ సభ్యులలో కొందరు బిల్లు తీసుకువచ్చిన ప్రాంతానికి చేరుకుని, బిల్లు అడ్డుకునే ప్రయత్నం చేశారు.
ఆ క్రమంలో తెలంగాణ ప్రాంతానికి చెందిన కొంత మంది లోక్సభ సభ్యులు ఆ ప్రయత్నాన్ని అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో సభలో తీవ్ర ఘర్షణ వాతావరణం నేలకొంది. అదే సమయంలో విజయవాడ లోక్సభ సభ్యుడు ఎల్ రాజగోపాల్ పెప్పర్ స్ర్పే కొట్టరు. దాంతో పార్లమెంట్లో సభ్యులంతా ఉక్కిరిబిక్కిరి అయ్యారు. సభలో ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి ఏర్పడింది. దాంతో మార్షల్స్ సభలోకి ప్రవేశించి పలువురు ఎంపీలను బలవంతంగా బయటకు తరలించారు.
సభలో అమర్యాదగా ప్రవర్తించిన ఎంపీలపై చర్యలు తీసుకోవాలని పలు పార్టీల నేతలు స్పీకర్కు విజ్ఞప్తి చేశారు. అంతేకాకుండా ఆ ఘటనపై కేంద్ర మంత్రులు, ప్రతిపక్ష నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో స్పీకర్ మీరాకుమార్ ఆ ఘటనపై విచారణ కోసం డిప్యూటీ స్పీకర్ అధ్యక్షతన కమిటీని ఏర్పాటు చేశారు.