కొత్త జిల్లాలపై కమిటీ
♦ సీఎస్ రాజీవ్‌శర్మ ఆధ్వర్యంలో ఐదుగురితో ఏర్పాటు
♦ రెవెన్యూ డివిజన్లు, మండలాల పునర్‌వ్యవస్థీకరణపైనా పరిశీలన
♦ జూన్ 2 నాటికి ప్రక్రియ పూర్తికి నిర్ణయం
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియను ప్రభుత్వం వేగవంతం చేసింది. జిల్లాలతోపాటు రెవెన్యూ డివిజన్లు, మండలాల పునర్వవ్యస్థీకరణపై కసరత్తు చేసేందుకు సీఎస్ రాజీవ్‌శర్మ సారథ్యంలో రెవెన్యూ, మున్సిపల్-పట్టణాభివృద్ధి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల ముఖ్య కార్యదర్శులు సభ్యులుగా కమిటీని ఏర్పాటు చేసింది. భూపరిపాలనా విభాగం ముఖ్య కమిషనర్ దీనికి కన్వీనర్‌గా వ్యవహరిస్తారు. ఈ మేరకు రెవెన్యూ శాఖ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది.
ఈ కమిటీకి అవసరమైనప్పుడు సహాయ సహకారాలు అందించేందుకు ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధానకార్యదర్శి, ప్రణాళిక శాఖ, నీటిపారుదల, ఆర్ అండ్ బీ, పర్యావరణ అటవీశాఖ, హోంశాఖల ముఖ్య కార్యదర్శులు, డీజీపీ, అటవీ శాఖ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్‌లను ప్రత్యేక ఆహ్వానితులుగా నియమించింది. పరిపాలనా సౌలభ్యం కోసం రాష్ట్రంలో కొత్త జిల్లాలను ఏర్పాటు చేస్తామని.. ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా పునర్‌వ్యవస్థీకరణ చేపడతామని ముఖ్యమంత్రి ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. జూన్2 వ తేదీ నాటికి ఈ ప్రక్రియను పూర్తిచేయాలని మౌఖిక ఆదేశాలు జారీ చేశారు.
పెరగనున్న డివిజన్లు, మండలాలు
ప్రస్తుతం రాష్ట్రంలోని పదిజిల్లాల్లో 42 రెవెన్యూ డివిజన్లు, 464 మండలాలు ఉన్నాయి. దేశంలో సగటున 19 లక్షల జనాభాకు ఒక జిల్లా ఉంది. రాష్ట్రంలో 35 లక్షల జనాభాకో జిల్లా ఉంది. దీంతో ఇప్పుడున్న జిల్లాల సంఖ్యను రెండింతలకు పైగా పెంచే దిశగా అధికారులు ప్రాథమిక కసరత్తు ప్రారంభించారు. జిల్లాలతో పాటు రెవెన్యూ డివిజన్లు, మండలాల సంఖ్య కూడా పెరగనుంది. జనాభాతో పాటు భౌగోళిక పరిస్థితులకు అనుగుణంగా ఈ మార్పులు చేయాలని భావిస్తున్నారు. కొత్తగా ఏర్పడే జిల్లా కేంద్రాలు ఆ పరిధిలోని ప్రజలకు అందుబాటులో ఉండాలి. రవాణా సదుపాయాలతో పాటు కొత్త కార్యాలయాల ఏర్పాటుకు మౌలిక వసతులున్న ప్రాంతాలకు ప్రాధాన్యమిస్తారు.
నేతలకు గుబులు..
కొత్త జిల్లాల ఏర్పాటు, రెవెన్యూ డివిజన్ల పునర్‌వ్యవస్థీకరణ రాజకీయంగా తమ భవితవ్యానికి ఇబ్బంది కలిగించే ప్రమాదముందని కొందరు ఎంపీలు, ఎమ్మెల్యేలు సీఎం దృష్టికి తీసుకెళ్లారు. పునర్‌వ్యవస్థీకరణతో ఇప్పుడున్న పార్లమెంటు నియోజకవర్గాలు కుదుపులకు గురవడం ఖాయం. కొన్ని సెగ్మెంట్లు రెండు, మూడు జిల్లాలకు విస్తరించే పరిస్థితులున్నాయి. అసెంబ్లీ నియోజకవర్గాలు మాత్రం ఏదో ఒక జిల్లాలోనే ఉంచాలని భావిస్తున్నారు. పరిపాలనా సౌలభ్యంతో పాటు అసెంబ్లీ, పార్లమెంటు నియోజకవర్గాల కోణంలోనూ కమిటీ అధ్యయనం చేయనుంది.
తెరపైకి కొత్త డిమాండ్లు
కొత్తజిల్లాల ఏర్పాటుకు వివిధ ప్రాంతాల నుంచి డిమాండ్లు మొదలయ్యాయి. వరంగల్ జిల్లాలోని మహబూబాబాద్, జనగాం, మహబూబ్‌నగర్ జిల్లాలో గద్వాల, రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం, మేడ్చల్‌లను జిల్లాలుగా మార్చాలని పట్టుబడుతున్నారు.