
స్టేషన్‌లోకి దూసుకుపోయిన రైలు.. భారీ ప్రమాదం!
న్యూజెర్సీ: అమెరికాలోని న్యూజెర్సీలో గురువారం ఉదయం భారీ రైలుప్రమాదం జరిగింది. న్యూజెర్సీలోని హోబోకెన్ రైల్వే స్టేషన్‌లో ప్రయాణికులతో కూడిన ఓ రైలు క్రాష్ అయి టెర్మినల్‌లోకి దూసుకెళ్లింది. ఈ దుర్ఘటనలో ముగ్గురు చనిపోగా.. సుమారు వందమంది గాయపడ్డారని తెలుస్తోంది.
రైల్వే స్టేషన్‌లో తీవ్రస్థాయిలో విధ్వంసాన్ని మిగిల్చిన ఈ ప్రమాదానికి సంబంధించిన ఫొటోలు ప్రయాణికులు ఆన్‌లైన్‌లో పోస్టు చేశారు. క్షతగాత్రుల ఆర్తనాదాలు, రైలు జరిపిన విధ్వంసంతో ఆ ప్రాంతమంతా భీతావహంగా మారింది. ఈ ఫొటోలను బట్టి రైల్వేస్టేషన్‌లో భారీ ఎత్తున నష్టం వాటిల్లి ఉంటుందని భావిస్తున్నారు. ఈ ప్రమాదం నేపథ్యంలో రైల్వేస్టేషన్‌లో రాకపోకలను నిలిపివేశారు. ఈ ఘటన స్థానికులను దిగ్భ్రాంత పరిచింది.