బెనారస్ బాధపడుతోంది..
వారణాసి: ఉత్తరప్రదేశ్ లో పాతికేళ్లకుపైగా దూరమైన అధికారాన్ని తిరిగి చేజిక్కించుకునేందుకు కాంగ్రెస్ పార్టీ సర్వశక్తులు ఒడ్డుతోంది. వచ్చే ఏడాది జరగనున్న ఎన్నికల కోసం ఇప్పటికే కాంగ్రెస్ ఉద్ధండ నాయకులను, వ్యూహకర్తలు యూపీలో తమపనితాము చేసుకుపోతున్నారు. ఆ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ కూడా మంగళవారం రంగంలోకిదిగారు. 'కొడితే కుంభస్థలాన్నే..' అన్నట్లు సరాసరి ప్రధాని నరేంద్ర మోదీ సొంత నియోజకవర్గం వారణాసి (కాశీ లేదా బెనారస్)లో బలప్రదర్శనకు దిగారు. 'దర్ద్-ఎ-బెనారస్' (బెనారస్ బాధపడుతోంది) పేరుతో భారీ రోడ్ షో నిర్వహించనున్న ఆమె.. సాయంత్రం బహిరంగ సభలో మాట్లాడతారు.
ఉదయం 11 గంటలకు వారణాసి చేరుకున్న అధినేత్రికి పార్టీ శ్రేణులు ఘనస్వాగతం పలికాయి. నేరుగా సర్క్యూట్ హౌస్ కు వెళ్లిన సోనియా.. పార్టీ ముఖ్యులతో భేటీ అవుతారు. మధ్యాహ్నం ప్రారంభంకానున్న ర్యాలీలో 10వేల మంది బైకర్లతో కలిసి ఓపెన్ టాప్ జీపులో వారణాసి ప్రధాన రహదారుల గుండా 6.5 కిలోమీటర్లు సోనియా రోడ్ షో చేస్తారు. అధినేత్రి రాక ఒక్కసారిగా కాంగ్రెస్ కార్యక్తల్లో జోష్ నింపింది. బుధవారం రాజ్యసభ ముందుకు వస్తుసేవల పన్ను (జీఎస్టీ) బిల్లు రానున్నవేళ.. ఒక రోజు ముందే ప్రధాని నియోజకవర్గంలో నిలబడి, మోదీపై, బీజేపీపై తీవ్రస్థాయిలో విరుచుపడనున్నారు. సోనియాగాంధీ. బీజేపీ హయాంలో దళితులు, మైనారిటీలపై జరుగుతోన్న దాడులు, ఆకాశాన్నింటిన నిత్యావసరాల ధరలు తదితర కీలక సమస్యలపై సోనియా మాట్లాడతారు. 25 ఏళ్లుగా కాంగ్రెస్ పాలనలోలేని యూపీ ఏ విధంగా వెనుకబడిపోయిందో ఓటర్లకు వివరించనున్నారామె.
సోనియా గాంధీ ప్రచారంపై స్పందిస్తూ యూపీ కాంగ్రెస్ చీఫ్ రాజ్ బబ్బర్ ఆసక్తికర వ్యాఖ్యలుచేశారు. 'యూపీలో మేం గెలవాలంటే ఏదో చమత్కారం జరగాలి. 2014లో అలాంటి చమత్కారం వల్లే మంచి ఫలితాలు సాధించాం' అని రాజ్ బబ్బర్ అన్నారు. ముఖ్యమంత్రి అభ్యర్థిని షీలా దీక్షిత్ తో కలిసి ఆయనకూడా సోనియాగాంధీ రోడ్ షోలో పాల్గొన్నారు. ప్రధానమంత్రి నేతృత్వం వహిస్తున్న వారణాసి నియోజకవర్గంలో తిష్టవేసిన సమస్యలను కాంగ్రెస్ నాయకులు ఎకరువుపెట్టారు.