లక్నో: కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ, కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. భారత్ జోడో న్యాయ్ యాత్ర సందర్భంగా మంగళవారం తన మాజీ నియోజకవర్గం అమేథీలో ర్యాలీని ఉద్దేశించి రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. రాత్రిపూట మద్యం సేవించే వారితో ఉత్తరప్రదేశ్ భవిష్యత్తు నృత్యం చేస్తోందని విమర్శించారు.
ప్రధాని నరేంద్ర మోదీ సొంత నియోజకవర్గం వారణాలో మద్యం సేవించి రోడ్డుపై పడి ఉన్న వ్యక్తులు కనిపించారని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. వారణాసి వెళ్లిన తనకు రాత్రిపూట వాయిద్యాలు మోగించడం.. మద్యం తాగి రోడ్డుపై పడి ఉన్నవారిని చూశానని అన్నారు. అయితే రామ మందిరంలో ప్రధాని మోదీ, అంబానీ, అదానీలతోపాటు భారతదేశంలోని కోటీశ్వరులందరు ఉంటారు కానీ ఒక్క వెనుకబడిన లేదా దళిత వ్యక్తి కూడా కనిపించడని వ్యంగ్యస్త్రాలు సంధించారు.
రాహుల్ వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి, అమేథీ బీజేపీ ఎంపీ స్మృతి ఇరానీ కౌంటర్ ఇచ్చారు. ఉత్తరప్రదేశ్‌పై రాహుల్‌గాంధీ మనసులో ఎంత విషం ఉందో ఆయన వ్యాఖ్యలను బట్టి తెలుస్తోందన్నారు. వాయనాడ్‌లోనూ ఉత్తరప్రదేశ్ ఓటర్లపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని గుర్తు చేశారు. అయోధ్య రామాలయంలో జరిగే 'ప్రాణప్రతిష్ఠ' కార్యక్రమానికి ఆహ్వానాన్నిఆయన తిరస్కరించారని,, నేడు వారణాసి ఉత్తరప్రదేశ్ యువత గురించి అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు.
చదవండి: ఢిల్లీ, పుణెలో రూ.2,500 కోట్ల విలువైన ‘మ్యావ్ మ్యావ్’ పట్టివేత.. ఏంటిది?
కాంగ్రెస్ భవిష్యత్తు అంధకారంలో ఉందని కానీ ఉత్తరప్రదేశ్ భవిష్యత్తు అభివృద్ధి వైపు పయనిస్తోందన్నారు. తన కొడుకును మంచిగా పెంచలేకపోతే కనీసం అతన్ని పిచ్చిపిచ్చిగా మాట్లాడకుండా ఉండమని చెప్పాలంటూ సోనియాగాంధీకి చురకలంటించారు. మరోవైపు ఉత్తరప్రదేశ్ మంత్రి దినేష్ ప్రతాప్ సింగ్ కూడా రాహుల్ గాంధీ వ్యాఖ్యలను ఖండించారు. దేశానికి ఆయన క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
కాగా ఉత్తరప్రదేశ్‌లోని అమేథీలో కాంగ్రెస్‌కు గట్టి పట్టు ఉన్నప్పటికీ 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఎదురుదెబ్బ తగిలింది. స్మృతి ఇరానీ చేతిలో రాహుల్ గాంధీ 55,000 ఓట్ల తేడాతో ఓడిపోయారు. యూపీలోని మొత్తం 80 లోక్‌సభ స్థానాల్లో కాంగ్రెస్ కేవలం ఒక్క సీటు గెలుచుకుంది. ఆ పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ ఒక్కరే రాయబరేలి నుంచి గెలిచారు. రాహుల్ గాంధీ అమేథీలో ఓటమిని చవిచూడగా, కేరళలోని వయనాడ్‌లో గెలిచారు.
Comments
Please login to add a commentAdd a comment