uttarpradesh assembly elections
-
UP By-election: క్రిమినల్ కేసులో ఎమ్మెల్యే సభ్యత్వం రద్దయి.. ఉపఎన్నిక జరిగిన చోట..
లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని తొమ్మిది అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరిగాయి. తాజాగా ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు కూడా వెలువడ్డాయి. ఈ ఫలితాలు సమాజ్‌వాదీ పార్టీకి కీలకంగా మారాయి. ముఖ్యంగా కాన్పూర్‌లోని సీసామవు అసెంబ్లీ స్థానంపై సమాజ్‌వాదీ పార్టీ జాతీయ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ గంపెడు ఆశలు పెట్టుకున్నారు.సీసామవు అసెంబ్లీకి చెందిన సమాజ్‌వాదీ ఎమ్మెల్యే ఇర్ఫాన్ సోలంకి ఒక క్రిమినల్ కేసులో దోషిగా తేలిన దరిమిలా అతని సభ్యత్వం రద్దయ్యింది. అనంతరం ఇక్కడ ఉప ఎన్నిక జరిగింది. కాగా భారతీయ జనతా పార్టీకి చెందిన రాకేష్ సోంకర్ 1996లో ఇక్కడ నుంచి విజయం సాధించారు. డీలిమిటేషన్ తర్వాత ఈ సీటు ముస్లింల ప్రాబల్యం కలిగినదిగా మారింది. తదనంతరం ఎస్పీ నేత ఇర్ఫాన్ సోలంకి 2012 నుంచి 2022 వరకు ఇక్కడ నుంచి ఎన్నికల్లో గెలుస్తూ వస్తున్నారు.కాన్పూర్‌లోని సీసామవు స్థానం అఖిలేష్ యాదవ్‌కు బలమైన స్థానాల్లో ఒకటి. అయితే ఇప్పుడు సీసామవు అసెంబ్లీ సీటు అటు బీజేపీ, ఇటు ఎస్పీకి ప్రతిష్ఠాత్మకంగా నిలిచింది. సీసామవు స్థానం నుంచి బీజేపీ తరపున సురేశ్ అవస్థీ బరిలో నిలిచారు. ఈసారి సీసామవు అసెంబ్లీ స్థానంలో ఎస్పీ, కాంగ్రెస్‌లు పొత్తు పెట్టుకుని పోటీ చేయడం బీజేపీకి పెద్ద సవాల్‌గా మారింది. 2022 అసెంబ్లీ ఎన్నికల్లో ఈ స్థానం నుంచి ఇర్ఫాన్ సోలంకీకి 79,163 ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్‌కు 5,616 ఓట్లు రాగా, బీజేపీకి 66,897 ఓట్లు వచ్చాయి. ఇది కూడా చదవండి: Delhi air pollution: కాస్త ఉపశమనం.. ఊపిరికి ఊరట -
ప్రజలతో మమేకం కండి
న్యూఢిల్లీ/వారణాసి: రాజకీయాలకతీతంగా మీమీ ప్రాంత ప్రజలతో మమేకం అవ్వండి అని ప్రధాని మోదీ ఉత్తరప్రదేశ్‌కు చెందిన బీజేపీ ఎంపీలకు హితబోధ చేశారు. శుక్రవారం ఆయన యూపీ బీజేపీ ఎంపీలతో అల్పాహార విందు కార్యక్రమంలో పాల్గొన్నారు. త్వరలో యూపీ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఈ విందుకు ప్రాధాన్యత సంతరించుకుంది. ఎన్నికల అంశాలేవీ సమావేశంలో చర్చించలేదని వార్తలొచ్చాయి. ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’లో భాగంగా వివిధ కార్యక్రమాల నిర్వహణపై ఎంపీలతో మోదీ ముచ్చటించారు. పార్టీలకతీతంగా సొంత నియోజకవర్గాల్లోని సీనియర్లతో ఎంపీలు తరచూ మాట్లాడాలని, యువకులకు క్రీడాపోటీలు నిర్వహించాలని, అందరితో మమేకం కావాలని నేతలకు మోదీ సూచించారు. ఈ విందులో 36 మంది పాల్గొన్నారు. మరోవైపు, ఇటీవల కాశీ విశ్వనాథ్ కారిడార్ నిర్మాణ కార్మికులతో కలిసి భోజనం చేసినందుకు ప్రధానిని పలువురు ఎంపీలు ప్రశంసించారు. అది సాధారణ జనాల్లోకి మంచి సందేశాన్ని తీసుకెళ్లిందని ప్రధానిని కొనియాడారు. పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో భాగంగా బీజేపీ ఎంపీలతో ప్రధాని అల్పాహార విందులో ఈ సమావేశం నాలుగోది. అంతకుముందు ఈశాన్యరాష్ట్రాలు, దక్షిణాది, మధ్య ప్రదేశ్ ఎంపీలతో వేర్వేరు సమావేశాలు జరిగాయి. నిర్లక్ష్య నగరాలపై దృష్టిపెట్టండి పరిశుభ్రతను నిర్లక్ష్యం చేస్తున్న నగరాల జాబితాను తయారు చేసి, స్వచ్ఛత దిశగా వారిపై ఒత్తిడి పెంచాలని ప్రధాని మోదీ ప్రజలకు పిలుపునిచ్చారు. వారణాసిలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మేయర్ల సదస్సులో పాల్గొన్న 120 మంది మేయర్లనుద్దేశించి మోదీ ప్రసంగించారు. నదులను ప్రజలు కాపాడుకునేలా నదులున్న నగరాలన్నీ ‘నదీ ఉత్సవ్’ను జరపాలని సూచించారు. చాలా నగరాల్లో నదులు డ్రైనేజీల్లా మారాయని, పరిశుభ్రతపై శీతకన్ను చూపుతున్న నగరాల జాబితాను సిద్ధంచేయాలని, వాటి నిర్లిప్త వైఖరిని ఎండగట్టాలని, అప్పుడే ప్రజాక్షేత్రంలో ఒత్తిడి పెరిగి మంచి ఫలితాలొస్తాయన్నారు. ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’లో భాగంగా మేయర్లు నగర వ్యవస్థాపక దినోత్సవాలను జరపాలని సూచించారు. బ్రిటిష్ కాలంలో అహ్మదాబాద్ నగరపాలక సంస్థగా ఉందని, అప్పుడు సర్దార్ వల్లభ్‌బాయ్‌పటేల్ మేయర్‌గా వ్యవహరించారని గుర్తు చేశారు. -
యూపీలో కమలదళం రోడ్ మ్యాప్
సాక్షి, న్యూఢిల్లీ: వచ్చే ఏడాది జరుగనున్న ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార పీఠాన్ని మరోసారి అధిరోహించేందుకు కమలదళం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికల ప్రచార వ్యూహంపై ఉత్తరప్రదేశ్ ఎన్నికల ఇన్ఛార్జ్తో సహా పలువురు బీజేపీ నేతలు కసరత్తు చేసి రోడ్‌మ్యాప్ రెడీ చేశారని పార్టీ వర్గాలు తెలిపాయి. యూపీ, పంజాబ్, ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్ రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధికంగా ఉత్తరప్రదేశ్‌పైనే పార్టీ పెద్దలు ఫోకస్ పెట్టినట్లు విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. అందులో భాగంగానే వచ్చే నెలన్నరలోపు ఉత్తరప్రదేశ్‌లోని అన్ని ప్రాంతాల్లో 200కి పైగా ర్యాలీలు, కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించారు. వీటి బాధ్యతలను 30మందికి పైగా కేంద్రమంత్రులకు అప్పగించారు. తొలిదశలో భాగంగా వచ్చే 30 రోజుల్లో 18 మంది కేంద్రమంత్రులు ఉత్తరప్రదేశ్‌లోని వివిధ జిల్లాలు, ప్రాంతాల్లో ర్యాలీలు, వివిధ కార్యక్రమాల్లో పాల్గొనాలని సూచించారని పార్టీ వర్గాలు తెలిపాయి. వీటితోపాటు ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా, పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా సహా మరికొందరు కీలక నేతల ఎన్నికల ర్యాలీలు ఉత్తరప్రదేశ్‌లోనే ఎక్కువగా జరుగనున్నాయి. రానున్న 45 రోజుల పాటు ప్రతిరోజూ పార్టీకి సంబంధించిన కీలక నేతలు ఎవరో ఒకరు ఉత్తరప్రదేశ్‌లో ర్యాలీ, కార్యక్రమం ద్వారా ప్రజలతో సన్నిహితంగా ఉండేలా ప్రణాళిక సిద్ధం చేసినట్లు ప్రచార వ్యూహంతో సంబంధం ఉన్న పార్టీ నేత ఒకరు తెలిపారు. అంతేగాక రాబోయే 30 రోజుల్లో ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షాలకు సంబంధించి యూపీలో అత్యధిక పర్యటనలు ఉండనున్నాయి. వచ్చే రెండు నెలల పర్యటన షెడ్యూల్ సైతం ఖరారు చేసే పనిలో కమలదళం బిజీగా ఉంది. నేటి నుంచి ప్రధాని మోదీ ఉత్తరప్రదేశ్‌లోని పలు కీలక కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. నేడు సుల్తాన్పూర్ జిల్లాలో పూర్వాంచల్ ఎక్స్‌ప్రెస్‌వేను మోదీ ప్రారంభించనున్నారు. 19న ప్రధాని బుందేల్‌ఖండ్ వెళ్ళే అవకాశం ఉందని తెలిసింది. నవంబర్ 20న లక్నోలో జరుగనున్న దేశవ్యాప్త డీజీపీ, ఐజీ స్థాయి పోలీసు అధికారుల కార్యాక్రమంలో ప్రధాని, హోంమంత్రి పాల్గొననున్నారు. ఈ సందర్భంగా ఉత్తరప్రదేశ్‌లోని పలు భారీ ప్రాజెక్టులను ప్రారంభించేలా ప్రణాళికలు సిద్ధం అవుతున్నాయని సమాచారం. ఇందులో బుందేల్‌ఖండ్ ఎక్స్‌ప్రెస్‌వే, కాశీ విశ్వనాథ్ కారిడార్, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, ఫెర్టిలైజర్ ఫ్యాక్టరీ సహా పలు భారీ ప్రాజెక్టులకు ప్రధాని మోదీ ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తారని సమాచారం. -
మాట నిలబెట్టుకుంటాం
సాక్షి, న్యూఢిల్లీ: వచ్చే ఏడాది జరగనున్న ఉత్తరప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ ‘హమ్ వచన్ నిభాయేంగే’ (మాట నిలబెట్టుకుంటాం) అనే నూతన నినాదంతో ప్రజల్లోకి వెళ్తోంది. రాష్ట్రంలో తమ పార్టీ అధికారంలోకి వస్తే అమలు చేయబోయే ఏడు వాగ్దానాలను కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి ప్రియాంకాగాంధీ వాద్రా శనివారం ప్రకటించారు. కాంగ్రెస్ ఆధ్వర్యంలో ప్రతిజ్ఞా యాత్రలను ఆమె బారాబంకీలో పచ్చజెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. యూపీలో తాము అధికారంలోకి వస్తే 20 లక్షల మంది యువతకు ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. రైతుల రుణాలను మొత్తం మాఫీ చేస్తామని వెల్ల డించారు. గోధుమలు, ధాన్యానికి క్వింటాల్‌కు రూ.2,500 కనీస మద్దతు ధర కల్పిస్తామని పేర్కొన్నారు. చెరుకు పంటను క్వింటాల్‌కు రూ.400 ధరతో కొంటామన్నారు. అన్ని రకాల విద్యుత్ బిల్లులను సగానికి తగ్గిస్తామన్నారు. అంతేకాకుండా కరోనా వల్ల ఆర్థికంగా నష్టపోయిన కుటుంబాలకు రూ.25 వేల చొప్పున సాయం అందజేస్తామని ఉద్ఘాటించారు. వచ్చే ఎన్నికల్లో మహిళలకు 40 శాతం టిక్కెట్లు కేటాయిస్తామన్నారు. అధికారంలోకి వస్తే.. 12వ తరగతి బాలికలకు స్మార్ట్ ఫోన్లు, గ్రాడ్యుయేషన్ చదువుతున్న విద్యార్థినులకు ఈ–సూ్కటర్లు ఇస్తామని ఇంతకు ముందే హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. శనివారం ప్రారంభమైన ఈ యాత్ర అవధ్లోని బారాబంకీ, బుందేల్‌ఖండ్ జిల్లాలను కలుపుతూ ఝాన్సీ వరకు సాగుతుంది. -
యూపీలో పోటీ చేసి వాటా సాధిస్తాం
న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ముస్లిం వాటాను సాధించడమే లక్ష్యంగా 2022 అసెంబ్లీ ఎన్నికల్లో తాము పోటీ చేస్తామని ఏఐఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ స్పష్టం చేశారు. శుక్రవారం జరిగిన ఓ టీవీ చర్చా కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. రాజకీయాల్లో ముస్లింలకు నామమాత్రపు ప్రాతినిధ్యం ఉండాలని తాము కోరుకోవడం లేదన్నారు. ‘రాష్ట్ర రాజకీయాల్లో మా వంతు కావాలని అడుగుతున్నాం. దానిని మేం పొందుతాం’ అని చెప్పారు. ఏఐఎంఐఎం మతాన్ని రాజకీయ లబ్ధికి వాడుకుంటోందన్న ప్రతిపక్షాల విమర్శలపై ఆయన స్పందిస్తూ..‘ఇది నిజం కాదు. మతాన్ని రాజకీయ లాభం కోసం నేనెన్నడూ వాడలేదు. వాడను. అలా చేసినట్లయితే, ఎన్నికల సంఘం, ఎన్నికల నియామావళి ఉన్నాయి కదా..’ అని తెలిపారు. ‘రాజకీయాల్లో మా వాటా కోరుతుండటం వారికి సమస్యగా మారింది. మేం ఎప్పుడూ భయపడుతూ బానిసల్లాగా ఉండాలని వారనుకుంటున్నారు’ అని పేర్కొన్నారు. -
పాంచ్ పటాకా పేలింది...!
న్యూఢిల్లీ : కౌంటింగ్‌కు ముందే పాంచ్ పటాకా పేలింది. దేశవ్యాప్తంగా ఆసక్తి రేపిన ఐదు రాష్ట్రాల ఎన్నికలకు సంబంధించి కీలకమైన పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. మరో 48 గంటల్లో అభ్యర్థుల భవితవ్యం తేలనుంది. ఈలోపే ఎన్నికలకు సంబంధించి ప్రజా అభిప్రాయ ఫలితాలు (ఎగ్జిట్ పోల్స్) గురువారం సాయంత్రం విడుదలయ్యాయి. యూపీ, పంజాబ్, ఉత్తరాఖండ్, మణిపూర్, గోవాల్లో ఎవరు గెలుస్తారన్నదే ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఎగ్జిట్ పోల్స్ ప్రకారం పంజాబ్ కాంగ్రెస్, యూపీలో అతిపెద్ద పార్టీగా బీజేపీ, రెండో స్థానంలో ఎస్పీ కూటమి, మూడో స్థానంతో సరిపెట్టుకున్న బీఎస్పీ... ఉత్తరాఖండ్, మణిపూర్‌లో కమలం వికసించనుందని ఎగ్జిట్ పోల్స్ అంచనా. గోవా విషయానికి వస్తే కాంగ్రెస్, బీజేపీ మధ్య టగ్ ఆఫ్ వార్ జరగనుంది. ఉత్తరప్రదేశ్ : అతి పెద్ద రాష్ట్రం, దేశ రాజకీయాలకు గుండెకాయలాంటి ఉత్తర ప్రదేశ్‌లో కమలం రెపరెపలాడుతున్నట్లు ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి. ఈ రాష్ట్రం యావత్ దేశంలోనే అత్యంత కీలకం. అక్కడ గెలిస్తే ఢిల్లీకి దారి దగ్గరవుతుందనేది నానుడి. అందుకే ఆ రాష్ట్రంలో పాగా వేయడానికి ప్రధాన పార్టీలు సర్వశక్తులూ ఒడ్డాయి. తాజా ఎగ్జిట్ పోల్స్ తో యూపీలో బీజేపీ వనవాసం ముగుస్తున్నట్లే కనిపిస్తోంది. పంజాబ్ : ఇంతకాలం పంజాబ్‌లో రెండు పార్టీల పాలనే. అయితే కాంగ్రెస్, లేకుంటే అకాలీదళ్ కూటమి. తాజాగా ఇప్పుడు ఆమ్ ఆద్మీ రూపంలో బలమైన పార్టీ ప్రజల ముందుకు వచ్చింది. దీంతో 117 స్థానాలు ఉన్న పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల చరిత్రలో తొలిసారి ముక్కోణపు పోటీ జరిగింది. హోరాహోరీగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు 62-71 స్థానాలు దక్కనున్నాయని ఇండియా టుడే-యాక్సిస్ సర్వే తేల్చింది. అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) 42-51 స్థానాలు సాధించనుందని తెలిపింది. ఇక అధికార శిరోమణి అకాలీ దళ్-బీజేపీ కూటమికి కేవలం 4 నుంచి 7 సీట్లు మాత్రమే ఈ సర్వే తేల్చింది. అలాగే బీజేపీ ఇక్కడ చతికిలపడిందనే చెప్పవచ్చు. ఉత్తరాఖండ్ : చిన్నరాష్ట్రం అయిన ఉత్తారాఖండ్ రాష్ట్రంలో కూడా తమిళనాడు, కేరళ తరహా వ్యవహారమే. ఎన్నికలు జరిగినప్పుడల్లా ప్రభుత్వాలను మార్చడం ఆ రాష్ట్ర ప్రజల ఆనవాయితీ. ఈసారి కూడా అదే పద్ధతి అనుసరించి... కాంగ్రెస్‌కు హ్యాండ్ ఇచ్చి...కమలం చేతపట్టారు. ఇక మొత్తం 70 అసెంబ్లీ స్థానాలు ఉత్తరాఖండ్‌లో ఎగ్జిట్ పోల్స్ ప్రకటన సందర్భంగా పలు నేషనల్ ఛానల్స్ బీజేపీ గెలుపుకే మొగ్గుచూపగా.. కాంగ్రెస్ ను రెండో స్థానానికి పరిమితం చేశాయి. గోవా: ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో గోవా ఎన్నికలు కూడా అందరినీ ఆకర్షించాయి. రక్షణమంత్రి మనోహర్ పారీకర్ సొంత రాష్ట్రం కావడంతో గోవాపై ప్రత్యేక ఆసక్తి నెలకొంది. ఇప్పటి వరకు ఇక్కడ బీజేపీ, కాంగ్రెస్ మధ్యే పోటీ జరగ్గా... ఈసారి 4 స్తంభాలాటగా తప్పలేదు. ఆమ్ ఆద్మీ పార్టీతో పాటు ఎంజీపీ కూటమి కూడా సెగలు పొగలు పుట్టించింది. కాగా గోవా అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీకి కూడా స్పష్టమైన మెజారిటీ దక్కబోదని ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు అంచనా వేస్తున్నాయి. న్యూస్ ఎక్స్-ఎమ్మార్సీ సర్వే ప్రకారం 40 స్థానాలున్న గోవాలో బీజేపీకి 15 స్థానాలు, కాంగ్రెస్‌కు 10 స్థానాలు, ఆప్‌కు 7 స్థానాలు, ఇతరులకు 6 స్థానాలు దక్కనున్నట్టు అంచనా వేసింది. గోవాలో హంగ్ అసెంబ్లీ ఏర్పాటయ్యే అవకాశముందని, ఇక్కడ ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రానిపక్షంలో ఆప్, ఇతరులు కీలక పాత్ర పోషించే అవకాశముందని రాజకీయ విశ్లేషణలు వెలువడుతున్నాయి. మణిపూర్ : ఎన్నికలంటే రాజకీయ పార్టీలకు పండగే. ప్రచార ఆర్భాటాలు, వ్యూహ ప్రతివ్యూహాలతో... ఒక విధమైన సందడి కనిపిస్తుంది. కాని ఈశాన్య రాష్ట్రం మణిపూర్‌లో సైలెంట్‌గా ఎన్నికలు జరిగిపోయాయి. నాగాల ఆర్థిక దిగ్బంధం ప్రభావం ఉన్నా.. ఓటర్లు మాత్రం ఉత్సాహంగా ఓటుహక్కు వినియోగించుకున్నారు. ఈసారి మణిపూర్ ఎన్నికల్లో సరికొత్త కెరటం రాజకీయ రంగప్రవేశం చేసింది. ఆమె ఉక్కుమహిళ ఇరోం షర్మిల. సాయుధ దళాల ప్రత్యేక అధికారాల చట్టానికి వ్యతిరేకంగా ఉద్యమించిన షర్మిల... పీపుల్స్ రీసర్జెన్స్ అండ్ జస్టిస్ అలయెన్స్ పీఆర్‌జేఏ అనే పార్టీని స్థాపించి రాజకీయ అరంగేట్రం చేశారు. కాగా మణిపూర్ లో తొలిసారిగా బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేయనుందని ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెల్లడించాయి. అన్ని ఎగ్జిట్ పోల్స్ కమలం పార్టీకే పట్టం కట్టాయి. -
బెనారస్ బాధపడుతోంది..
వారణాసి: ఉత్తరప్రదేశ్ లో పాతికేళ్లకుపైగా దూరమైన అధికారాన్ని తిరిగి చేజిక్కించుకునేందుకు కాంగ్రెస్ పార్టీ సర్వశక్తులు ఒడ్డుతోంది. వచ్చే ఏడాది జరగనున్న ఎన్నికల కోసం ఇప్పటికే కాంగ్రెస్ ఉద్ధండ నాయకులను, వ్యూహకర్తలు యూపీలో తమపనితాము చేసుకుపోతున్నారు. ఆ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ కూడా మంగళవారం రంగంలోకిదిగారు. 'కొడితే కుంభస్థలాన్నే..' అన్నట్లు సరాసరి ప్రధాని నరేంద్ర మోదీ సొంత నియోజకవర్గం వారణాసి (కాశీ లేదా బెనారస్)లో బలప్రదర్శనకు దిగారు. 'దర్ద్-ఎ-బెనారస్' (బెనారస్ బాధపడుతోంది) పేరుతో భారీ రోడ్ షో నిర్వహించనున్న ఆమె.. సాయంత్రం బహిరంగ సభలో మాట్లాడతారు. ఉదయం 11 గంటలకు వారణాసి చేరుకున్న అధినేత్రికి పార్టీ శ్రేణులు ఘనస్వాగతం పలికాయి. నేరుగా సర్క్యూట్ హౌస్ కు వెళ్లిన సోనియా.. పార్టీ ముఖ్యులతో భేటీ అవుతారు. మధ్యాహ్నం ప్రారంభంకానున్న ర్యాలీలో 10వేల మంది బైకర్లతో కలిసి ఓపెన్ టాప్ జీపులో వారణాసి ప్రధాన రహదారుల గుండా 6.5 కిలోమీటర్లు సోనియా రోడ్ షో చేస్తారు. అధినేత్రి రాక ఒక్కసారిగా కాంగ్రెస్ కార్యక్తల్లో జోష్ నింపింది. బుధవారం రాజ్యసభ ముందుకు వస్తుసేవల పన్ను (జీఎస్టీ) బిల్లు రానున్నవేళ.. ఒక రోజు ముందే ప్రధాని నియోజకవర్గంలో నిలబడి, మోదీపై, బీజేపీపై తీవ్రస్థాయిలో విరుచుపడనున్నారు. సోనియాగాంధీ. బీజేపీ హయాంలో దళితులు, మైనారిటీలపై జరుగుతోన్న దాడులు, ఆకాశాన్నింటిన నిత్యావసరాల ధరలు తదితర కీలక సమస్యలపై సోనియా మాట్లాడతారు. 25 ఏళ్లుగా కాంగ్రెస్ పాలనలోలేని యూపీ ఏ విధంగా వెనుకబడిపోయిందో ఓటర్లకు వివరించనున్నారామె. సోనియా గాంధీ ప్రచారంపై స్పందిస్తూ యూపీ కాంగ్రెస్ చీఫ్ రాజ్ బబ్బర్ ఆసక్తికర వ్యాఖ్యలుచేశారు. 'యూపీలో మేం గెలవాలంటే ఏదో చమత్కారం జరగాలి. 2014లో అలాంటి చమత్కారం వల్లే మంచి ఫలితాలు సాధించాం' అని రాజ్ బబ్బర్ అన్నారు. ముఖ్యమంత్రి అభ్యర్థిని షీలా దీక్షిత్ తో కలిసి ఆయనకూడా సోనియాగాంధీ రోడ్ షోలో పాల్గొన్నారు. ప్రధానమంత్రి నేతృత్వం వహిస్తున్న వారణాసి నియోజకవర్గంలో తిష్టవేసిన సమస్యలను కాంగ్రెస్ నాయకులు ఎకరువుపెట్టారు.