పాంచ్‌ పటాకా పేలింది...! | Exit polls 2017: BJP to be biggest party in Uttarpradesh | Sakshi
Sakshi News home page

పాంచ్‌ పటాకా పేలింది...!

Published Thu, Mar 9 2017 6:21 PM | Last Updated on Fri, Mar 29 2019 9:31 PM

పాంచ్‌ పటాకా పేలింది...! - Sakshi

పాంచ్‌ పటాకా పేలింది...!

న్యూఢిల్లీ : కౌంటింగ్‌కు ముందే పాంచ్‌ పటాకా పేలింది. దేశవ్యాప్తంగా ఆసక్తి రేపిన ఐదు రాష్ట్రాల ఎన్నికలకు సంబంధించి కీలకమైన పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. మరో 48 గంటల్లో అభ్యర్థుల భవితవ్యం తేలనుంది. ఈలోపే ఎన్నికలకు సంబంధించి ప్రజా అభిప్రాయ ఫలితాలు (ఎగ్జిట్‌ పోల్స్‌) గురువారం సాయంత్రం  విడుదలయ్యాయి. యూపీ, పంజాబ్, ఉత్తరాఖండ్‌, మణిపూర్, గోవాల్లో ఎవరు గెలుస్తారన్నదే ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

ఎగ్జిట్ పోల్స్‌ ప్రకారం పంజాబ్‌ కాంగ్రెస్‌, యూపీలో అతిపెద్ద పార్టీగా బీజేపీ, రెండో స్థానంలో ఎస్పీ కూటమి, మూడో స్థానంతో సరిపెట్టుకున్న బీఎస్పీ... ఉత్తరాఖండ్‌, మణిపూర్‌లో కమలం వికసించనుందని ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనా. గోవా విషయానికి వస్తే కాంగ్రెస్‌, బీజేపీ మధ్య టగ్‌ ఆఫ్‌ వార్‌ జరగనుంది.


ఉత్తరప్రదేశ్‌ : అతి పెద్ద రాష్ట్రం, దేశ రాజకీయాలకు గుండెకాయలాంటి ఉత్తర ప్రదేశ్‌లో కమలం రెపరెపలాడుతున్నట్లు ఎగ్జిట్ పోల్స్‌ చెబుతున్నాయి. ఈ  రాష్ట్రం యావత్ దేశంలోనే అత్యంత కీలకం. అక్కడ గెలిస్తే ఢిల్లీకి దారి దగ్గరవుతుందనేది నానుడి. అందుకే ఆ రాష్ట్రంలో పాగా వేయడానికి ప్రధాన పార్టీలు సర్వశక్తులూ ఒడ్డాయి. తాజా ఎగ్జిట్‌ పోల్స్‌ తో యూపీలో బీజేపీ వనవాసం ముగుస్తున్నట్లే కనిపిస్తోంది.

పంజాబ్‌ : ఇంతకాలం పంజాబ్‌లో రెండు పార్టీల పాలనే. అయితే కాంగ్రెస్‌, లేకుంటే అకాలీదళ్ కూటమి. తాజాగా ఇప్పుడు ఆమ్ ఆద్మీ రూపంలో బలమైన పార్టీ ప్రజల ముందుకు వచ్చింది. దీంతో  117 స్థానాలు ఉన్న పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల చరిత్రలో తొలిసారి ముక్కోణపు పోటీ జరిగింది. హోరాహోరీగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు  62-71 స్థానాలు దక్కనున్నాయని ఇండియా టుడే-యాక్సిస్‌ సర్వే తేల్చింది. అరవింద్‌ కేజ్రీవాల్‌ నేతృత్వంలోని ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌)  42-51 స్థానాలు సాధించనుందని తెలిపింది. ఇక అధికార శిరోమణి అకాలీ దళ్‌-బీజేపీ కూటమికి కేవలం 4 నుంచి 7 సీట్లు మాత్రమే ఈ సర్వే తేల్చింది. అలాగే బీజేపీ ఇక్కడ చతికిలపడిందనే చెప్పవచ్చు.

ఉత్తరాఖండ్‌ : చిన్నరాష్ట్రం అయిన ఉత్తారాఖండ్‌ రాష్ట్రంలో కూడా తమిళనాడు, కేరళ తరహా వ్యవహారమే. ఎన్నికలు జరిగినప్పుడల్లా ప్రభుత్వాలను మార్చడం ఆ రాష్ట్ర ప్రజల ఆనవాయితీ. ఈసారి కూడా అదే పద్ధతి అనుసరించి... కాంగ్రెస్‌కు హ్యాండ్‌ ఇచ్చి...కమలం చేతపట్టారు. ఇక మొత్తం 70 అసెంబ్లీ స్థానాలు ఉత్తరాఖండ్‌లో ఎగ్జిట్ పోల్స్ ప్రకటన సందర్భంగా పలు నేషనల్ ఛానల్స్ బీజేపీ గెలుపుకే మొగ్గుచూపగా.. కాంగ్రెస్ ను రెండో స్థానానికి పరిమితం చేశాయి.

గోవా: ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో గోవా ఎన్నికలు కూడా అందరినీ ఆకర్షించాయి. రక్షణమంత్రి మనోహర్ పారీకర్ సొంత రాష్ట్రం కావడంతో గోవాపై ప్రత్యేక ఆసక్తి నెలకొంది. ఇప్పటి వరకు ఇక్కడ బీజేపీ, కాంగ్రెస్ మధ్యే పోటీ జరగ్గా... ఈసారి 4 స్తంభాలాటగా తప్పలేదు. ఆమ్ ఆద్మీ పార్టీతో పాటు ఎంజీపీ కూటమి కూడా సెగలు పొగలు పుట్టించింది.

కాగా గోవా అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీకి కూడా స్పష్టమైన మెజారిటీ దక్కబోదని ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాలు అంచనా వేస్తున్నాయి. న్యూస్‌ ఎక్స్‌-ఎమ్మార్సీ సర్వే ప్రకారం 40 స్థానాలున్న గోవాలో బీజేపీకి 15 స్థానాలు, కాంగ్రెస్‌కు 10 స్థానాలు, ఆప్‌కు 7 స్థానాలు, ఇతరులకు 6 స్థానాలు దక్కనున్నట్టు అంచనా వేసింది. గోవాలో హంగ్‌ అసెంబ్లీ ఏర్పాటయ్యే అవకాశముందని, ఇక్కడ ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రానిపక్షంలో ఆప్‌, ఇతరులు కీలక పాత్ర పోషించే అవకాశముందని రాజకీయ విశ్లేషణలు వెలువడుతున్నాయి.

మణిపూర్‌ : ఎన్నికలంటే రాజకీయ పార్టీలకు పండగే. ప్రచార ఆర్భాటాలు, వ్యూహ ప్రతివ్యూహాలతో... ఒక విధమైన సందడి కనిపిస్తుంది. కాని ఈశాన్య రాష్ట్రం మణిపూర్‌లో సైలెంట్‌గా ఎన్నికలు జరిగిపోయాయి.  నాగాల ఆర్థిక దిగ్బంధం ప్రభావం ఉన్నా.. ఓటర్లు మాత్రం ఉత్సాహంగా ఓటుహక్కు వినియోగించుకున్నారు. ఈసారి మణిపూర్‌ ఎన్నికల్లో సరికొత్త కెరటం రాజకీయ రంగప్రవేశం చేసింది. ఆమె ఉక్కుమహిళ ఇరోం షర్మిల.

సాయుధ దళాల ప్రత్యేక అధికారాల చట్టానికి వ్యతిరేకంగా ఉద్యమించిన షర్మిల... పీపుల్స్‌ రీసర్జెన్స్‌ అండ్‌ జస్టిస్‌ అలయెన్స్‌ పీఆర్‌జేఏ అనే పార్టీని స్థాపించి రాజకీయ అరంగేట్రం చేశారు. కాగా మణిపూర్ లో తొలిసారిగా బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేయనుందని ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెల్లడించాయి. అన్ని ఎగ్జిట్ పోల్స్ కమలం పార్టీకే పట్టం కట్టాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement