
న్యూఢిల్లీ/వారణాసి: రాజకీయాలకతీతంగా మీమీ ప్రాంత ప్రజలతో మమేకం అవ్వండి అని ప్రధాని మోదీ ఉత్తరప్రదేశ్‌కు చెందిన బీజేపీ ఎంపీలకు హితబోధ చేశారు. శుక్రవారం ఆయన యూపీ బీజేపీ ఎంపీలతో అల్పాహార విందు కార్యక్రమంలో పాల్గొన్నారు. త్వరలో యూపీ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఈ విందుకు ప్రాధాన్యత సంతరించుకుంది. ఎన్నికల అంశాలేవీ సమావేశంలో చర్చించలేదని వార్తలొచ్చాయి. ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’లో భాగంగా వివిధ కార్యక్రమాల నిర్వహణపై ఎంపీలతో మోదీ ముచ్చటించారు.
పార్టీలకతీతంగా సొంత నియోజకవర్గాల్లోని సీనియర్లతో ఎంపీలు తరచూ మాట్లాడాలని, యువకులకు క్రీడాపోటీలు నిర్వహించాలని, అందరితో మమేకం కావాలని నేతలకు మోదీ సూచించారు. ఈ విందులో 36 మంది పాల్గొన్నారు. మరోవైపు, ఇటీవల కాశీ విశ్వనాథ్ కారిడార్ నిర్మాణ కార్మికులతో కలిసి భోజనం చేసినందుకు ప్రధానిని పలువురు ఎంపీలు ప్రశంసించారు. అది సాధారణ జనాల్లోకి మంచి సందేశాన్ని తీసుకెళ్లిందని ప్రధానిని కొనియాడారు. పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో భాగంగా బీజేపీ ఎంపీలతో ప్రధాని అల్పాహార విందులో ఈ సమావేశం నాలుగోది. అంతకుముందు ఈశాన్యరాష్ట్రాలు, దక్షిణాది, మధ్య ప్రదేశ్ ఎంపీలతో వేర్వేరు సమావేశాలు జరిగాయి.
నిర్లక్ష్య నగరాలపై దృష్టిపెట్టండి
పరిశుభ్రతను నిర్లక్ష్యం చేస్తున్న నగరాల జాబితాను తయారు చేసి, స్వచ్ఛత దిశగా వారిపై ఒత్తిడి పెంచాలని ప్రధాని మోదీ ప్రజలకు పిలుపునిచ్చారు. వారణాసిలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మేయర్ల సదస్సులో పాల్గొన్న 120 మంది మేయర్లనుద్దేశించి మోదీ ప్రసంగించారు. నదులను ప్రజలు కాపాడుకునేలా నదులున్న నగరాలన్నీ ‘నదీ ఉత్సవ్’ను జరపాలని సూచించారు. చాలా నగరాల్లో నదులు డ్రైనేజీల్లా మారాయని, పరిశుభ్రతపై శీతకన్ను చూపుతున్న నగరాల జాబితాను సిద్ధంచేయాలని, వాటి నిర్లిప్త వైఖరిని ఎండగట్టాలని, అప్పుడే ప్రజాక్షేత్రంలో ఒత్తిడి పెరిగి మంచి ఫలితాలొస్తాయన్నారు. ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’లో భాగంగా మేయర్లు నగర వ్యవస్థాపక దినోత్సవాలను జరపాలని సూచించారు. బ్రిటిష్ కాలంలో అహ్మదాబాద్ నగరపాలక సంస్థగా ఉందని, అప్పుడు సర్దార్ వల్లభ్‌బాయ్‌పటేల్ మేయర్‌గా వ్యవహరించారని గుర్తు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment