న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ముస్లిం వాటాను సాధించడమే లక్ష్యంగా 2022 అసెంబ్లీ ఎన్నికల్లో తాము పోటీ చేస్తామని ఏఐఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ స్పష్టం చేశారు. శుక్రవారం జరిగిన ఓ టీవీ చర్చా కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. రాజకీయాల్లో ముస్లింలకు నామమాత్రపు ప్రాతినిధ్యం ఉండాలని తాము కోరుకోవడం లేదన్నారు. ‘రాష్ట్ర రాజకీయాల్లో మా వంతు కావాలని అడుగుతున్నాం. దానిని మేం పొందుతాం’ అని చెప్పారు. ఏఐఎంఐఎం మతాన్ని రాజకీయ లబ్ధికి వాడుకుంటోందన్న ప్రతిపక్షాల విమర్శలపై ఆయన స్పందిస్తూ..‘ఇది నిజం కాదు. మతాన్ని రాజకీయ లాభం కోసం నేనెన్నడూ వాడలేదు. వాడను. అలా చేసినట్లయితే, ఎన్నికల సంఘం, ఎన్నికల నియామావళి ఉన్నాయి కదా..’ అని తెలిపారు. ‘రాజకీయాల్లో మా వాటా కోరుతుండటం వారికి సమస్యగా మారింది. మేం ఎప్పుడూ భయపడుతూ బానిసల్లాగా ఉండాలని వారనుకుంటున్నారు’ అని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment