
వసుంధర సంతకం చేసిన పత్రాలివిగో!
వివాదాస్పద క్రికెట్ సామ్రాజ్యాధినేత లలిత్ మోదీ ఇమ్మిగ్రేషన్ దరఖాస్తును పరిశీలించాలంటూ రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధరా రాజె సంతకం చేసిన పత్రాలను కాంగ్రెస్ పార్టీ బయటపెట్టింది. 'మోదీ గేట్' స్కాములో సుష్మాస్వరాజ్, వసుంధర రాజెల ప్రమేయం ఉందంటూ ఇన్నాళ్లుగా చేస్తున్న వాదనకు తొలిసారి ఒక పత్రాన్ని ఆధారంగా కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జైరాం రమేష్ చూపించారు. ఇన్నాళ్లుగా ఆమె అబద్ధాలు ఆడుతూనే ఉన్నారని.. ఇక ఇప్పుడు మాత్రం ఆమెను సీఎం పదవి నుంచి తొలగించడం తప్ప ప్రధాని నరేంద్ర మోదీకి మరో ప్రత్యామ్నాయం ఏమీ లేదని ఆయన అన్నారు. 2011 ఆగస్టు 18వ తేదీన లలిత్ మోదీకి మద్దతు పలుకుతూ వసుంధర రాజె సంతకం చేశారంటున్న ఏడు పేజీల డాక్యుమెంటును ఆయన మీడియా సమావేశంలో చూపించారు.
ఆ పత్రంలో రాజె రాసినట్లుగా ఇలా ఉంది... ''లలిత్ మోదీ దాఖలు చేసిన ఏ ఇమ్మిగ్రేషన్ దరఖాస్తుకైనా నా మద్దతు ఉంటుందని ప్రకటిస్తున్నాను. అయితే, నా సాయం భారత అధికారులకు మాత్రం తెలియకూడదన్న గట్టి నిబంధనతోనే ఇలా చేస్తున్నాను'' అని అందులో ఉంది. ఐపీఎల్ కుంభకోణం బయటపడిన దాదాపు ఏడాది తర్వాత ఈ డాక్యుమెంటు వెలుగులోకి వచ్చింది. లలిత్ మోదీ ఈ డాక్యుమెంటును ఇంగ్లండ్ కోర్టులో సమర్పించేనాటికి వసుంధరా రాజె రాజస్థాన్ అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా ఉండేవారు. అప్పటికే లలిత్ మోదీ పాస్పోర్టును భారతదేశంలో రద్దుచేశారు కూడా.
వివరణ కోరిన బీజేపీ?
కాగా, ఈ వ్యవహారంపై వివరణ ఇవ్వాల్సిందిగా వసుంధరా రాజేను బీజేపీ కోరినట్లు తెలుస్తోంది. ఈ విషయంపై ద్విసభ్య కమిటీ ఒకదాన్ని వేసిందని, అందులో కేంద్ర మంత్రి జేపీ నడ్డా ఒక సభ్యుడని జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. అయితే ఇది ఇంకా అధికారికంగా ధ్రువీకరణ కాలేదు.