
ఏటీఎం వద్ద క్యూలో రాహుల్ గాంధీ
న్యూఢిల్లీ: కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ శుక్రవారం కొత్త నోట్లను విత్ డ్రా చేసుకోవడానికి పార్లమెంటు వీధిలోని ఎస్ బీఐ ఏటీఎం వద్దకు వచ్చారు. సాధారణ ప్రజలతో పాటే క్యూ లో వేచి చూశారు. గంటల తరబడి క్యూలో వేచి వున్న చిల్లర బాధితులను ఆయన పరామర్శించారు.
అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన నాలుగు వేల రూపాయలు విత్ డ్రా చేసుకునేందుకు తాను ఏటీఎం వద్దకు వచ్చినట్లు చెప్పారు. నల్లధనం పేరుతో ప్రజలకు మోదీ ప్రభుత్వం నరకం చూపుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. కాగా, నేటి నుంచి ఏటీఎంలలో డబ్బును విత్ డ్రా చేసుకోవచ్చని ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో దేశవ్యాప్తంగా ఏటీఎంల వద్ద ప్రజలు బారులుతీరారు. ఏటీఎంల వద్ద రద్దీ విపరీతంగా ఉండటంతో భద్రతను పెంచాలని కేంద్ర హోంశాఖ రాష్ట్రాలను ఆదేశాలు జారీ చేసింది.