కార్పొరేట్ జాబ్స్ వదిలేస్తున్నారు!
బెంగళూరు: చదువుకున్న వాడికంటే చదువులేనోడే నయం అన్నది పాత సామెత. కార్పొరేట్ కొలువుకు కన్నా క్యాబ్ డ్రైవర్ ఉద్యోగం మేలన్నది నేటి ట్రెండ్. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది అక్షరాల నిజం. ఎగ్జిక్యూటివ్ జాబ్స్ సైతం వదిలేసి కారు డ్రైవర్ పోస్టులకు క్యూ కడుతున్నారు. నమ్మలేక పోతున్నారా అయితే మీరు మొహిత్ ఆర్ గురించి తెలుసుకోవాల్సిందే.
బ్రిటన్ లోని లీడ్స్ మెట్రోపాలిటన్ యూనివర్సిటీ నుంచి మొహిత్ కార్పొరేట్ ఫైనాన్స్ లో ఎంబీఏ చేశాడు. సీమెన్స్, హెచ్ఎస్ బీసీ, ఎర్నెస్ట్ అండ్ యంగ్ వంటి ప్రతిష్టాత్మక సంస్థల్లో పనిచేశాడు. గత ఏప్రిల్ లో ఉద్యోగానికి గుడ్ బై చెప్పేసి 'ఉబర్' డ్రైవర్ గా మారిపోయాడు. ఇప్పుడు నెలకు రూ. 80 వేలకు సంపాదిస్తున్నానని 28 ఏళ్ల మొహిత్ తెలిపాడు. ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలు వదిలేసినందుకు తానేమీ బాధ పడడం లేదని ఏదోక రోజు సొంతంగా స్టార్టప్ మొదలు పెడతానని దీమాగా చెబుతున్నాడు. చాలా మంది కార్పొరేట్ ఎగ్జిక్యూటివ్ లు ఇదే బాటలో పయనిస్తున్నారు. కొందరు పార్ట్ టైమ్ గా ఈ రంగాన్ని ఎంచుకుంటున్నారు. ఇంకొంత మంది డ్రైవింగ్ పట్ల ఉన్న ఆసక్తితో యాప్ ఆధారిత క్యాబ్ సర్వీసుల్లోకి ప్రవేశిస్తున్నారు. నెలకు లక్ష రూపాయలకు వరకు సంపాదిస్తున్నారు.
ఐటీ కంపెనీలో సాఫ్ట్ వేర్ డెవలప్ మెంట్ మేనేజర్ గా పనిచేస్తున్న రఘునాథ్ ఆర్ వారానికి మూడు రోజుల పాటు ఉబర్ క్యాబ్ డ్రైవర్ గా మారిపోతారు. తనకు ఇష్టమైన సమయంలో డ్రైవర్ అవతారం ఎత్తుతానని, తన గౌరవానికి ఎటువంటి భంగం కలగడం లేదని రఘునాథ్ తెలిపారు. ఓ ప్రముఖ కంపెనీలో 8 ఏళ్లు టెక్నికల్ ఇంజనీర్ గా పనిచేసిన దీపక్ ఎస్ తన జాబ్ వదులుకుని ఏడాది క్రితం ఓలా డ్రైవర్ గా చేరిపోయారు. ఇండియన్ క్యాబ్ కంపెనీలో పనిచేయాలన్న ఉద్దేశంతో 'ఓలా'ను ఎంచుకున్నట్టు వెల్లడించారు. తన కారులో వై-ఫై కూడా ఉందని 33 ఏళ్ల దీపక్ తెలిపాడు.
జియోగ్రఫీ, రిమోట్ సెన్సింగ్ లో ఉన్నత విద్యను అభ్యసించిన అరుణ్ కుమార్ యాదవ్... ఓలా డ్రైవర్ గా పనిచేస్తూ నెలకు రూ. 40 వేల వరకు ఆర్జిస్తున్నాడు. క్యాబ్ డ్రైవర్ అవుతానని తెలిస్తే తన చదువుకు ఎక్కువ డబ్బు ఖర్చు చేసే వాడిని కాదని తన తండ్రి జోక్ చేస్తుంటారని యాదవ్ తెలిపాడు. హ్యాండ్ సమ్ శాలరీ అందుకుంటున్న ఎగ్జిక్యూటివ్ లు తమ ఉద్యోగాలు వదులుకుని క్యాబ్ డ్రైవర్లుగా మారేందుకు ఆసక్తి చూపిస్తుండడం తాజా పరిణామం. అభిరుచికి తోడు ఆర్థికంగానూ బాగుండడంతో వాహన చోదకులుగా మారేందుకు ఉన్నత ఉద్యోగులు వెనుకాడడం లేదు.