ఫుడ్, ట్రావెల్, కిరణా.. ఇలా అన్నింటికీ ఇప్పుడు ఆన్‌లైన్ యాప్‌లనే చాలా మంది వినియోగిస్తున్నారు. ముఖ్యంగా రవాణా కోసం అనేక రైడ్ హెయిలింగ్ సర్వీసులు అందుబాటులోకి వచ్చాయి. అయితే వీటి ధరలు ఒక్కో ఫోన్‌లో ఒక్కో రకంగా ఉంటున్నాయని, వేరు ధరలతో వినియోగదారులను మోసగిస్తున్నాయన్న ఆందోళనలు ఇటీవల అధికమయ్యాయి. ఈ నేపథ్యంలో ఢిల్లీకి చెందిన ఒక ఎంట్రప్రెన్యూర్ ఉబర్ (Uber) ధరల అల్గారిథమ్‌పై చేసిన ప్రయోగం రైడ్-హెయిలింగ్ సేవల్లో పారదర్శకత, నైతికత గురించి ఆన్‌లైన్‌లో చర్చకు దారితీసింది.
టెక్కీలకు ప్లేస్‌మెంట్ సర్వీసులు అందించే ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్ అయిన ఇంజనీర్‌హబ్ వ్యవస్థాపకుడు రిషబ్ సింగ్ వివిధ ఫోన్‌లలో, వేరు వేరు బ్యాటరీ స్థాయిలలో ఉబర్ చార్జీలపై ధరలను పరీక్షించి ఆ ఫలితాలను స్క్రీన్ షాట్‌లతో సహా సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ఎక్స్’లో పంచుకున్నారు. ఉబర్ ధరల వ్యత్యాసాన్ని పరీక్షించేందుకు రిషబ్ సింగ్ రెండు ఆండ్రాయిడ్ ఫోన్‌లు, రెండు ఐఫోన్‌లు వినియోగించారు. అన్నింటిలోనూ ఒకే ఉబర్ ఖాతాలోకి లాగిన్ అయ్యారు.ఒకే సమయంలో ఒకే విధమైన రైడ్‌లకు ఛార్జీలు ఎలా మారుతున్నాయో రిషబ్ సింగ్ గమనించారు.
ఆండ్రాయిడ్, ఐవోఎస్ ఫోన్‌లలో ఛార్జీల వ్యత్యాసాలను రిషబ్ సింగ్ గమనించారు. డిస్కౌంట్‌లలోనూ తేడాలు కనిపించాయి. ఒక దాంట్లో 13% తగ్గింపు అని మరో దాంట్లో "50% తగ్గింపు"ను కంపెనీ పేర్కొంది. దీన్నిబట్టి పరికర ప్లాట్‌ఫామ్ ఆధారంగా ఉబర్ ధర భిన్నంగా ఉండవచ్చని తెలుస్తోంది. అయితే ఒకే ఖాతా, లొకేషన్, సమయం ఒకే విధమైన షరతులు ఉన్నప్పటికీ ధరలు మారుతూ కనిపించాయని రిషబ్ సింగ్ పేర్కొన్నారు.
బ్యాటరీ శాతం ప్రభావం
పూర్తిగా ఛార్జ్ చేసిన ఫోన్లతో పోలిస్తే చార్జింగ్ తక్కువగా ఉన్న ఫోన్‌లో ఎక్కువ ఛార్జీలు కనిపించాయి. ఇది ప్రవర్తనా వ్యూహమని, అత్యవసర పరిస్థితుల్లో వినియోగదారులు ఎక్కువ ఛార్జీలు చెల్లించే అవకాశం ఉంటుందని రిషబ్ వివరించారు. తక్కువ బ్యాటరీలు ఉన్న వినియోగదారులు అత్యవసరం కారణంగా అధిక ధరలను అంగీకరించే అవకాశం ఎక్కువగా ఉందని భావించే సిద్ధాంతానికి ఇది అనుగుణంగా ఉందని రాసుకొచ్చారు. దీనినే "బిహేవియరల్ ఎకనామిక్స్" అంటారని, బ్యాటరీ డేటాను తెలుసుకోవడం ద్వారా, ధరల అల్గారిథమ్‌లు వినియోగదారు పరిస్థితులను ఉపయోగించుకుంటాయని వివరించారు.
ఈ ప్రయోగం ద్వారా రైడ్ కంపెనీల చార్జీల పారదర్శకత గురించి ఆందోళనలను ఆయన లేవనెత్తారు. ఛార్జీలను సర్దుబాటు చేయడానికి ఉబర్ అల్గారిథమ్‌లు ఫోన్ల రకం, బ్యాటరీ స్థాయి వంటి వినియోగదారు డేటాను ఉపయోగించుకుంటాయా అని ప్రశ్నించారు. దీనిపై సోషల్ మీడియా వినియోగదారులు కూడా ప్రతిస్పందించారు. రిషబ్ సింగ్ చేసిన ప్రయత్నాన్ని అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment