
ఉబెర్, ఓలా, రాపిడో వంటి రైడ్ హెయిలింగ్ సర్వీస్ ద్వారా ఆటో బుక్ చేసినప్పుడు పేమెంట్ ఆయా రైడ్ యాప్‌లకు కాకుండా నేరుగా తమకే క్యాష్ రూపంలో ఇవ్వాలని డ్రైవర్లు పట్టుబడుతూ ఉంటారు. ఈ విషయంలో అటు డ్రైవర్లకు, ఇటు ప్రయాణికులకు ఇబ్బందులు లేకుండా ప్రముఖ క్యాబ్ అగ్రిగేటర్ సంస్థ ఉబర్ (Uber) కీలక నిర్ణయం తీసుకుంది.
ఉబర్ (Uber) ఆటో రైడ్‌లకు పేమెంట్ విషయంలో కీలక మార్పులు చేసింది. తమ యాప్ ద్వారా ఆటోలు బుక్ చేశాక ఇకపై నేరుగా డ్రైవర్‌కే చెల్లింపులు చేయాలని, ఆటో డ్రైవర్‌కు, ప్రయాణికుడికి మధ్య జరిగే లావాదేవీల విషయంలో ఉబర్ ఎటువంటి జోక్యం చేసుకోదని పేర్కొంది.
‘సాఫ్ట్‌వేర్ యాజ్ ఏ సర్వీస్’ (SaaS) విధానానికి మారుతున్న క్రమంలో ఉబర్ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ కొత్త విధానాన్ని ఫిబ్రవరి 18 నుంచి అమల్లోకి తీసుకొచ్చింది. ఉబెర్ తన అధికారిక బ్లాగ్ పోస్ట్‌లో ఈ మార్పును వివరించింది. తన కార్యకలాపాలను క్రమబద్ధీకరించడానికి, డ్రైవర్లు, ప్రయాణికుల మధ్య ఘర్షణను తగ్గించడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పుకొచ్చింది.
కొత్త మార్పులు ఇవే..
ప్రయాణికులను సమీపంలోని ఆటో డ్రైవర్లతో అనుసంధానించే పని మాత్రమే ఉబర్ చేస్తుంది. ఇంతకు ముందు మాదిరి ఉబర్‌కు డిజిటల్ చెల్లింపులు ఇక ఉండవు. నేరుగా డ్రైవర్‌కే నగదు రూపంలో లేదా యూపీఐ (UPI) రూపంలో ప్రయాణికులు చెల్లించాల్సి ఉంటుంది. ఆటో ట్రిప్‌లకు ఉబర్ క్రెడిట్స్, ప్రమోషన్ ఆఫర్‌లు వర్తించవు. డ్రైవర్ల నుంచి ఉబర్ ఎటువంటి కమీషన్ తీసుకోదు. కేవలం ప్లాట్‌ఫామ్‌ను మాత్రమే అందిస్తుంది. ఎటువంటి క్యాన్సిలేషన్ ఛార్జీలు ఉండవు. ఉబర్ కేవలం ఛార్జీని సూచిస్తుంది. కానీ తుది మొత్తాన్ని డ్రైవర్, ప్రయాణికులే పరస్పరం నిర్ణయించుకోవాలి. కానీ భద్రత విషయంలో మాత్రం ఉబర్ ప్రమేయం ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment