ఏడేళ్లలో రూ.436 కోట్లు! | Corporates paid Rs.379 crore to parties: Report | Sakshi
Sakshi News home page

ఏడేళ్లలో రూ.436 కోట్లు!

Published Thu, Jan 9 2014 4:02 AM | Last Updated on Mon, Sep 17 2018 5:36 PM

ఏడేళ్లలో రూ.436 కోట్లు! - Sakshi

ఏడేళ్లలో రూ.436 కోట్లు!

సాక్షి, న్యూఢిల్లీ: రానున్న లోక్‌సభ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పలు రాజకీయ పార్టీలు ఎన్నికల ప్రచారం కోసం డబ్బు ను మంచినీళ్లలా ఖర్చు చేయడానికి పోటీ పడుతున్నాయి. విరాళాల సేకరణలో అగ్రస్థానంలో ఉన్న బీజేపీ.. లోక్‌సభ ఎన్నికల్లో కనీసం రూ.10 నుంచి గరిష్టంగా రూ. వెయ్యి వరకు ఓటర్ల నుంచి చందాలు సేకరిస్తామంటూ ఇప్పటికే ప్రకటన చేయడం తెలిసిందే.
 
 
  మరోవైపు కాంగ్రెస్ కూడా తన ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీని ఆకాశానికి ఎత్తడానికి రూ.500 కోట్లతో ప్రచారానికి జోరుగా సన్నాహాలు చేస్తోంది. ఈ నేపథ్యంలో అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్, నేషనల్ ఎలక్షన్ వాచ్ బుధవారం ఆసక్తికరమైన గణాంకాలను వెల్లడించాయి. జాతీయ పార్టీలు 2004-05 నుంచి 2011-12 వరకు ఏకంగా రూ.435.87 కోట్ల విరాళాలు సేకరించాయని పేర్కొన్నాయి. వీటిలో ఏకంగా రూ.378.89 కోట్లు కేవలం కార్పొరేట్, వ్యాపార రంగాల నుంచి వచ్చినవే! ఇందులో బీజేపీకి అత్యధికంగా 192.47 కోట్లు అంద గా, రూ.172.25 కోట్లతో కాంగ్రెస్ రెండో స్థానంలో ఉంది. మొత్తంగా బీజేపీకి రూ.226.46 కోట్లు, కాంగ్రెస్‌కు రూ.187.56 కోట్లు, ఎన్సీపీకి రూ.12.35 కోట్లు వచ్చాయి. బీజేపీకి 1,334 కార్పొరేట్ సంస్థలు, కాంగ్రెస్‌కు 418 సంస్థ లు విరాళాలిచ్చాయి. పైగా కాంగ్రెస్, బీజేపీలైతే నిబంధనలకు విరుద్ధంగా విదేశీ కంపెనీలతో పాటు దేశంలోని విదేశీ కంపెనీల నుంచి కూడా విరాళాలు పొందినట్టు ఎలక్షన్ వాచ్ తెలిపింది.
 
  కార్పొరేటు, వ్యాపార రంగాలకు చెందిన ట్రస్టు లు, కంపెనీలు, ఉత్పత్తి రంగాలు, చమురు, విద్యుత్, మైనింగ్, నిర్మాణ రంగం, రియల్ ఎస్టేట్ వంటి రంగాల నుంచి పార్టీలు భూరి విరాళాలు సేకరించాయి. విరాళాలిచ్చిన వారిలో ఏకంగా 23% మంది గుప్త దాతలే కావడం మరో విశేషం! వీటిలో నిర్మాణ రంగం అత్యధికంగా 99.71 కోట్ల విరాళాలతో అగ్ర స్థానంలో నిలిచింది. రెండో స్థానంలో ఉన్న రియల్టీ రంగం వాటా రూ.24.1 కోట్లే. కార్పొరేట్లలో అత్యధిక విరాళాలిచ్చింది ఆదిత్య బిర్లా గ్రూప్.
 
 కాంగ్రెస్‌పై ఎంత ‘ట్రస్టో’!
 కాంగ్రెస్‌కు అత్యధికంగా ట్రస్టులు, గ్రూప్ ఆఫ్ కంపెనీల నుంచి రూ.70.28 కోట్ల విరాళాలందాయి.   బీజేపీకి ఉత్పత్తి రంగాల నుంచి రూ.58.18 కోట్లు, విద్యుత్, చమురు కంపెనీల నుంచి 17.06 కోట్లు అందాయి.   మైనింగ్, నిర్మాణ, దిగుమతి రంగాల నుంచి కాంగ్రెస్‌కు రూ.23.07 కోట్లు, బీజేపీకి రియల్ ఎస్టేట్ రంగం నుంచి రూ.17.01 కోట్లు విరాళాలు అందాయి.  
 
 జాతీయ పార్టీలకు రూ.25.28 కోట్లు విరా ళాలు అందచేసిన 301 మంది దాతలు తమ పాన్ కార్డు, చిరునామా తదితర వివరాలను పొందుపరచలేదు.   జాతీయ పార్టీలకు రూ.1.02 కోట్లు విరాళాలిచ్చిన 58 మంది దాతలు ఆ మొత్తాలను ఏ విధంగా అందజేశారనే వివరాలు పొందుపరచలేదు.
 
 చట్టుబండలైన ‘విదేశీ’ చట్టం
 
 విదేశీ విరాళాల (నియంత్రణ) చట్టం-1976 కింద పార్టీలు విదేశీ కంపెనీల నుంచి గానీ, దేశంలో పని చేస్తున్న విదేశీ కంపెనీల నుంచి గానీ విరాళాలు స్వీకరించరాదు. కానీ కాంగ్రెస్, బీజేపీ ఈ చట్టాన్ని యథేచ్ఛగా ఉల్లంఘించాయి. వాటి నుంచి కాంగ్రెస్ రూ.9.83 కోట్లు, బీజేపీ రూ.19.42 కోట్లు దర్జాగా స్వీకరించాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement