
సహజీవనాన్ని పెళ్లిగానే భావిస్తాం: సుప్రీం
ఇద్దరు పెళ్లికాని వాళ్లు కలిసుండి.. కలిసి కాపురం చేస్తుంటే వాళ్లను పెళ్లయినవాళ్లు గానే భావిస్తామని, సహజీవన భాగస్వామి మరణించిన తర్వాత వాళ్ల ఆస్తికి సదరు మహిళ వారసురాలు అవుతుందని సుప్రీంకోర్టు తెలిపింది. ఒకవేళ అలా కాదు.. ఆస్తి ఇవ్వకూడదనుకుంటే, వాళ్లిద్దరికీ చట్టబద్ధంగా పెళ్లికాలేదని నిరూపించుకోవాల్సిన బాధ్యత ఆ మగవాడి తరఫు పార్టీమీదే ఉంటుందని స్పష్టం చేసింది. ఎక్కువ కాలం పాటు ఒక పురుషుడు, ఒక మహిళ కలిసి నివసిస్తుంటే దాన్ని పెళ్లిగానే చట్టం భావిస్తుందని జస్టిస్ ఎంవై ఇక్బాల్, జస్టిస్ అమితవ రాయ్లతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం ఒక రూలింగ్లో తెలిపింది. 2010 నుంచి కూడా సుప్రీంకోర్టు సహజీవనం చేస్తున్న జంటలను భార్యాభర్తలుగానే పరిగణిస్తూ వారికి అనుకూలంగానే రూలింగులు ఇస్తోంది.
ఇంతకీ ఈ రూలింగ్ ఏ సందర్భంలో వచ్చిందో తెలుసా.. తమ తాత గురించి కొందరు మనవలు, మనవరాళ్లు కలిసి వేసిన కేసు ఇంతపని చేసింది. తమ మామ్మ చనిపోయినప్పటినుంచి.. అంటే గత 20 ఏళ్లుగా తాత వేరే మహిళతో కలిసి ఉంటున్నారని, కానీ వాళ్లు పెళ్లి చేసుకోలేదని మనవలు తెలిపారు. ఇటీవల తాత మరణించగా.. ఆయన ఆస్తికి ఆమె వారసురాలు కారన్నది వీళ్ల వాదన. తామిద్దరికీ పెళ్లయినట్లు సదరు మహిళ నిరూపించుకోలేకపోయినా.. కోర్టు మాత్రం ఆమెకు అనుకూలంగానే తీర్పునిచ్చింది.