రూ.1,40,000 కోట్లు!
వచ్చే ఏడాది భారత్‌లో కుటుంబాల అదనపు వినియోగ వ్యయం ఇది
చమురు ధరలు, ద్రవ్యోల్బణం తగ్గడం ఒక కారణం
ఆదాయాల జోరు మరో కారణం
సిల్ తాజా నివేదికలో అంచనా..
ముంబై: దేశంలో వచ్చే ఆర్థిక సంవత్సరం (2015-16) వినియోగ వ్యయం భారీగా పెరిగే అవకాశం ఉందని క్రిసిల్ తన నివేదికలో పేర్కొంది. వినియోగదారులు రూ.1,40,000 కోట్ల వ్యవస్థలోకి వ్యయ రూపంలో పంప్‌చేసే వీలుందని తెలిపింది. మామూలుగా జరిగే కుటుంబాల వార్షిక వ్యయానికి ఇది 2 శాతం అధికమని విశ్లేషించింది. చమురు ధరలు, ద్రవ్యోల్బణం తగ్గడం, స్థిరంగా పెరుగుతున్న ఆదాయాలు దీనికి ప్రధాన కారణమని క్రిసిల్ చీఫ్ ఎకనమిస్ట్ ధర్మకీర్తి జోషి నివేదికలో పేర్కొన్నారు. పొదుపరులు, వినియోగదారుల వాస్తవిక ఆదాయాలు పెరుగుదల, కొనుగోలు శక్తి వృద్ధికి ఈ పరిస్థితి అద్దం పట్టనుందని ఏజెన్సీ పేర్కొంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం వ్యవస్థలో కుటుంబాల వార్షిక అదనపు వ్యయం రూ.50,900 కోట్లన్నది (ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరి ఆరు నెలల కాలంలో చమురు ధరలు తగ్గుతూ వచ్చాయి) తమ అంచనా అని జోషి పేర్కొన్నారు.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రూ. 1.4 ట్రిలియన్ల అదనపు వ్యయం విషయానికి వస్తే- ఇంధనం వ్యయాలపై చోటుచేసుకోనున్న పొదుపుల వల్ల కుటుంబాలకు దాదాపు రూ.30,000 కోట్లు మిగులుతాయన్నది అంచనా అని తెలిపారు. చమురు ధరలు తగ్గడం వల్ల చోటుచేసుకున్న ద్రవ్యోల్బణం కట్టడి వల్ల జరిగే పొదుపులే మిగిలిన మొత్తాలని అంచనా వేస్తున్నట్లు పేర్కొంది. మందగమనం కారణంగా గత రెండేళ్లలో తగ్గుముఖంపట్టిన వినియోగవ్యయం వచ్చే ఆర్థిక సంవత్సరం భారీగా పెరగనుందని క్రిసిల్ నివేదిక అభిప్రాయపడింది.