
అమిత్ షా నివాసంలో కీలక భేటీ!
- కేంద్ర కేబినెట్‌ను విస్తరించే అవకాశం
న్యూఢిల్లీ: త్వరలోనే కేంద్ర మంత్రిమండలిని విస్తరించే అవకాశముందన్న ఊహాగానాల నేపథ్యంలో ఢిల్లీలోని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా నివాసంలో కీలక సమావేశం జరిగింది. గురువారం జరిగిన ఈ భేటీకి కేంద్రమంత్రులు హాజరయ్యారు. రెండు, మూడు రోజుల్లో కేంద్ర కేబినెట్‌ను విస్తరించే అవకాశముందని ఊహాగానాలు వస్తున్న సంగతి తెలిసిందే. బిక్స్ సదస్సులో పాల్గొనేందుకు సెప్టెంబర్ 3వ తేదీ నుంచి ప్రధాని నరేంద్రమోదీ చైనా పర్యటనకు వెళుతున్నారు. చైనా నుంచి ఆయన నేరుగా మయన్మార్ వెళుతారు. సెప్టెంబర్ 7న మయన్మార్ పర్యటన ముగుస్తోంది. అనంతరం పితృ అమావాస్య వస్తుండటం.. ఇది మంచి ముహూర్తం కాదని భావిస్తుండటంతో ప్రధాని మోదీ చైనా పర్యటన లోపే కేంద్ర మంత్రిమండలిని పునర్వ్యవస్థీకరించే అవకాశముందని వినిపిస్తోంది.
సెప్టెంబర్ 1, 2వ తేదీల్లోపు విస్తరణ ఉండే అవకాశముందని ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. ఈసారి చేపట్టే మంత్రివర్గ విస్తరణ పెద్దస్థాయిలో ఉండే అవకాశముందని, పలువురు కొత్త ముఖాలకు చోటు కల్పించవచ్చునని అంటున్నారు. పలువురు మంత్రుల శాఖల్లో మార్పులు ఉండే అవకాశముందని సమాచారం. ఇక కొత్తగా ఎన్డీయే గూటిలో చేరిన అన్నాడీఎంకే, జేడీయూలకు కూడా కేంద్ర కేబినెట్‌లో బెర్తులు దక్కే అవకాశముంది. మహారాష్ట్రలో బీజేపీకి సన్నిహితమవుతున్న ఎన్సీపీ కూడా కేంద్ర కేబినెట్‌లో చేరొచ్చునని ఊహాగానాలు వస్తున్నాయి.