షోపియాన్ పట్టణం శాంతి భద్రతలు పూర్తిగా అదుపులో ఉన్నాయని జిల్లా పోలీసు ఉన్నతాధికారి ఆదివారం వెల్లడించారు. ఈ నేపథ్యంలో గత 10 రోజులుగా కొనసాగిన కర్ఫ్యూను ఎత్తివేసినట్లు తెలిపారు. పట్టణంలో ప్రశాంత వాతావరణం నెలకొంది, ఇటీవల ఎక్కడ ఏటువంటి అవాంఛనీయ సంఘటన జరిగినట్లు తమకు సమాచారం అందలేదని చెప్పారు. సెప్టెంబర్ 8న సీఆర్పీఎఫ్ జవాన్ల కాల్పుల్లో నలుగురు వ్యక్తులు మరణించారు.
ఈ నేపథ్యంలో షోపియాన్లో మొట్టమొదటిసారిగా కర్ఫ్యూ విధించినట్లు తెలిపారు. సెప్టెంబర్ 11న పట్టణంలో విధించిన కర్ఫ్యూ ఎత్తివేశారు. ఆ మరునాడు ఆందోళనకారులు, జవాన్ల మధ్య జరిగిన ఘర్షణలో మరో యువకుడు మరణించారు. దాంతో మృతుల సంఖ్య ఐదుకు చేరింది. అయితే గగరన్ పట్టణంలోని స్థానికులు మాత్రం సీఆర్పీఎఫ్ జవాన్లపై కేసు నమోదు చేయాలని, అలాగే వారి శిబిరాన్ని అక్కడ నుంచి తరలించాలని ఒమర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.