కరెంటు ఖాతా లోటు రెట్టింపు
ముంబై: కరెంటు ఖాతా లోటు (క్యాడ్) అక్టోబర్- డిసెంబర్ త్రైమాసికంలో దాదాపు రెట్టింపయ్యింది. రిజర్వ్ బ్యాంక్ మంగళవారం విడుదల చేసిన గణాంకాల ప్రకారం గతేడాది ఇదే వ్యవధితో పోలిస్తే.. స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో 1.6 శాతానికి ఎగిసి 8.2 బిలియన్ డాలర్లకు చేరింది. అయితే, సీక్వెన్షియల్ ప్రాతిపదికన మాత్రం (సెప్టెంబర్ క్వార్టర్‌తో పోలిస్తే) క్యాడ్ తగ్గింది. జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో ఇది జీడీపీలో 2 శాతంగా (సుమారు 10.1 బిలియన్ డాలర్లు) ఉంది. దేశంలోకి వచ్చే, వెళ్లే విదేశీ మారకం మధ్య వ్యత్యాసాన్ని క్యాడ్‌గా పరిగణిస్తారు. ఇది గతేడాది అక్టోబర్-డిసెంబర్ మధ్య కాలంలో 4.2 బిలియన్ డాలర్లుగా (జీడీపీలో 0.9 శాతం) నమోదైంది.
సర్వీసుల ఎగుమతులు పెరగడం, ట్రావెల్.. సాఫ్ట్‌వేర్ సేవల ద్వారా వచ్చే ఆదాయాలు మెరుగుపడటం, డివిడెండ్లు.. వడ్డీలు మొదలైన వాటి రూపంలో దేశం వెలుపలికి వెళ్లే నిధుల పరిమాణం తగ్గడం తదితర అంశాలు సీక్వెన్షియల్‌గా చూస్తే క్యాడ్ తగ్గుదలకు దోహదపడ్డాయని ఆర్‌బీఐ తెలిపింది. ఇతరత్రా వాణిజ్యపరమైన లోటు 39.2 బిలియన్ డాలర్లకు పెరిగింది. ఎగుమతులు 7.3 శాతం తగ్గడంతో పాటు దిగుమతులు 4.5 శాతం తగ్గాయి. ఇక ఏప్రిల్-డిసెంబర్ మధ్యన ఉత్పత్తుల ఎగుమతులు భారీగా ఎగియడం, దిగుమతులు మాత్రం స్వల్పంగానే పెరగడంతో చెల్లింపుల సమతౌల్యం (బీవోపీ) గణనీయంగా మెరుగుపడిందని ఆర్‌బీఐ వెల్లడించింది.
క్యాడ్ మెరుగుపడుతుంది: విశ్లేషకులు
ముడిచమురు, ఇతర కమోడిటీల ధరలు భారీగా తగ్గుతున్న నేపథ్యంలో మార్చి క్వార్టర్‌లో క్యాడ్ మెరుగుపడగలదని విశ్లేషకులు భావిస్తున్నారు. లోటు భర్తీ అయిపోయి 1.5 శాతం మేర మిగులు ఉండగలదని తెలిపారు. 2007 మార్చి క్వార్టర్ తర్వాత ఇలా మిగులులోకి మళ్లడం ఇదే ప్రథమం కాగలదని పలువురు అనలిస్టులు వివరించారు.