మద్యం అమ్మినందుకు కరెంట్, నీళ్లు కట్
వెంకటాపురం : దొంగతనంగా గ్రామంలో మద్యం అమ్మినందుకు గాను ఓ ఇంటికి తాగునీరు, కరెంట్ కట్ చేయాలని, పింఛన్‌తో పాటు రేషన్ కార్డు తొలగించేలా సిఫారసు చేయాలని గ్రామస్తులు నిర్ణయించిన ఘటన వరంగల్ జిల్లా వెంకటాపురం మండలం పాలంపేటలో సోమవారం వెలుగు చూసింది. గ్రామంలో ఇటీవల సంపూర్ణ మద్య నిషేధం కోసం మహిళా సంఘాలు, యువజనులు కృషి చేస్తున్నారు. ఈ మేరకు గ్రామంలో మద్యం అమ్మినా.. తాగినా చర్య తప్పదని హెచ్చరించారు.
ఈ క్రమంలో గ్రామానికి చెందిన మొగిలి చాటుగా మద్యం అమ్ముతుండడంతో సోమవారం పట్టుకొని ఎక్సైజ్ అధికారులకు అప్పగించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు సమావేశమై ఈ మేరకు గ్రామసభలో తీర్మానం చేయాలని నిర్ణయించారు. కార్యక్రమంలో సర్పంచ్ కారుపోతుల పూలమ్మ, ఉప సర్పంచ్ బుర్ర మహేష్, మహిళా సంఘ ప్రతినిధులు కొండ రుద్రమదేవి, మహ్మద్ షమీమా తదితరులు పాల్గొన్నారు.