ముంబైలో 'దహి హండి' ఉత్సవం సందర్భంగా మానవపిరమిడ్ ఏర్పాటు చేస్తున్న యువకులు
ముంబై: నగరంలో లక్షల మంది భక్తులు శ్రీకృష్ణ జన్మాష్టమిని అత్యంత వైభవంగా, ఆనందోత్సాహల మధ్య జరుపుకున్నారు. 'దహి హండి' పేరుతో ఏర్పాటు చేసిన పెరుగుతో నిండిన మట్టి కుండను చేరుకొని, దానిని పగులగొట్టడానికి యువకులు అద్భుతంగా మానవ పిరమిడ్లను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా నగరంలో భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. వీధులన్నీ గోవిందులు(దహి హండిలో పాల్గొనేవారు)తో నిండిపోయాయి. గోవిందులు పాటలు పాడుతూ, నృత్యాలు చేస్తూ, రంగులు చల్లుకుంటూ ఎంతో ఆనందంతో ఈ పండుగను జరుపుకుంటున్నారు. యువకులు హిందువులు ఈరోజును శ్రీకృష్ణుడు జన్మించిన రోజుగా భావించి ఈ పండుగను జరుపుకుంటారు.
దహి మండి కార్యక్రమంలో 9 అంతస్తులుగా మానవ పిరమిడ్ నిర్మిస్తారు. ఈ కార్యక్రమంలో పాల్గొనే గ్రూపుకు కొన్ని చోట్ల మోగా ప్రైజ్ మనీ కోటి రూపాయల వరకు ఇస్తారు.
ఇదిలా ఉండగా, 'దహి హండి' సందర్భంగా మానవపిరమిడ్ ఏర్పాటు చేస్తుండగా దాదాపు 20 మంది యువకులు(గోవిందులు) గాయపడ్డారు. వారిని చికిత్స నిమిత్తం సియోన్, కెఇఎం ఆస్పత్రులకు తరలించారు. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. 18 సంవత్సరాల లోపు పిల్లలు ఈ కార్యక్రమంలో పాల్గొనకూడదని బొంబే హైకోర్టు ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే.