విజయ్ కుమార్ కుటుంబ సభ్యులు (ఫైల్ ఫోటో)
ప్రేమించి పెండ్లి చేసుకున్నాడనే కారణంతో అత ని తల్లిదండులు కుమారుడి మృతదేహాన్ని కూడా ఇంటికి అనుమతించక పోవడంతో శవంతో అత్తారింటి ముందు భార్య, పిల్లలు ధర్నా చేసిన సంఘటన ఆరణిలో బుధవారం జరిగింది. గుమ్మిడిపూండి సమీపంలోని ఆరణికి చెందిన వెంకటేశన్ కుమారుడు విజయకుమార్(34). ఇతను, ఆగరపాక్కం గ్రామానికి చెందిన సింధు(24) పెద్దలకు తెలియకుండా ప్రేమ పెళ్లి చేసుకున్నారు. ఆరణిలోని ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేస్తూ అక్కడే ఓ ఇంటిలో అద్దెకు ఉన్నాడు. వీరికి త్రిష(9), అశోక్(7) ఇద్దరు పిల్లలు. ఈ క్రమంలో విజయకుమార్ మంగళవారం అనారోగ్యంతో మృతి చెందారు.
దీంతో భార్య సింధు భర్త శవాన్ని అద్దెకుంటున్న ఇంటికి తీసుకొని వెళ్లింది. ఇంటి ఓనర్ మృతదేహం పెట్టవద్దని చెప్పడంతో సింధు గ్రామంలోని అత్తారింటికి మృతదేహాన్ని తీసుకొని వెళ్లింది. విషయం తెలుసుకున్న అత్తమామలు ఇంటికి తాళంవేసి బయటకు వెళ్తున్నారు. దీంతో ఇంటి ఆవరణలోనే శవాన్ని ఉంచి సింధు తన ఇద్దరు పిల్లలతో ధర్నాకు దిగింది. ఆమెకు మద్దతుగా మహిళా సంఘాల వారు ఆరణి రోడ్డుపై ధర్నా చేశారు. విషయం తెలుసుకున్న ఆరణి పోలీసులు వచ్చి మృతుడి భార్య సింధుతో చర్చలు జరిపారు.
తన భర్త మృతదేహానికి అంత్యక్రియలు జరిపించాలని అత్తమామలను డిమాండ్ చేసింది. దీంతో పోలీసులు మృతుడి తల్లిదండ్రులు ఎక్కడ ఉన్నా రప్పించి మాట్లాడతామని హామీ ఇచ్చారు. ఇప్పటికే రెండు రోజులైందని భార్య సింధు ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసుల హామీతో గ్రామస్తులు ఆందోళన విరమించారు.