
మళ్లీ కార్ల పండుగ
వాహన అమ్మకాలు అంతంత మాత్రంగా ఉన్న తరుణంలో భారత్‌లో అతి పెద్ద వాహన పండుగ ఆటో షో వచ్చే వారం నుంచి ప్రారంభం కానున్నది.
6 నుంచి భారత్‌లో ఆటో షో
70 కొత్త వాహనాలను విడుదల చేయనున్న ఆటోమొబైల్ దిగ్గజాలు...
మందగమనం నుంచి ఉపశమనం లభిస్తుందని పరిశ్రమ ఆశాభావం
న్యూఢిల్లీ: వాహన అమ్మకాలు అంతంత మాత్రంగా ఉన్న తరుణంలో భారత్‌లో అతి పెద్ద వాహన పండుగ ఆటో షో వచ్చే వారం నుంచి ప్రారంభం కానున్నది. వచ్చే నెల 6-12 తేదీల్లో జరిగే ఈ 12వ ఆటోషోలో వివిధ కంపెనీలు దాదాపు 70 కొత్త వాహనాలను ఆవిష్కరిస్తాయని, దీంతో మందగమనంలో ఉన్న వాహన మార్కెట్‌కు ఊపువస్తుందని వాహన పరిశ్రమ ఆశిస్తోంది. స్థలాభావం, ట్రాఫిక్ రద్దీని తగ్గించడం తదితర కారణాల వల్ల ఈ ఆటో షో రెండు చోట్ల జరుగుతుంది. గ్రేటర్ నోయిడాలో వాహనాల ప్రదర్శన, ఢిల్లీలోని ప్రగతి మైదాన్‌లో వాహన విడిభాగాల ఎగ్జిబిషన్ జరుగుతాయి. భవిష్యత్తులో ఒకే చోట ఆటో షో జరిగేలా ప్రభుత్వం చూడాలని సియామ్ (సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫాక్చరర్స్) ప్రెసిడెంట్ విక్రమ్ కిర్లోస్కర్ కోరారు. వినియోగదారులు వాహనాల కొనుగోళ్ల విషయమై డోలాయమాన పరిస్థితుల్లో ఉన్నారని చెప్పారు. అధిక వడ్డీ రేట్లు, ద్రవ్యోల్బణం తదితర అంశాలు వారిని వెనక్కు లాగుతున్నాయని వివరించారు. ఈ నేపథ్యంలో అమ్మకాలు పుంజుకోవడానికి ఈ ఆటో షో దోహదపడుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
కొత్త కార్ల సందడి... ఎస్‌యూవీల హల్‌చల్..
ఈ ఆటోషోలో వివిధ వాహన కంపెనీలు 70 వరకూ కొత్త వాహనాలను ఆవిష్కరించే అవకాశాలున్నాయి. వీటిల్లో 26 వరకూ అంతర్జాతీయ మోడళ్లు ఉంటాయని(15 గ్లోబల్ కార్లు) అంచనా.
దేశీ కార్ల దిగ్గజం మారుతీ.. ‘సెలెరియో’ను ఆవిష్కరించనుంది. ఆటోమాటిక్ గేర్ సిస్టమ్ దీని ప్రత్యేకత.
కొత్త సెడాన్‌ను, దీంతో పాటు కొన్ని కాన్సెప్ట్ మోడళ్లను కూడా మారుతీ డిస్‌ప్లే చేయవచ్చు.
హ్యుందాయ్ కంపెనీ మిడ్ సైజ్ ఐ10 గ్రాండ్‌ను డిస్‌ప్లే చేయనున్నది. కొత్త శాంటా ఫే ఎస్‌యూవీతో పాటు రెండు కాన్సెప్ట్ కార్లను కూడా ఈ కంపెనీ డిస్‌ప్లే చేయనున్నది.
నిస్సాన్ కంపెనీ డాట్సన్ గో చిన్న కారును, గో ప్లస్ మల్టీ యుటిలిటి వెహికల్‌ను ప్రదర్శించనుంది
ఫోక్స్‌వ్యాగన్ తైగన్, జనరల్ మోటార్స్ ఆడ్రా కాన్సెప్ట్. ఫియట్ కంపెనీ కొత్త ఎస్‌యూవీ, డస్టర్‌లో అప్‌గ్రేడ్ చేసిన ఎస్‌యూవీని రెనో కంపెనీలు. డిస్‌ప్లే చేయనున్నాయి.
టాటా మోటార్స్ కూడా కొత్త ఎస్‌యూవీకి సంబంధించిన కాన్సెప్ట్ మోడల్‌ను ప్రదర్శనకు ఉంచుతోంది.
మహీంద్రా ఎక్స్‌యూవీ500 మోడల్‌లో హైబ్రిడ్ వెర్షన్‌ను, క్వాంటోలో ఆటో-గేర్ వేరియంట్‌ను తెస్తోంది.
హోండా కంపెనీ జాజ్ హ్యాచ్‌బాక్‌ను, మొబిలియో ఎంపీవీని డిస్‌ప్లే చేయనున్నది.
ఇక లగ్జరీ కార్ల విషయానికొస్తే, మెర్సిడెస్ బెంజ్ కంపెనీ సీఎల్‌ఏ సెడాన్‌లో ఏఎంజీ వెర్షన్‌ను, జీఎల్‌ఏ కాంపాక్ట్ ఎస్‌యూవీలో కాన్సెప్ట్ మోడల్‌ను, ఎఫ్1 పోడియమ్ కారును డిస్‌ప్లే చేయనున్నది.
ఆడి కంపెనీ ఆడి ఏ3 సెడాన్‌ను, ఆర్‌ఎస్ 7 స్పోర్ట్స్ కారును ఆవిష్కరించనుంది. బీఎండబ్ల్యూ ఐ కాన్సెప్ట్ మోడళ్లను ప్రదర్శనకు ఉంచనున్నాయి.
ఇక టూ వీలర్ల విషయానికొస్తే, హార్లే డేవిడ్సన్ కంపెనీ స్ట్రీట్ 750 బైక్‌ను ఈ ఆటో షోలోనే ఆవిష్కరించనున్నది. హీరో మోటో కార్ప్ కంపెనీ కొత్త మోడళ్లను, కాన్సెప్ట్ టూవీలర్లను డిస్‌ప్లే చేయనున్నది.
రెండేళ్లకోసారి జరిగే ఈ ఆటో షో 12వది
ఎప్పుడు: వచ్చే నెల 6-12 తేదీల్లో(5న మీడియా కోసం ప్రత్యేకంగా అనుమతించనున్నారు).
ఎక్కడ: గ్రేటర్ నోయిడాలో వాహనాల ప్రదర్శన, ప్రగతి మైదాన్‌లో వాహన విడిభాగాల ఎగ్జిబిషన్.
వేదిక ఎందుకు మారింది?: గతంలో ఈ ఆటో షో ఢిల్లీలోని ప్రగతి మైదాన్‌లో జరిగేది. ఈ ఆటో షో జరిగినన్ని రోజులు జనం పోటెత్తడంతో ఢిల్లీ రోడ్లన్నీ ట్రాఫిక్ జామ్‌లతో అల్లాడి పోయాయి. దీనిని నివారించడానికి ఈ ఏడాది ఆటో షోను రెండు చోట్ల నిర్వహిస్తున్నారు.
ఎన్ని కంపెనీలు: గ్రేటర్ నోయిడా షోలో 55 వాహన తయారీ కంపెనీలు, ఢిల్లీ ప్రగతి మైదాన్ షోకు కనీసం 1,100 విడిభాగాల తయారీ సంస్థలు పాల్గొంటున్నాయి.
సందర్శకుల సంఖ్య: 2012లో జరిగిన 11వ ఆటో షోకు 7 లక్షల మంది సందర్శకులు వచ్చారని అంచనా. ఈ ఏడాది ఆటో షోకు 5.40 లక్షల మంది సందర్శకులు వచ్చే అవకాశాలున్నాయి. గ్రేటర్ నోయిడాలో జరిగే ఆటో షోకు రోజుకు లక్ష మంది, ఢిల్లీలోని ప్రగతి మైదాన్‌లో జరిగే వాహన విడిభాగాల ప్రదర్శనకు రోజుకు దాదాపు 10 వేల మంది సందర్శకులు రావచ్చని అంచనా.
టికెట్లు: రూ.500(బిజినెస్ అవర్స్ ఉ.10-మ.1.00) రూ.200 (జనరల్ అవర్స్)
ఎవరు నిర్వహిస్తున్నారు: సియామ్(సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫాక్చరర్స్) ఆటోమోటివ్ కాంపొనెంట్ మాన్యుఫాక్చరర్స్ అసోసియేషన్ (ఏసీఎంఏ), సీఐఐలు సంయుక్తంగా నిర్వహిస్తాయి.
ఎవరు పాల్గొంటున్నారు?: మారుతీ, హ్యుందాయ్, హోండా వంటి చిన్నా కార్ల కంపెనీలే కాకుండా, ఆడి, బీఎండబ్ల్యూ, మెర్సిడెస్ వంటి లగ్జరీ కార్ల కంపెనీలు కూడా పాల్గొంటున్నాయి.
ఎన్ని కొత్త మోడళ్లొస్తాయి:70 వరకూ కొత్త మోడళ్లను ప్రదర్శిస్తాయని అంచనా.(వివరాలకు బాక్స్ చూడండి)