అందంగా కారులో వచ్చి.. ఫోన్లు కొట్టేస్తోంది! | delhi girl comes in costly car, snatches away smartphones | Sakshi
Sakshi News home page

అందంగా కారులో వచ్చి.. ఫోన్లు కొట్టేస్తోంది!

Published Sat, Oct 8 2016 11:41 AM | Last Updated on Fri, Nov 9 2018 4:52 PM

అందంగా కారులో వచ్చి.. ఫోన్లు కొట్టేస్తోంది! - Sakshi

అందంగా కారులో వచ్చి.. ఫోన్లు కొట్టేస్తోంది!

ఆమె అందమైన యువతి.. మహా అయితే పాతికేళ్లు ఉంటాయేమో. ఖరీదైన హోండా బ్రయో కారులో వస్తోంది. మంచి బ్రాండెడ్ దుస్తులు, వాటికి మ్యాచ్ అయ్యే చెవి రింగులు, గాజులు అన్నీ పెట్టుకుంటుంది. బ్రహ్మాండంగా ఇంగ్లీషు మాట్లాడుతుంది. అంతవరకు బాగానే ఉంది గానీ.. అమాయకులైన కుర్రాళ్ల మీద వల విసిరి.. వాళ్ల చేతుల్లో ఉన్న ఖరీదైన స్మార్ట్ ఫోన్లు, ట్యాబ్‌లను తీసుకుని పారిపోతోంది!! ఈ వెరైటీ దొంగ యువతి బాధితులంతా పోలీసులను ఆశ్రయించడంతో వాళ్లు ఆ లేడీ కిలాడీని పట్టుకోడానికి రంగంలోకి దిగారు.

ఆ యువతి కారులో వచ్చి, చేతిలో మంచి ఫోన్ ఉన్న యువకుల పక్కనే ఆపుతోంది.. కారు అద్దం దించి ఏదో ఒక ఎడ్రస్ చెప్పి అక్కడకు ఎలా వెళ్లాలని అడుగుతుంది. పనిలో పనిగా తన ఫోన్ బ్యాటరీ అయిపోయిందని, ఒక్క కాల్ చేసుకుంటానని చెప్పి వాళ్ల ఫోన్లు తీసుకుంటుంది. అప్పటికే స్టార్ట్ చేసి సిద్ధంగా ఉన్న కారును ఒక్కసారిగా ముందుకు దూకించి ఆ ఫోనుతో సహా పారిపోతోంది. ఆమెను పట్టుకోడానికి ఇప్పటికి నాలుగు బృందాలను పోలీసులు నియమించినా, ఇంకా ఆమె దొరకలేదు. గత మూడు రోజుల్లోనే నలుగురు కుర్రాళ్లు ఆమె చేతివాటం బారిన పడి లబోదిబోమంటున్నారు. తాజాగా ఢిల్లీలోని ముఖర్జీ నగర్‌లో ఆమె తన చేతివాటం చూపించింది.

ఆమె నిజంగానే ఏదో ఇబ్బందిలో ఉందనుకున్నానని, ఆమె చాలా చదువుకున్న దానిలాగే కనిపించిందని, అత్యవసరంగా తనవాళ్లకు ఫోన్ చేసుకోవాలని చెబితే తన ట్యాబ్ ఇచ్చానని.. తీరా ఆమె కాస్తా అది తీసుకుని వెళ్లిపోయిందని చేతన అనే విద్యార్థిని తెలిపింది. టాబ్ ఆమెకు ఇచ్చిన తర్వాత దగ్గరగా కూడా వెళ్లకుండా.. ఆమెను గౌరవించాలని కొంత దూరంలోనే నిలబడ్డానని, ఆమె కాల్ చేస్తున్నట్లు నటించి, అంతలోనే ఎక్సలేటర్ తొక్కి.. పారిపోయిందని, తాను ఆమెను వెంబడించేందుకు ప్రయత్నించినా దొరకలేదని చేతన వివరించింది. దాంతో ఆమె పోలీసులకు ఫిర్యాదుచేయగా.. మరికొద్ది నిమిషాల్లోనే అలాంటిదే మరో ఫిర్యాదు వచ్చింది. అక్కడ మొబైల్ ఫోన్ పోయింది. కోచింగ్ సెంటర్లకు కేంద్రమైన ముఖర్జీ నగర్‌లో విద్యార్థులను టార్గెట్‌గా చేసుకుని ఈ యువతి విజృంభిస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement