Delhi girl
-
లక్కీ.. బ్రిటీష్ హై కమిషనర్‌గా ఛాన్స్!
న్యూఢిల్లీ: భారత్‌లో బ్రిటీష్ హైకమిషనర్ పదవి గొప్ప పేరు ప్రఖ్యాతులు, బాధ్యత గలది. అంతటి హై ఫ్రొఫైల్ ఉద్యోగం 18 ఏళ్ల యువతి చైతన్య వెంకటేశ్వరన్‌ను వరించింది. అవును, భారత్‌లో బ్రిటీష్ హై కమిషనర్‌గా ఆమె గత బుధవారం ఒక రోజు సేవలందించారు. 2017 నుంచి బ్రిటీష్ హై కమిషన్ భారత్‌లో.. ‘ఒక రోజు హై కమిషనర్’ అనే పోటీని నిర్వహిస్తోంది. 18 నుంచి 23 ఏళ్ల యువతులు ఈ పోటీకి అర్హులు. ప్రపంచవ్యాప్తంగా మహిళలు ఎదుర్కొంటున్న సవాళ్లు, స్త్రీ సాధికారతపై అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమం చేపడుతున్నారు. ఒకరోజు హైకమిషన్‌గా అవకాశం రావడం పట్ల చైతన్య ఆనందం వ్యక్తం చేశారు. ఇది తనకు లభించిన సువర్ణ అవకాశమని అన్నారు. మహిళా సాధికారత కోసం పాటుపడతానని చెప్పుకొచ్చారు. (చదవండి: ఆధునిక బానిసత్వంలో ‘ఆమె’) ప్రపంచ బాలికల దినోత్సవం (అక్టోబర్ 11) సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని ప్రస్తుత బ్రిటీష్ హైకమిషర్ జాన్ థాంప్సన్ తెలిపారు. చైతన్య ఉన్నత భావాలు గల అమ్మాయి అని చెప్పారు. హై కమిషనర్‌గా ఆమె చక్కని పనితీరు కనబర్చిందని మెచ్చుకున్నారు. ఏడాదికి ఒకసారి జరిగే ఈ పోటీలు తనకెంతో ఇష్టమని చెప్పారు. భారత్, బ్రిటన్ మహిళల శక్తి సామర్థ్యాలను ప్రపంచానికి చాటేందుకు చేస్తున్న కృషికి ఈ కార్యక్రమం నిదర్శనమని థాంప్సన్ పేర్కొన్నారు. కాగా, చైతన్య విధుల్లో ఉండగా.. థాంప్సన్ డిప్యూటీ కమిషనర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. ఈ ఏడాది ఒకరోజు హైకమిషనర్ పోటీలకు 215 ఎంట్రీలు కాగా.. చైతన్యకు అవకాశం లభించింది. ఒకరోజు హైకమిషనర్‌గా పనిచేసిన వారిలో చైతన్య నాలుగో వ్యక్తి. (చదవండి: కరోనా ఉందని మర్చేపోయాను!) -
ప్రియాంక హత్య : పగిలిన చిన్ని గుండె
సాక్షి, న్యూఢిల్లీ : హైదరాబాద్‌లో పశువైద్యురాలు ప్రియాంక రెడ్డి అమానుష హత్యాచార పర్వం దేశంలోని ప్రతీ ఒక్కరినీ కంపింప చేస్తోంది. తమకిక రక్షణ లేదా అంటూ ప్రతి ఆడబిడ్డ హృదయం ఆక్రోశిస్తోంది. ఈ నేపథ్యంలో ఢిల్లీకి చెందిన అను దుబే అనే యువతి పార్లమెంటు ముందు నిరసనకు దిగారు. ‘నేనెందుకు సురక్షితంగా ఉండలేను' అన్న ప్లకార్డు పట్టుకుని శనివారం ఉదయం పార్లమెంటు సమీపంలో ఒక పేవ్‌మెంట్‌పై కూర్చుని నిరసన తెలిపారు. మహిళలపై అత్యాచారం, లైంగిక దాడుల కేసులు వినీ వినీ అలసిపోయాను. అందుకే నిరసన తెలియజేస్తున్నాను. మా పరిస్థితి ఏంటని ప్రభుత్వాన్ని, అధికారులను ప్రశ్నించాలనుకుంటున్నానని ఢిల్లీకి చెందిన అను దుబే నిరసన చేపట్టారు. నాతో పాటు, భారతదేశంలో పుట్టిన ఆడపిల్లలందరికీ రక్షణ కావాలని కోరుకుంటున్నారు. భారతదేశంలో పుట్టినందుకు అసహ్యంగానూ, బాధగానూ వుందంటూ ఆమె ఆవేదనకు లోనయ్యారు. దీంతో ఆమెను బలవంతంగా పోలీసులు ఆమెను స్టేషన్‌కు తరలించారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ దేశంలో ప్రతినిమిషానికి మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలపై ఆందోళన వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లో ఇద్దరు అమ్మాయిలను దారుణంగా రేప్ చేసి కాల్చి చంపారు. నేను ప్రియాంకలా కాలి పోవాలనుకోవడంలేదు..స్వేచ్ఛగా నా పని నేను చేసుకోవాలనుకుంటున్నాను. రాత్రంతా నిద్ర పట్టలేదు.. ఇది నా ఒక్కదాని బాధ కాదు, అందరికీ న్యాయం కావాలి అంటూ అను మీడియా ముందు కన్నీంటి పర్యంతమయ్యారు. రక్షణ కావాలని నిరసన తెలుపుతోంటే.. తనను ముగ్గురు మహిళా పోలీస్ కానిస్లేబుళ్లు వేధించి, రక్తం వచ్చేలా కొట్టారని వాపోయారు. కాగా ప్రియాంక రెడ్డి హత్యాచార ఘటనతో హైదరాబాద్ నగరం ఆందోళనలతో అట్టుడుకుతోంది. ప్రధానంగా షాద్‌నగర్ పోలీస్ స్టేషన్ వద్ద తీవ్ర ఉద్రికత్త పరిస్థితులేర్పడ్డాయి. ఈ కేసులో నిందితులను మేజిస్ట్రేట్ ముందు హాజరు పర్చేందుకు తరలించాల్సి వుండగా పోలీసులు ప్రయత్నాలు చేస్తుండగా, స్వచ్ఛందంగా తరలి వచ్చిన ప్రజలు, స్టేషన్ ముందు ఆందోళనకు దిగారు. నిందితులను తమకు అప్పగించాలంటూ పెద్ద పెట్టున నినాదాలు చేస్తూ పోరాటాన్ని ఉధృతం చేశారు. వీరిని అదుపు చేసేందుకు ప్రత్యేక పోలీసులను తరలించినా పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో నలుగురు నిందితుల వైద్య పరీక్షల నిమిత్తం వైద్యులను స్టేషన్‌కే పిలిపించారు. అంతేకాదు స్టేషన్ ముందు నెలకొన్న టెన్షన్ వాతావరణంతో నిందితులను తరలించే అవకాశం లేక స్టేషన్లోనే మేజిస్ట్రేట్ ముందు ప్రవేశపెట్టడం గమనార్హం. దీంతో వీరికి 14 రోజుల రిమాండ్ విధించారు మేజిస్ట్రేట్ పాండు నాయక్. అనంతరం నిందితులను భారీ భద్రత మధ్య మహబూబ్ నగర్ జిల్లా జైలుకు తరలిస్తున్నారు. అటు తెలంగాణా గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ ప్రియాంక ఇంటికి వెళ్లి ఆమె తల్లిదండ్రులను పరామర్శించారు. -
ఢిల్లీలో మరో దారుణం : చిన్నారిపై అఘాయిత్యం
న్యూఢిల్లీ : దేశ రాజధానిలో మరో దారుణం చోటు చేసుకుంది. తాను చదువుకుంటున్న స్కూల్లోనే మూడేళ్ల బాలికపై అత్యాచారం జరిగింది. ఓ వైపు వైద్య పరీక్షలు లైంగిక దాడి జరిగినట్టు ధృవీకరించినప్పటికీ, స్కూల్ యాజమాన్యం మాత్రం అసలేం జరగలేదంటూ వాదిస్తోంది. పాపపై జరిగిన అఘాయిత్యంపై తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించినప్పటికీ, వారు సైతం బెదిరింపులకు దిగారు. దీంతో తల్లిదండ్రులు తన కూతురికి జరిగిన అన్యాయంపై సామాజిక మాధ్యమం ఫేస్బుక్ ద్వారా పోరాటం చేస్తున్నారు. గత వారం స్కూల్లో తన కూతురిపై అత్యాచారం జరిగిందని, ఎవరూ తమకు న్యాయం చేయడం లేదని ఫేస్బుక్లో ఓ వీడియో పోస్టు చేశారు. ఆ వీడియోలో ‘ప్లీజ్ మాకు సాయం చేయండి’ అని పాప తల్లి చేతులెత్తి నమస్కరిస్తూ వేడుకుంటోంది. స్కూల్ నుంచి వచ్చిన తన కూతురి పాంటీస్లో రక్తపు మరకలు కనిపించాయని, వెంటనే డాక్టర్ వద్దకు తీసుకెళ్తే, ఆమెపై లైంగిక దాడి జరిగినట్టు తెలిసిందని తల్లి చెప్పారు. తన కూతురు తీవ్ర కడుపు నొప్పితో బాధపడుతుందని తెలిపారు. స్నానానికి తీసుకెళ్లినప్పుడు కూడా ప్రైవేట్ పార్ట్‌ల్లో నొప్పి వస్తుందని ఏడుస్తుందన్నారు. ఈ విషయంపై పోలీసులను కూడా ఆశ్రయించినట్టు తల్లిదండ్రులు చెప్పారు. అయితే ఈ విషయం బయటకు పొక్కనీయద్దంటూ పోలీసులు తమల్ని బెదిరించారని తెలిపారు. తాము ఫిర్యాదు చేసి 24 గంటలు గడిచినా కనీసం ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదన్నారు. అంతేకాక స్కూల్‌కు పోలీసులు క్లీన్ చీట్ ఇచ్చారని, స్కూల్ ముగిసే సమయం వరకు అలాంటి సంఘటనలేమీ జరుగలేదని తేల్చారు. ఏం జరిగినా అది ఇంటి వద్దనే జరిగిందంటూ తమపైనే నిందలేసినట్టు ఈ వీడియోలో తండ్రి తెలిపారు. స్కూల్లో ఉన్న అన్ని సీసీటీవీలను తాము పరిశీలించామని, అలాంటి సంఘటనలేమీ వాటిలో నమోదు కాలేదని పోలీసులు చెప్పినట్టు పేర్కొన్నారు. చిన్నారిపై జరిగిన ఈ అఘాయిత్యంపై పాప తల్లిదండ్రులు, వారి బంధువులు, చుట్టుపక్కల వారు స్కూల్ ఎదుట నిరసనకు దిగారు. ఈ సంఘటనపై న్యాయమైన విచారణ జరగాలని డిమాండ్ చేశారు. స్కూల్ ప్రిన్సిపాల్ సైతం తమ పాఠశాలలో అలాంటి సంఘటనేమీ జరుగలేదంటూ వాదిస్తున్నారు. అంతకముందు ఈ స్కూల్లో ఇలాంటివే రెండు సంఘటనలు జరిగాయి.‘ప్లీజ్ మాకు సాయం చేయండి. మేము చాలా ఆందోళన చెందుతున్నాం. మాకు ఏమొద్దు కానీ న్యాయం చేయండి. మాపై బెదిరింపులకు కూడా దిగుతున్నారు’ అని వీడియోలో తల్లిదండ్రులు చెప్పారు. ‘ఈ రోజు మా కూతురికి జరిగింది, రేపు మీకు ఇదే జరగవచ్చు’ అంటూ పాప తల్లి కన్నీరుమున్నీరైంది. -
పోలీస్ పోస్ట్‌లో బాలిక మృతిపై..
సాక్షి, న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీ పోలీస్ పోస్ట్‌లో 17 ఏళ్ల బాలిక ఆత్మహత్య చేసుకుందనే ఆరోపణలపై పాలక ఆమ్ ఆద్మీ స్పందించింది. బాలిక మృతిని కస్టడీ మృతిగా పేర్కొంటూ బాధ్యులైన ఢిల్లీ పోలీస్ అధికారులపై చర్యలు చేపట్టాలని హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను కోరింది. మైనర్ బాలిక మరణంలో ఆ సమయంలో డ్యూటీలో ఉన్న అధికారుల తప్పిదం ఉందని ఆప్ సీనియర్ నేత అతిషి మర్లేనా ఆరోపించారు. రాత్రి 1.30 గంటల ప్రాంతంలో బాలికను తిలక్ విహార్ పోలీస్ పోస్ట్‌లో ఎందుకు ఉంచారని ప్రశ్నించారు. బాలిక కస్టడీ మృతికి ఢిల్లీ పోలీసులు, లెఫ్టినెంట్ గవర్నర్ బాధ్యత వహించాలని ఆమె డిమాండ్ చేశారు. కాగా, బాలికకు 21 ఏళ్ల యువకుడితో స్నేహం ఉన్నందున కుటుంబ సభ్యులు వ్యతిరేకిస్తారన్న భయంతోనే బాలిక ఆత్మహత్యకు పాల్పడిందని పోలీసులు చెబుతున్నారు. పోలీస్ పోస్ట్ ఇన్‌ఛార్జ్‌పై ఇంతవరకూ ఎలాంటి చర్యలూ చేపట్టలేదని ఢిల్లీ ఆప్ మహిళా విభాగం అధ్యక్షురాలు రిచా పాండే విస్మయం వ్యక్తం చేశారు. బాలిక మృతిపై న్యాయవిచారణ సాగుతున్నదని, నివేదిక రాగానే చర్యలు తీసుకుంటామని పోలీసులు పేర్కొన్నారు. -
బాలికకు మత్తుమందిచ్చి.. స్నేహితుల గ్యాంగ్‌రేప్
దేశ రాజధానిలో ఘోరం జరిగింది. 13 ఏళ్ల బాలికపై ఆమె స్నేహితులిద్దరు కలిసి అత్యాచారం చేశారు. పశ్చిమ ఢిల్లీలోని ఉత్తమ్‌నగర్ ప్రాంతంలో జరిగిన ఓ బర్త్‌డే పార్టీలో కూల్‌డ్రింకులో మత్తుమందు కలిపి ఆమెకు ఇచ్చి ఈ దుశ్చర్యకు పాల్పడ్డారు. ఈ ఘటన ఈనెల 13న జరిగినా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తన స్నేహితుడు ఒకరు తనను అతడి పుట్టినరోజు పార్టీకి పిలిచినట్లు బాధితురాలు పోలీసులకు తెలిపింది. అక్కడ మత్తుమందు కలిపిన కూల్డ్రింకు తాగగానే ఆమె స్పృహ కోల్పోయింది. తర్వాత ఆమెపై సామూహిక అత్యాచారం జరిగింది. తర్వాత ఆమెను నిందితులు కలిసి అక్కడకు సమీపంలోని ఓ ఆస్పత్రి వద్ద వదిలేసి పారిపోయినట్లు పోలీసులు తెలిపారు. అటుగా వెళ్తున్న ఓ వ్యక్తి ఆమెను చూసి ఆస్పత్రి వర్గాలకు చెప్పడంతో విషయం తెలిసింది. తర్వాత ఎలాగోలా ఇంటికి చేరుకుని తన తల్లిదండ్రులకు జరిగిన విషయం చెప్పడంతో.. వాళ్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుల్లో 17 ఏళ్ల మైనర్ కూడా ఉండటంతో అతడిని అదుపులోకి తీసుకున్నారు. 18 ఏళ్ల సాహిల్‌ను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. సెక్షన్ 376-డి (గ్యాంగ్ రేప్), పోస్కో చట్టాల కింద కేసులు నమోదు చేశారు. -
అందంగా కారులో వచ్చి.. ఫోన్లు కొట్టేస్తోంది!
ఆమె అందమైన యువతి.. మహా అయితే పాతికేళ్లు ఉంటాయేమో. ఖరీదైన హోండా బ్రయో కారులో వస్తోంది. మంచి బ్రాండెడ్ దుస్తులు, వాటికి మ్యాచ్ అయ్యే చెవి రింగులు, గాజులు అన్నీ పెట్టుకుంటుంది. బ్రహ్మాండంగా ఇంగ్లీషు మాట్లాడుతుంది. అంతవరకు బాగానే ఉంది గానీ.. అమాయకులైన కుర్రాళ్ల మీద వల విసిరి.. వాళ్ల చేతుల్లో ఉన్న ఖరీదైన స్మార్ట్ ఫోన్లు, ట్యాబ్‌లను తీసుకుని పారిపోతోంది!! ఈ వెరైటీ దొంగ యువతి బాధితులంతా పోలీసులను ఆశ్రయించడంతో వాళ్లు ఆ లేడీ కిలాడీని పట్టుకోడానికి రంగంలోకి దిగారు. ఆ యువతి కారులో వచ్చి, చేతిలో మంచి ఫోన్ ఉన్న యువకుల పక్కనే ఆపుతోంది.. కారు అద్దం దించి ఏదో ఒక ఎడ్రస్ చెప్పి అక్కడకు ఎలా వెళ్లాలని అడుగుతుంది. పనిలో పనిగా తన ఫోన్ బ్యాటరీ అయిపోయిందని, ఒక్క కాల్ చేసుకుంటానని చెప్పి వాళ్ల ఫోన్లు తీసుకుంటుంది. అప్పటికే స్టార్ట్ చేసి సిద్ధంగా ఉన్న కారును ఒక్కసారిగా ముందుకు దూకించి ఆ ఫోనుతో సహా పారిపోతోంది. ఆమెను పట్టుకోడానికి ఇప్పటికి నాలుగు బృందాలను పోలీసులు నియమించినా, ఇంకా ఆమె దొరకలేదు. గత మూడు రోజుల్లోనే నలుగురు కుర్రాళ్లు ఆమె చేతివాటం బారిన పడి లబోదిబోమంటున్నారు. తాజాగా ఢిల్లీలోని ముఖర్జీ నగర్లో ఆమె తన చేతివాటం చూపించింది. ఆమె నిజంగానే ఏదో ఇబ్బందిలో ఉందనుకున్నానని, ఆమె చాలా చదువుకున్న దానిలాగే కనిపించిందని, అత్యవసరంగా తనవాళ్లకు ఫోన్ చేసుకోవాలని చెబితే తన ట్యాబ్ ఇచ్చానని.. తీరా ఆమె కాస్తా అది తీసుకుని వెళ్లిపోయిందని చేతన అనే విద్యార్థిని తెలిపింది. టాబ్ ఆమెకు ఇచ్చిన తర్వాత దగ్గరగా కూడా వెళ్లకుండా.. ఆమెను గౌరవించాలని కొంత దూరంలోనే నిలబడ్డానని, ఆమె కాల్ చేస్తున్నట్లు నటించి, అంతలోనే ఎక్సలేటర్ తొక్కి.. పారిపోయిందని, తాను ఆమెను వెంబడించేందుకు ప్రయత్నించినా దొరకలేదని చేతన వివరించింది. దాంతో ఆమె పోలీసులకు ఫిర్యాదుచేయగా.. మరికొద్ది నిమిషాల్లోనే అలాంటిదే మరో ఫిర్యాదు వచ్చింది. అక్కడ మొబైల్ ఫోన్ పోయింది. కోచింగ్ సెంటర్లకు కేంద్రమైన ముఖర్జీ నగర్లో విద్యార్థులను టార్గెట్‌గా చేసుకుని ఈ యువతి విజృంభిస్తోంది. -
కన్నీళ్లు తెప్పించే 'ఆమె' కథ!
న్యూఢిల్లీ: కన్నీళ్లకే కన్నీరొచ్చే కష్టాలకే కష్టం వేసే కన్నీటి గాథ ఆమెది. ఈ అభాగ్యురాలిపై కామాంధులు సాగించిన రాక్షక పర్వం గురించి తెలుసుకుంటే గుండె తరుక్కుపోతుంది. దేశంలో అబలలపై జరుగుతున్న దారుణోదంతాలకు నిలువెత్తు సాక్ష్యంగా నిలిచిన ఢిల్లీ బాలికకు పోలీసులు దశాబ్దకాలం తర్వాత విముక్తి కల్పించారు. చెర నుంచి బటయపడిన ఆమె జూలై 26న తిరిగి తల్లి, సోదరిని కలుసుకుంది. 12 ఏళ్ల వయసులో అపహరణకు గురైన బాలిక.. ఇద్దరు పిల్లల తల్లిగా సొంత గూడుకు చేరుకుంది. ఈ పదేళ్ల కాలంలో ఆమె అనుభవించిన నరకయాతన గురించి తెలుసుకుని పోలీసులు సైతం విస్తుపోయారు. పోలీసులు ఏం చెప్పారంటే.. ఈశాన్య ఢిల్లీలోని 12 ఏళ్ల బాలికను 2006, జూలై 2న కిడ్నాప్ చేశారు. కిడ్నాపర్లు రాంజు, ఆమె భర్త శ్యామసుందర్ బాలికను అంబాలాకు తీసుకెళ్లి రూ. 12 వేలకు అరుణ్ అలియాస్ బాబ్లీ అనే మహిళకు అమ్మేశారు. సరూప్ చాంద్ అనే వ్యక్తికి బాలికను రూ.10 వేలకు అరుణ అమ్మేసింది. చాంద్ కు రూ.20 వేలు చెల్లించి ప్రతాప్ సింగ్, అతడి కొడుకు జగశీర్ సింగ్ అకా జగ్గీ.. బాలికను తమ వెంట గుజరాత్ కు తీసుకెళ్లారు. అక్కడ మూడేళ్లున్న తర్వాత పంజాబ్ లోని లోంగోవాల్ ప్రాంతానికి తిరిగొచ్చారు. తన కొడుక్కి బాలికతో పెళ్లి జరిపించాడు. తర్వాత ట్రక్కు డ్రైవర్ తో బలవంతంగా పెళ్లి చేశారు. 2009లో రెండు నెలల వ్యవధిలో ఆమెను తొమ్మిది మందికి విక్రయించడం దారుణాతి దారుణం. 2011లో భర్త మరణించడంతో ట్రక్కు డ్రైవర్ మేనల్లుడు ఆమెను లైగింకంగా వేధించడం మొదలు పెట్టాడు. గతేడాది ఇంటి నుంచి గెంటేయడంతో బతిందా ప్రాంతంలో నివసించింది. పెళ్లిళ్లల్లో వంటమనిషిగా, పలు కార్యక్రమాల్లో డాన్సర్ గా చేయసాగింది. తర్వాత ఆమెను పశ్చిమ బెంగాల్ లోని సిలిగురి తీసుకెళ్లి ఓ డాన్స్ కు అమ్మేశారు. అక్కడ పరిచయమైన మహిళ డబ్బు సాయం చేయడంతో బాధితురాలు ఢిల్లీకి తిరిగివచ్చింది. తర్వాత ఏం జరిగింది? పదేళ్ల కాలంలో బాధితురాలిని 12సార్లు అమ్మేసినట్టు పోలీసులు గుర్తించారు. పలుమార్లు లైంగిక వేధింపులకు గురైనట్టు బాధితురాలు పోలీసులకు తెలిపింది. ఆమెకు రెండు పర్యాయాలు పెళ్లిళ్లు అయ్యాయి. ఇద్దరు సంతానం కలిగారు. బాధితురాలి జీవితం నాశనం కావడానికి కారకులైన 8 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. బాలికలను కిడ్నాప్ చేసి పంజాబ్, హర్యానాలో అమ్మేయడం అధికమయిందని పోలీసులు గుర్తించారు. ఈ రెండు రాష్ట్రాల్లో బాలికల సంఖ్య తక్కువగా ఉండడంతో ఇలాంటి దురాగతాలు ఎక్కువైపోతున్నాయి. పాలకులు, అధికారులతో పాటు ప్రజలు కూడా ఈ విషయంలో కళ్లు తెరవాల్సిఉంది. -
యువతి సాహసం..
న్యూఢిల్లీ: ప్రాణాలకు తెగించి ఆమె చేసిన సాహసం స్థానికంగా అందరి మన్ననలు అందుకుంది. దొంగను వెంటాడి పట్టుకున్న ఢిల్లీ యువతిని అందరూ మెచ్చుకుంటున్నారు. 18 ఏళ్ల ప్రియాంక పాండవ్ నగర్ లోని తన అమ్మమ్మ ఇంటి ముందు కూర్చుని ఉంది. ఇంతలో ఎదురింటి నుంచి 'దొంగను పట్టుకోండి' అంటూ అరుపులు వినిపించాయి. దొంగ పారిపోవడం చూసిన ప్రియాంక పులిలా ముందుకు ఉరికింది. ఛేజ్ చేసి అతడిని పట్టుకుంది. కరాటేలో బ్లాక్ బెల్ట్ ఆమె ముందు అతడి ఎత్తులు పారలేదు. అతడి మెడను పట్టుకోవడంతో పారిపోవడానికి వీళ్లేకపోవడంతో బ్లేడుతో ఆమెను గాయపరిచాడు. అయినా ఆమె పట్టువదల్లేదు. దొంగను స్థానికులకు అప్పగించింది. తర్వాత అతడిని పోలీసులకు అప్పగించారు. ఈ ఘటనలో ప్రియాంక ఎడమ చేతికి గాయాలయ్యాయి. ఆమె సాహసానికి స్థానికులు అబ్బురపడ్డారు. ఆర్మీ జవాను లేదా పోలీసు కావడమే తన లక్ష్యమని, ఇందుకోసం శ్రమిస్తున్నానని ప్రియాంక చెప్పింది. తల్లిదండ్రుల ప్రోత్సాహంతోనే కరాటే నేర్చుకున్నానని తెలిపింది. -
ఆస్తి కోసమే లీనా శర్మ హత్య!
ఢిల్లీ: తనకు చట్ట ప్రకారం దక్కాల్సిన ఆస్తి కోసం పోరాడిన యువతి లీనా శర్మ దారుణ హత్యకు గురైంది. ఢిల్లీలోని అమెరికన్ ఎంబసీ స్కూల్లో ఉద్యోగాన్ని సైతం వదులుకొని తన ఆస్తిని దక్కించుకోవడం కోసం పోరాడే క్రమంలోనే.. చివరికి ఆమె ప్రాణాలు కోల్పోయిందనే విషయం వెల్లడైంది. వివరాల్లోకి వెళ్తే.. తల్లి, తాత మరణంతో మధ్య ప్రదేశ్‌లోని సోహగ్ పూర్లో కోట్ల రూపాయల విలువచేసే భూములు, ఆస్తులకు ఢిల్లీకి చెందిన యువతి లీనా శర్మ వారసురాలైంది. అయితే ఆ ఆస్తులపై కన్నేసిన లీనా శర్మ మామ ప్రదీప్ శర్మ.. ఆమెను ఢిల్లీ నుంచి పథకం ప్రకాంరం రప్పించి హత్యచేశాడని పోలీసులు తేల్చారు. సుమారు 15 రోజులుగా కనిపించకుండా పోయిన లీనా శర్మ ఉదంతాన్ని ఆమె స్నేహితులు ఫేస్బుక్ ద్వారా విస్తృతంగా వెలుగులోకి తెచ్చరు. అయితే దీనిపై విచారణ చేపట్టిన చేపట్టిన అధికారులు వెల్లడించిన విషయాలు వారిని నివ్వెరపోయేలా చేశాయి. దృశ్యం సినిమాలో మాదిరిగా.. లీనా శర్మను పథకం ప్రకారం హత్య చేసిన దుండగులు.. కేసును తప్పుదోవ పట్టించేందుకు దృశ్యం సినిమాని ఆధారంగా చేసుకున్నట్లు తెలుస్తోంది. లీనా శర్మకు సంబంధించిన రెండు ఫోన్లను దుండగులు జబల్ పూర్ రైల్లో పడేసినట్లు విచారణలో పోలీసులు గుర్తించారు. అంతే కాదు ఆధారాలు దొరక్కుండా ఉండేందుకు మృతదేహాన్ని ఉప్పు, యూరియా మిశ్రమంతో పూడ్చేసినట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంలో ఇప్పటికే ప్రదీప్ శర్మతో పాటు మరో ఇద్దరు అనుచరులను కస్టడీలోకి తీసుకొని విచారించిన పోలీసులు మరిన్ని వివరాలు రాబట్టడం కోసం మరోసారి కస్టడీకి అనుమతివ్వాలని కోర్టును కోరనున్నారు. -
చనిపోతున్నా.. నా అవయవాలు దానం చేయండి!
రీమా డాక్టర్ కావాలనుకుంది. ఆ కలతోనే ఎంబీబీఎస్ పరీక్షలు కూడా రాసింది. కానీ, పరీక్షల్లో ఫెయిల్ కావడంతో ఆమె ఆత్మహత్య చేసుకుంది. ఢిల్లీలోని మోరిస్ నగర్లో గురువారం ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. డాక్టర్ కావాలనుకున్న 17 ఏళ్ల రీమా సూద్ చనిపోయాక తన అవయవాలను దానం చేయాలని కోరుతూ లేఖ రాసి ఆత్మహత్య చేసుకుంది. మంగళవారం వచ్చిన పరీక్షల ఫలితాల్లో తాను కెమిస్ట్రీ సబ్జెక్టులో ఫెయిల్ కావడంతో మానసిక క్షోభకు గురైన ఆమె తన కుటుంబసభ్యులకు లేఖ రాసి తనువు చాలించింది. తను మంచి కూతురిని, విద్యార్థినిని కాలేకపోయినందుకు క్షమించాలని తల్లిదండ్రుల్ని ఆ లేఖలో కోరింది. అయితే, పరీక్షల్లో ఫెయిలయ్యామన్న చిన్నచిన్న కారణాలతోనే విద్యార్థులు ఆత్మహత్య చేసుకోవడంపై సామాజికవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
బ్రేకప్ వెంటనే కొత్త గర్ల్‌ఫ్రెండ్‌తో యువహీరో!
బాలీవుడ్లో బ్రేకప్‌లు ఈ మధ్య బాగా పెరిగిపోయిన సంగతి తెలిసిందే. హృతిక్ రోషన్-సుసానె, విరాట్ కోహ్లి- అనుష్క, రణ్‌బీర్ కపూర్-కత్రినా కైఫ్, తాజాగా అర్బాజ్ ఖాన్-మలైకా అరోరా.. ఇలా వరుసగా అన్యోన్యమైన జంటలన్నీ విడిపోతున్నట్టు కథనాలు వచ్చిన సంగతి తెలిసిందే. వీరిలో కోహ్లి-అనుష్క ప్రేమజంట మళ్లీ చేరువయ్యే దిశగా సాగుతున్నట్టు కథనాలు వస్తుండగా.. రణ్‌బీర్-కత్రిన జోడీ మాత్రం విభేదాలు పక్కనపెట్టి మళ్లీ కలిసిపోయే అవకాశాలు లేనట్టు వినిపిస్తోంది. ఇందుకు కారణం రణ్‌బీర్‌కు కొత్త గర్ల్‌ఫ్రెండ్ దొరకడమేనట. రేపో-మాపో పెళ్లికి సిద్ధమన్న తరహాలో గాఢంగా ప్రేమించుకున్న రణ్‌బీర్-కత్రినా జంట అర్ధంతరంగా బ్రేకప్ చేసుకున్న సంగతి తెలిసిందే. దీంతో రణ్‌బీర్ ఇంటి నుంచి పెట్టేబెడా సర్దుకొని కత్రిన బయటకొచ్చినట్టు కథనాలు వచ్చాయి. ఈ బ్రేకప్ కథనాలు హల్చల్ చేస్తుండగానే రణ్‌బీర్ కొత్త అమ్మాయితో ప్రేమలో పడ్డట్టు తెలుస్తోంది. ఢిల్లీకి చెందిన ఓ అమ్మాయితో రణ్‌బీర్ ఇప్పుడు ప్రేమలో మునిగిపోయాడని 'బాలీవుడ్‌లైఫ్.కామ్' ఓ కథనాన్ని ప్రచురించింది. ఆమె సినీ పరిశ్రమకు చెందిన వ్యక్తి కాదంట. ఈ మిస్టరీ గర్ల్‌తో రణ్‌బీర్ రహస్యంగా ప్రేమ కలాపాలు సాగిస్తున్నాడని, అదే సమయంలో ఆమె గురించి చీమచిటుక్కుమన్నంతా సమాచారాన్ని కూడా బయటకు పొక్కకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాడని తెలిపింది. నిత్యం వెంటాడే మీడియా కళ్లలో తన కొత్త గర్ల్‌ఫ్రెండ్ పడకుండా చాలా జాగ్రత్తగా ఈ కొత్త ఎఫైర్‌ను రణ్‌బీర్ సాగిస్తున్నట్టు పేర్కొంది. -
పెళ్లి పీటలెక్కనున్న జేడీ
హైదరాబాద్: 90వ దశకంలో నాగార్జున కెరియర్ ను ఒక మలుపు తిప్పిన 'శివ' సినిమా తో తెలుగు సినీ లోకానికి పరిచయమైన జేడీ చక్రవర్తి (46)ఎట్టకేలకు పెళ్లి పీటలెక్క బోతున్నాడు. హాఫ్ సెంచరీకి దగ్గరిగా ఉన్న ఈ విలక్షణ నటుడికి ఇప్పటికి పెళ్లిచేసుకునే మెచ్యూరిటీ వచ్చిందట. అందుకే మూడుముళ్ల బంధానికి ఓకే చెప్పానంటున్నాడు. ఢిల్లీకి చెందిన ఓ బిజినెస్ ఫ్యామిలీకి చెందిన అమ్మాయిని మరికొద్దినెలలో జేడీ పెళ్లి చేసుకోనున్నాడు. ఇప్పటికైనా సెటిల్ అవ్వమనే వాళ్లమ్మ బలవంతం మీద త్వరలోనే ఓ ఇంటివాడయ్యేందుకు నిర్ణయించుకున్నాడని తెలుస్తోంది. దీనిపై ఈ గులాబీ హీరోని వివరణ కోరాగా 'నేను పెళ్లికి ఎప్పుడూ వ్యతిరేకం అని చెప్పలేదు. పెళ్లి చేసుకోవాలంటే ఎంతో బాధ్యత - మెచ్యూరిటీ ఉండాలి. నాకు ఇప్పడవి వచ్చాయని అనుకుంటున్నా' అంటూ మీడియాకు తన పెళ్లి కబురందించాడు. జేడీ చక్రవర్తిగా పాపులర్ అయిన నాగులపాటి శ్రీనివాస చక్రవర్తి పుట్టింది హైదరాబాద్ లోనే. సినిమా రంగం మీద ఆసక్తితో 1989లో రామ్ గోపాల్ వర్మ సెన్సేషనల్ మూవీ శివతో తెరంగేట్రం చేసిన చక్రవర్తి అప్పట్లో కాలేజీ కుర్రకారులోపెద్ద సంచలనం. ఆ తర్వాత గులాబీ, పాపకోసం, హోమం తదితర సినిమాల్లో తన ప్రతిభను రూపించుకుంటూ హీరోగా, విలన్ గా, దర్శకుడిగా తనదైన శైలిలో రాణించాడు. 'సత్య' మూవీతో బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చి అక్కడ కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్న సంగతి తెలిసిందే. -
కప్పు టీ అడిగితే.. కాలు కాల్చేశారు!
న్యూఢిల్లీ: విమానంలో ఎక్కితే చక్కగా గాలిలో ఎగురుతూ త్వరగా గమ్యం చేరుకోవచ్చని అనుకుంటాం. కానీ, విమాన ప్రయాణం ఓ మోడల్‌కు చేదు అనుభవాన్ని మిగిల్చింది. టీ అడిగిన పాపానికి.. తన తొడ కాలిపోయిందంటూ ఆమె ఫేస్బుక్లో పోస్ట్ చేసిన లేఖ ప్రకంపనలు సృష్టిస్తోంది. యాడ్ మోడల్ మౌమతి (25)... 2015 ఏప్రిల్ 10న ఢిల్లీ నుంచి గోవాకు స్పైస్‌జెట్ విమానంలో ప్రయాణిస్తున్నప్పుడు తనకు ఎదురైన అసౌకర్యాన్ని గురించి తెలుపుతూ బహిరంగంగా లేఖ రాశారు. ''విమానయాన సంస్థలకు ఆదాయం మీద ధ్యాస తప్ప ప్రయాణికుల సౌకర్యాలు, సౌలభ్యం పట్టదు.. షేమ్ ఆన్ యూ'' అంటూ ప్రారంభయ్యే ఆ లేఖ భవిష్యత్తులో ఎవరైనా విమానంలో ప్రయాణించాలనుకుంటే ఫస్ట్ ఎయిడ్ కిట్ తీసుకెళ్లడం మర్చిపోవద్దనే సలహాతో ముగుస్తుంది. తాను ఎంతో సంతోషంగా అవార్డు సభకు వెళ్లేందుకు బయల్దేరానని, విమానంలో టీ అడిగి.. దానికి డబ్బులు కూడా చెల్లించానని ఆమె చెప్పింది. వేడి నీళ్లు, టీ బ్యాగ్ తీసుకొచ్చిన ఫ్లైట్ అటెండెంట్.. పొరపాటున ఆ వేడివేడి నీళ్ల కప్పును తన ఒళ్లో పారేసిందని తెలిపింది. ఇది పొరపాటునే జరిగినా.. ఆ తర్వాత వాళ్లు ప్రవర్తించిన తీరు చాలా దారుణంగా ఉందని వాపోయింది. కాలినగాయాల బాధతో తాను విలవిల్లాడుతుంటే సిబ్బంది అస్సలు పట్టించుకోకుండా.. తమ పని చేసుకుంటూ పోయారని ఆరోపించారు. తాను వాష్‌రూంలోకి వెళ్లి చూసుకుంటే.. తొడ కాలిపోయిందని, క్షణక్షణానికీ ఆ బాధ భరించలేనంతగా పెరిగిపోయిందని మౌమిత ఆవేదన వ్యక్తం చేసింది. ప్రాథమిక చికిత్సకు ఉండాల్సిన కనీస సౌకర్యాలు కూడా లేకపోవడం ఆశ్చర్యం కలిగించిందన్నారు. విమాన ప్రయాణికుల్లో ఓ డాక్టర్ కూడా ఉండి, ఆయన బర్నాల్ ఆయింట్మెంట్ అడగ్గా.. లేదనే సమాధానం వచ్చిందని విమర్శించింది. కనీసం ఐస్ ముక్కలను సరఫరా చేయలేకపోయారని మండిపడింది. దీనివల్ల తాను మూడు నెలలు మంచానికి పరిమితమవ్వాల్సి వచ్చిందన్నారు. అధిక చార్జీలు వసూలుచేసే విమానయాన సంస్థలు.. ప్రయాణికుల భద్రతను గాలికి వదిలేస్తున్నాయని, భవిష్యత్తులో విమానాల్లో ప్రయాణించాలనుకునేవాళ్లు తమకు కావల్సిన జాగ్రత్తలు తామే తీసుకుంటే మంచిదంటూ తన లేఖను ముగించింది. -
ఢిల్లీ బాలికపై ఎనిమిది మంది అత్యాచారం
ఫరీదాబాద్: ఢిల్లీకి చెందిన ఓ బాలికను ఎనిమిదిమంది దుండగులు అపహరించి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు బాధితురాలు తన స్నేహితుడిని కలిసేందుకు ఫరీదాబాద్‌కు వచ్చింది. బల్లాభ్‌గఢ్ బస్టాండ్‌లో ఆమె బస్సు కోసం వేచియుండగా, గమ్యస్థానానికి చేరుస్తామంటూ ఐదుగురు వ్యక్తులు మాయమాటలు చెప్పి నిర్జన ప్రదేశానికి తీసుకెళ్లారు. మరో ముగ్గురు వారితో జతకలిశారు. ఎనిమిది మంది కలసి బాలికను అత్యాచారం చేశారు. అనంతరం బాధితురాలిని బస్టాండ్ వద్ద పడేసి వెళ్లిపోయారు. ఆమె పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని ఏడుగురి నిందితుల్ని అరెస్ట్ చేశారు. వారిని కోర్టులో హాజరుపరచగా, జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. మరో నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.