కన్నీళ్లు తెప్పించే 'ఆమె' కథ!
న్యూఢిల్లీ: కన్నీళ్లకే కన్నీరొచ్చే కష్టాలకే కష్టం వేసే కన్నీటి గాథ ఆమెది. ఈ అభాగ్యురాలిపై కామాంధులు సాగించిన రాక్షక పర్వం గురించి తెలుసుకుంటే గుండె తరుక్కుపోతుంది. దేశంలో అబలలపై జరుగుతున్న దారుణోదంతాలకు నిలువెత్తు సాక్ష్యంగా నిలిచిన ఢిల్లీ బాలికకు పోలీసులు దశాబ్దకాలం తర్వాత విముక్తి కల్పించారు. చెర నుంచి బటయపడిన ఆమె జూలై 26న తిరిగి తల్లి, సోదరిని కలుసుకుంది. 12 ఏళ్ల వయసులో అపహరణకు గురైన బాలిక.. ఇద్దరు పిల్లల తల్లిగా సొంత గూడుకు చేరుకుంది. ఈ పదేళ్ల కాలంలో ఆమె అనుభవించిన నరకయాతన గురించి తెలుసుకుని పోలీసులు సైతం విస్తుపోయారు.
పోలీసులు ఏం చెప్పారంటే..
ఈశాన్య ఢిల్లీలోని 12 ఏళ్ల బాలికను 2006, జూలై 2న కిడ్నాప్ చేశారు. కిడ్నాపర్లు రాంజు, ఆమె భర్త శ్యామసుందర్ బాలికను అంబాలాకు తీసుకెళ్లి రూ. 12 వేలకు అరుణ్ అలియాస్ బాబ్లీ అనే మహిళకు అమ్మేశారు. సరూప్ చాంద్ అనే వ్యక్తికి బాలికను రూ.10 వేలకు అరుణ అమ్మేసింది. చాంద్ కు రూ.20 వేలు చెల్లించి ప్రతాప్ సింగ్, అతడి కొడుకు జగశీర్ సింగ్ అకా జగ్గీ.. బాలికను తమ వెంట గుజరాత్ కు తీసుకెళ్లారు. అక్కడ మూడేళ్లున్న తర్వాత పంజాబ్ లోని లోంగోవాల్ ప్రాంతానికి తిరిగొచ్చారు. తన కొడుక్కి బాలికతో పెళ్లి జరిపించాడు. తర్వాత ట్రక్కు డ్రైవర్ తో బలవంతంగా పెళ్లి చేశారు. 2009లో రెండు నెలల వ్యవధిలో ఆమెను తొమ్మిది మందికి విక్రయించడం దారుణాతి దారుణం.
2011లో భర్త మరణించడంతో ట్రక్కు డ్రైవర్ మేనల్లుడు ఆమెను లైగింకంగా వేధించడం మొదలు పెట్టాడు. గతేడాది ఇంటి నుంచి గెంటేయడంతో బతిందా ప్రాంతంలో నివసించింది. పెళ్లిళ్లల్లో వంటమనిషిగా, పలు కార్యక్రమాల్లో డాన్సర్ గా చేయసాగింది. తర్వాత ఆమెను పశ్చిమ బెంగాల్ లోని సిలిగురి తీసుకెళ్లి ఓ డాన్స్ కు అమ్మేశారు. అక్కడ పరిచయమైన మహిళ డబ్బు సాయం చేయడంతో బాధితురాలు ఢిల్లీకి తిరిగివచ్చింది.
తర్వాత ఏం జరిగింది?
పదేళ్ల కాలంలో బాధితురాలిని 12సార్లు అమ్మేసినట్టు పోలీసులు గుర్తించారు. పలుమార్లు లైంగిక వేధింపులకు గురైనట్టు బాధితురాలు పోలీసులకు తెలిపింది. ఆమెకు రెండు పర్యాయాలు పెళ్లిళ్లు అయ్యాయి. ఇద్దరు సంతానం కలిగారు. బాధితురాలి జీవితం నాశనం కావడానికి కారకులైన 8 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. బాలికలను కిడ్నాప్ చేసి పంజాబ్, హర్యానాలో అమ్మేయడం అధికమయిందని పోలీసులు గుర్తించారు. ఈ రెండు రాష్ట్రాల్లో బాలికల సంఖ్య తక్కువగా ఉండడంతో ఇలాంటి దురాగతాలు ఎక్కువైపోతున్నాయి. పాలకులు, అధికారులతో పాటు ప్రజలు కూడా ఈ విషయంలో కళ్లు తెరవాల్సిఉంది.