
సాక్షి, న్యూఢిల్లీ : హైదరాబాద్‌లో పశువైద్యురాలు ప్రియాంక రెడ్డి అమానుష హత్యాచార పర్వం దేశంలోని ప్రతీ ఒక్కరినీ కంపింప చేస్తోంది. తమకిక రక్షణ లేదా అంటూ ప్రతి ఆడబిడ్డ హృదయం ఆక్రోశిస్తోంది. ఈ నేపథ్యంలో ఢిల్లీకి చెందిన అను దుబే అనే యువతి పార్లమెంటు ముందు నిరసనకు దిగారు. ‘నేనెందుకు సురక్షితంగా ఉండలేను' అన్న ప్లకార్డు పట్టుకుని శనివారం ఉదయం పార్లమెంటు సమీపంలో ఒక పేవ్‌మెంట్‌పై కూర్చుని నిరసన తెలిపారు.
మహిళలపై అత్యాచారం, లైంగిక దాడుల కేసులు వినీ వినీ అలసిపోయాను. అందుకే నిరసన తెలియజేస్తున్నాను. మా పరిస్థితి ఏంటని ప్రభుత్వాన్ని, అధికారులను ప్రశ్నించాలనుకుంటున్నానని ఢిల్లీకి చెందిన అను దుబే నిరసన చేపట్టారు. నాతో పాటు, భారతదేశంలో పుట్టిన ఆడపిల్లలందరికీ రక్షణ కావాలని కోరుకుంటున్నారు. భారతదేశంలో పుట్టినందుకు అసహ్యంగానూ, బాధగానూ వుందంటూ ఆమె ఆవేదనకు లోనయ్యారు. దీంతో ఆమెను బలవంతంగా పోలీసులు ఆమెను స్టేషన్‌కు తరలించారు.
అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ దేశంలో ప్రతినిమిషానికి మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలపై ఆందోళన వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లో ఇద్దరు అమ్మాయిలను దారుణంగా రేప్ చేసి కాల్చి చంపారు. నేను ప్రియాంకలా కాలి పోవాలనుకోవడంలేదు..స్వేచ్ఛగా నా పని నేను చేసుకోవాలనుకుంటున్నాను. రాత్రంతా నిద్ర పట్టలేదు.. ఇది నా ఒక్కదాని బాధ కాదు, అందరికీ న్యాయం కావాలి అంటూ అను మీడియా ముందు కన్నీంటి పర్యంతమయ్యారు. రక్షణ కావాలని నిరసన తెలుపుతోంటే.. తనను ముగ్గురు మహిళా పోలీస్ కానిస్లేబుళ్లు వేధించి, రక్తం వచ్చేలా కొట్టారని వాపోయారు.
కాగా ప్రియాంక రెడ్డి హత్యాచార ఘటనతో హైదరాబాద్ నగరం ఆందోళనలతో అట్టుడుకుతోంది. ప్రధానంగా షాద్‌నగర్ పోలీస్ స్టేషన్ వద్ద తీవ్ర ఉద్రికత్త పరిస్థితులేర్పడ్డాయి. ఈ కేసులో నిందితులను మేజిస్ట్రేట్ ముందు హాజరు పర్చేందుకు తరలించాల్సి వుండగా పోలీసులు ప్రయత్నాలు చేస్తుండగా, స్వచ్ఛందంగా తరలి వచ్చిన ప్రజలు, స్టేషన్ ముందు ఆందోళనకు దిగారు. నిందితులను తమకు అప్పగించాలంటూ పెద్ద పెట్టున నినాదాలు చేస్తూ పోరాటాన్ని ఉధృతం చేశారు. వీరిని అదుపు చేసేందుకు ప్రత్యేక పోలీసులను తరలించినా పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో నలుగురు నిందితుల వైద్య పరీక్షల నిమిత్తం వైద్యులను స్టేషన్‌కే పిలిపించారు. అంతేకాదు స్టేషన్ ముందు నెలకొన్న టెన్షన్ వాతావరణంతో నిందితులను తరలించే అవకాశం లేక స్టేషన్‌లోనే మేజిస్ట్రేట్ ముందు ప్రవేశపెట్టడం గమనార్హం. దీంతో వీరికి 14 రోజుల రిమాండ్ విధించారు మేజిస్ట్రేట్ పాండు నాయక్. అనంతరం నిందితులను భారీ భద్రత మధ్య మహబూబ్ నగర్ జిల్లా జైలుకు తరలిస్తున్నారు. అటు తెలంగాణా గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ ప్రియాంక ఇంటికి వెళ్లి ఆమె తల్లిదండ్రులను పరామర్శించారు.
Comments
Please login to add a commentAdd a comment