
సాక్షి, న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీ పోలీస్ పోస్ట్‌లో 17 ఏళ్ల బాలిక ఆత్మహత్య చేసుకుందనే ఆరోపణలపై పాలక ఆమ్ ఆద్మీ స్పందించింది. బాలిక మృతిని కస్టడీ మృతిగా పేర్కొంటూ బాధ్యులైన ఢిల్లీ పోలీస్ అధికారులపై చర్యలు చేపట్టాలని హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను కోరింది. మైనర్ బాలిక మరణంలో ఆ సమయంలో డ్యూటీలో ఉన్న అధికారుల తప్పిదం ఉందని ఆప్ సీనియర్ నేత అతిషి మర్లేనా ఆరోపించారు. రాత్రి 1.30 గంటల ప్రాంతంలో బాలికను తిలక్ విహార్ పోలీస్ పోస్ట్‌లో ఎందుకు ఉంచారని ప్రశ్నించారు. బాలిక కస్టడీ మృతికి ఢిల్లీ పోలీసులు, లెఫ్టినెంట్ గవర్నర్ బాధ్యత వహించాలని ఆమె డిమాండ్ చేశారు.
కాగా, బాలికకు 21 ఏళ్ల యువకుడితో స్నేహం ఉన్నందున కుటుంబ సభ్యులు వ్యతిరేకిస్తారన్న భయంతోనే బాలిక ఆత్మహత్యకు పాల్పడిందని పోలీసులు చెబుతున్నారు. పోలీస్ పోస్ట్ ఇన్‌ఛార్జ్‌పై ఇంతవరకూ ఎలాంటి చర్యలూ చేపట్టలేదని ఢిల్లీ ఆప్ మహిళా విభాగం అధ్యక్షురాలు రిచా పాండే విస్మయం వ్యక్తం చేశారు. బాలిక మృతిపై న్యాయవిచారణ సాగుతున్నదని, నివేదిక రాగానే చర్యలు తీసుకుంటామని పోలీసులు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment