నోట్ల రద్దు స్కాం అన్నవారే అవకతవకలకు..
ఒకవేళ ఢిల్లీ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ నిజంగానే పాత నోట్ల మార్పిడిలో మోసపూరిత కార్యకలాపాలకు పాల్పడుతుందనే తెలిస్తే, ఈ విషయంలో ప్రభుత్వం క్రిమిషన్ విచారణకైనా వెనుకాడదని అధికారులు హెచ్చరిస్తున్నారు. రెవెన్యూలుగా డీటీసీ రూ.3కోట్లను డిపాజిట్ చేసిందని, అవన్నీ పాత కరెన్సీ నోట్లేనని ఢిల్లీ ప్రభుత్వ అధికార వర్గాలు చెప్పాయి. ఈ రెవెన్యూలు ఎక్కువగా రద్దైన నోట్ల రూపంలోనే ఉండటంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో డీటీసీ అవతవకలకు పాల్పడినట్టు ఆరోపణలు ఎదుర్కొంటోంది.
ఈ నగదంతా ఆమ్ ఆద్మీ పార్టీ విరాళాల రూపంలో సేకరించిన మొత్తమేనని పలువురు ఆరోపిస్తున్నారు. మరోవైపు ఆమ్ఆద్మీ పార్టీ విరాళాలుగా సేకరించిన మొత్తాన్ని ఈ రూపంలో మార్చుకోవడానికి ప్రయత్నిస్తుందంటూ ఢిల్లీ బీజేపీ చీఫ్ సతీష్ ఉపాధ్యాయ కూడా లెఫ్టినెట్ గవర్నర్ నజీబ్ జంగ్కు లేఖ రాశారు. డీటీసీ బస్సులో ప్రయాణించే వారంతా దిగువ మధ్యతరగతికి చెందినవారే ఉంటారని, వారందరూ చిల్లర రూపంలోనే టిక్కెట్లను కొనుగోలుచేస్తారని ఉపాధ్యాయ చెప్పారు.
ఈ విషయంపై లెఫ్టినెంట్ గవర్నర్ వెంటనే చర్యలు తీసుకోవాలని, ప్రజాసంస్థలకు మరక అంటకముందే టీడీసీ మేనేజ్మెంట్ను మేలుకొల్పాలని ఉపాధ్యాయ డిమాండ్ చేశారు. పెద్ద నోట్లను రద్దుచేస్తూ ప్రధాని నరేంద్రమోదీ నిర్ణయం ప్రకటించగానే, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆయనపై మండిపడ్డారు. ఇది ఓ పెద్ద స్కాం అంటూ తెగ రాద్ధాంతం చేశారు. ప్రస్తుతం కేజ్రీవాల్ ప్రభుత్వంలోనే పాత నోట్ల మార్పిడిలో అవకతవకలు జరుగుతున్నట్టు తెలుస్తోంది.