న్యూఢిల్లీ : ఢిల్లీ ఆరోగ్యశాఖ మంత్రి సత్యేంద్ర జైన్ కుమార్తె సౌమ్యా జైన్ గురువారం మొహల్లా క్లినిక్స్ ఇన్ ఛార్జ్ పదవికి రాజీనామా చేశారు. కాగా అన్నివర్గాల ప్రజలకు అందుబాటులో వైద్య సదుపాయాలు కల్పించేందుకు ఢిల్లీ ప్రభుత్వం గతేడాది ప్రతిష్టాత్మకంగా మొహల్లా క్లినిక్స్ పేరుతో ఓ ప్రాజెక్టును ప్రారంభించిన విషయం తెలిసిందే. అయితే ఆప్ సర్కార్... ఆ క్లినిక్స్ ఇన్ఛార్జ్గా మంత్రి కుమార్తెను నియమించడంతో పెద్ద ఎత్తున విమర్శలతో పాటు, ఆరోపణలు వెల్లువెత్తాయి.
ఆర్కిటెక్చర్ అయిన సౌమ్యా జైన్ను ఆరోగ్య ప్రాజెక్టుకు అధికారిణిగా నియమించడాన్ని విపక్షాలు తప్పబట్టాయి. అయితే మంత్రి సత్యేంద్ర జైన్ మాత్రం ఆ విమర్శలను తిప్పికొట్టారు. తన కుమార్తె ఆర్కిటెక్చర్లో నిపుణురాలని, మొహల్లా క్లినిక్స్ రూపకల్పనకు ఆమె స్వచ్ఛందంగా పని చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు. అయితే విమర్శలు వెల్లువెత్తడంతో సౌమ్య తన పదవి నుంచి తప్పుకున్నారు.