mohalla clinics
-
కేజ్రీవాల్ రెండో ఆదేశం.. ఈడీ సీరియస్
ఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో మనీలాండరింగ్ ఆరోపణలపై అరెస్టయిన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్.. ప్రస్తుతం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కస్టడీలో ఉన్నారు. అయితే, లాకప్ నుంచే ఆయన పాలన సాగిస్తుండటం చర్చనీయాంశమైంది. ఈ తరుణంలో ఆయన రెండో ఆదేశం జారీ చేయగా.. కస్టడీ నుంచి ఆయన ఇస్తున్న ఆదేశాలపై ఈడీ సీరియస్ అయినట్లు తెలుస్తోంది. మంగళవారం ఉదయం లాకప్ నుంచి కేజ్రీవాల్ రెండో ఆదేశాలు జారీ చేసినట్లు ఆప్ నేత, ఢిల్లీ ఆరోగ్య మంత్రి సౌరభ్ భరద్వాజ్ వెల్లడించారు. మొహల్లా క్లినిక్‌లలో ఉచిత ఔషధాల కొరత ఉండకుండా చూసుకోవాలని సీఎం ఉత్తర్వుల్లో పేర్కొన్నట్లు ఆరోగ్య మంత్రి తెలిపారు. ‘‘కస్టడీలో ఉన్నప్పటికీ సీఎం ప్రజల ఆరోగ్యం గురించి ఆలోచిస్తున్నారు’’ అని సౌరభ్ పేర్కొన్నారు. చదవండి: ఈడీ కస్టడీలో కేజ్రీవాల్: లాకప్ నుంచే తొలి ఆదేశం అంతా ఉత్తదేనా? ఇటీవల ఆయన నీటి సమస్య నివారణ కోసం సహచర మంత్రి ఆతిశీకి నోట్ ద్వారా ఉత్తర్వులిచ్చిన సంగతి తెలిసిందే. దీన్ని ఈడీ తీవ్రంగా పరిగణించింది. కస్టడీ సమయంలో ప్రధాన కార్యాలయంలో ఉన్న కేజ్రీవాల్‌కు కంప్యూటర్ లేదా కాగితాలను తాము సమకూర్చలేదని దర్యాప్తు సంస్థ చెబుతోంది. ఆదేశాలు బయటకు ఎలా వెళ్లాయో తెలుసుకొనేందుకు చర్యలు చేపట్టింది. దీనిపై ఆతిశీని ప్రశ్నించే అవకాశముంది. అయితే ఇప్పటికే కేజ్రీవాల్ ఇచ్చిన తొలి ఆదేశాలపై బీజేపీ అభ్యంతరాలు వ్యక్తం చేసింది. అదే సమయంలో కంప్యూటర్, పేపర్ అందుబాటులో లేని కేజ్రీవాల్ ఆదేశాలు ఎలా జారీ చేశారా? అనే అంశంపై ఈడీ దర్యాప్తు చేపట్టింది. ఇంతలోనే మరో ఆదేశం విడుదల కావడం.. దాన్ని ఆప్ గర్వంగా ప్రకటించుకోవడాన్ని ఈడీ తీవ్రంగా పరిగణిస్తున్నట్లు తెలుస్తోంది. -
ఢిల్లీ సర్కార్‌కు షాక్.. మొహల్లా క్లినిక్‌లపై సీబీఐ దర్యాప్తు
ఢిల్లీ: ఢిల్లీ ప్రభుత్వానికి భారీ షాక్ తగిలింది. ఆప్ సర్కార్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మొహల్లా క్లినిక్‌లలో అవినీతి జరిగిందనే ఆరోపణలపై హోం మంత్రిత్వ శాఖ సీబీఐ దర్యాప్తుని ఆదేశించింది. మొహల్లా క్లినిక్‌ల రోగనిర్ధారణ పరీక్షల్లో అవినీతి ఆరోపణలపై దర్యాప్తు చేయాల్సిందిగా సీబీఐని ఢిల్లి లెఫ్టినెంట్ గవర్నర్ కోరినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. మొహల్లా క్లినిక్‌లు పేషెంట్లు లేకుండానే నకిలీ రేడియాలజీ, పాథాలజీ పరీక్షలను నిర్వహించాయని ఆరోపణలు వచ్చాయి. క్లినిక్‌లకు రాని వైద్యులకు హాజరు ఉన్నట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. లేని రోగులకు క్లినిక్‌లలో చికిత్సలు నమోదు చేసినట్లు బయటపడింది. అంతకుముందు ఢిల్లీ ప్రభుత్వ ఆసుపత్రులకు నాసిరకం మందులు సరఫరా అవుతున్నాయనే ఆరోపణలపై సీబీఐ దర్యాప్తుకు లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా ఆదేశించారు. మొహల్లా క్లినిక్ ద్వారా ఢిల్లీలో సామాన్య జనానికి ప్రాథమిక ఆరోగ్యాన్ని అందించడానికి ఆప్ సర్కార్ ఏర్పాటు చేసిన పథకం. కేవలం ఢిల్లీ జనాభాకు మాత్రమే కాకుండా వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన ప్రజలకు కూడా ఆరోగ్య సేవలు అందిస్తుంది. ఇదీ చదవండి: కేజ్రీవాల్‌ది క్లీన్ ఇమేజ్.. అరెస్టు చేసినా ఆశ్చర్యం లేదు: శరద్ పవార్ -
ఇన్ఛార్జ్ పదవికి మంత్రి కుమార్తె రాజీనామా
న్యూఢిల్లీ : ఢిల్లీ ఆరోగ్యశాఖ మంత్రి సత్యేంద్ర జైన్ కుమార్తె సౌమ్యా జైన్ గురువారం మొహల్లా క్లినిక్స్ ఇన్ ఛార్జ్ పదవికి రాజీనామా చేశారు. కాగా అన్నివర్గాల ప్రజలకు అందుబాటులో వైద్య సదుపాయాలు కల్పించేందుకు ఢిల్లీ ప్రభుత్వం గతేడాది ప్రతిష్టాత్మకంగా మొహల్లా క్లినిక్స్ పేరుతో ఓ ప్రాజెక్టును ప్రారంభించిన విషయం తెలిసిందే. అయితే ఆప్ సర్కార్... ఆ క్లినిక్స్ ఇన్‌ఛార్జ్‌గా మంత్రి కుమార్తెను నియమించడంతో పెద్ద ఎత్తున విమర్శలతో పాటు, ఆరోపణలు వెల్లువెత్తాయి. ఆర్కిటెక్చర్ అయిన సౌమ్యా జైన్‌ను ఆరోగ్య ప్రాజెక్టుకు అధికారిణిగా నియమించడాన్ని విపక్షాలు తప్పబట్టాయి. అయితే మంత్రి సత్యేంద్ర జైన్ మాత్రం ఆ విమర్శలను తిప్పికొట్టారు. తన కుమార్తె ఆర్కిటెక్చర్లో నిపుణురాలని, మొహల్లా క్లినిక్స్ రూపకల్పనకు ఆమె స్వచ్ఛందంగా పని చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు. అయితే విమర్శలు వెల్లువెత్తడంతో సౌమ్య తన పదవి నుంచి తప్పుకున్నారు.