ఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో మనీలాండరింగ్ ఆరోపణలపై అరెస్టయిన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్.. ప్రస్తుతం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కస్టడీలో ఉన్నారు. అయితే, లాకప్ నుంచే ఆయన పాలన సాగిస్తుండటం చర్చనీయాంశమైంది. ఈ తరుణంలో ఆయన రెండో ఆదేశం జారీ చేయగా.. కస్టడీ నుంచి ఆయన ఇస్తున్న ఆదేశాలపై ఈడీ సీరియస్ అయినట్లు తెలుస్తోంది.
మంగళవారం ఉదయం లాకప్ నుంచి కేజ్రీవాల్ రెండో ఆదేశాలు జారీ చేసినట్లు ఆప్ నేత, ఢిల్లీ ఆరోగ్య మంత్రి సౌరభ్ భరద్వాజ్ వెల్లడించారు. మొహల్లా క్లినిక్‌లలో ఉచిత ఔషధాల కొరత ఉండకుండా చూసుకోవాలని సీఎం ఉత్తర్వుల్లో పేర్కొన్నట్లు ఆరోగ్య మంత్రి తెలిపారు. ‘‘కస్టడీలో ఉన్నప్పటికీ సీఎం ప్రజల ఆరోగ్యం గురించి ఆలోచిస్తున్నారు’’ అని సౌరభ్ పేర్కొన్నారు.
చదవండి: ఈడీ కస్టడీలో కేజ్రీవాల్: లాకప్ నుంచే తొలి ఆదేశం అంతా ఉత్తదేనా?
ఇటీవల ఆయన నీటి సమస్య నివారణ కోసం సహచర మంత్రి ఆతిశీకి నోట్ ద్వారా ఉత్తర్వులిచ్చిన సంగతి తెలిసిందే. దీన్ని ఈడీ తీవ్రంగా పరిగణించింది. కస్టడీ సమయంలో ప్రధాన కార్యాలయంలో ఉన్న కేజ్రీవాల్‌కు కంప్యూటర్ లేదా కాగితాలను తాము సమకూర్చలేదని దర్యాప్తు సంస్థ చెబుతోంది. ఆదేశాలు బయటకు ఎలా వెళ్లాయో తెలుసుకొనేందుకు చర్యలు చేపట్టింది. దీనిపై ఆతిశీని ప్రశ్నించే అవకాశముంది.
అయితే ఇప్పటికే కేజ్రీవాల్ ఇచ్చిన తొలి ఆదేశాలపై బీజేపీ అభ్యంతరాలు వ్యక్తం చేసింది. అదే సమయంలో కంప్యూటర్, పేపర్ అందుబాటులో లేని కేజ్రీవాల్ ఆదేశాలు ఎలా జారీ చేశారా? అనే అంశంపై ఈడీ దర్యాప్తు చేపట్టింది. ఇంతలోనే మరో ఆదేశం విడుదల కావడం.. దాన్ని ఆప్ గర్వంగా ప్రకటించుకోవడాన్ని ఈడీ తీవ్రంగా పరిగణిస్తున్నట్లు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment