ఢిల్లీలో హై అలర్ట్!
అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా దేశ విదేశాలకు చెందిన పలువురు వీఐపీలు, వీవీఐపీలు వస్తుండటంతో దేశ రాజధాని న్యూఢిల్లీలో హై అలర్ట్ ప్రకటించారు. యోగా డే నిర్వహిస్తున్న రాజ్పథ్ వద్ద దాదాపు 5 వేల మంది భద్రతా సిబ్బంది ఆదివారం తెల్లవారుజాము నుంచి డేగకళ్లతో కాపలా కాస్తుంటారు. ఢిల్లీ పోలీసులకు చెందిన స్పెషల్ బెటాలియన్లలోని 30 కంపెనీలు (సుమారు 3వేల మంది)తో పాటు నేషనల్ సెక్యూరిటీ గార్డు (ఎన్ఎస్జీ) కమాండోలు, డాగ్ స్క్వాడ్, షార్ప్ షూటర్లు, 18 మంది డీసీపీలను రాజ్పథ్, విజయ్ చౌక్ ప్రాంతాల్లో తెల్లవారుజామున 3 గంటల నుంచి మోహరిస్తారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, మంత్రులు, విదేశీ దౌత్యవేత్తలు, పలువురు సీనియర్ అధికారులు ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవం కార్యక్రమంలో పాల్గొంటారు. నిషేధిత ఉగ్రవాద సంస్థలకు చెందిన సభ్యులు వివిధ మార్గాల్లో దాడులకు తెగబడే ప్రమాదం ఉందని నిఘా సంస్థలు ఇప్పటికే హెచ్చరించాయి. ప్రధానంగా ఆకాశమార్గంలో డ్రోన్ల ద్వారా వాళ్లు దాడులు చేయొచ్చన్న సమాచారం ఉంది. దీంతో భద్రతా అధికారులు పూర్తి అప్రమత్తంగా ఉన్నారు.