
6 లైన్ల ఫ్లై ఓవర్.. వంద కోట్ల పొదుపు!
న్యూఢిల్లీ: సాధారణంగా ప్రభుత్వాలు తలపెట్టే ప్రాజెక్టులు అంచనా వ్యయం కన్నా రెండు, మూడు రెట్లు పెరిగిపోతుంటాయి. కానీ ఢిల్లీలో ఇటీవల నిర్మాణం పూర్తయిన ఆరు లైన్ల ఫ్లై ఓవర్.. అనుకున్న బడ్జెట్ కన్నా రూ. వంద కోట్లు తక్కువ ఖర్చుకే పూర్తయింది. నిర్ణీత గడువు కన్నా ముందే నిర్మాణం పూర్తి చేసుకుంది. దీంతో ఈ ఫ్లై ఓవర్ ప్రపంచంలోనే ఎనిమిది వింత అంటూ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆనందంలో మునిగిపోయారు. కేవలం ఒక నిజాయితీ కలిగిన ప్రభుత్వంలో మాత్రమే ఇలాంటి సాధ్యమవుతాయని ఆయన పేర్కొన్నారు.
ఉత్తర ఢిల్లీలోని అతిపెద్ద కూరగాయల మార్కెట్ ఉన్న ఆజాద్ పూర్ నుంచి 1.6 కిలోమీటర్ల ఆరు లైన్ల ఫ్లై ఓవర్ ను రూ. 247 కోట్లకు నిర్మించాలని తలపెట్టారు. అయితే, ఇది రూ. 143 కోట్లకే పూర్తయింది. ఈ విషయమై కేజ్రీవాల్ స్పందిస్తూ 'రూ. 250 కోట్ల ప్రాజెక్టు రూ. 100 కోట్లకే పూర్తవ్వడం నేనెప్పుడూ వినలేదు. సాధారణంగా ఒక ప్రాజెక్టు వ్యయం రూ. 250 కోట్లు అయితే అది రెట్టింపై రూ. 500 కోట్లకు, రూ. వెయ్యి కోట్లకు చేరుకోవడమే నేను చూశాను' అని పేర్కొన్నారు. షీలా దీక్షిత్ నేతృత్వంలోని గత ప్రభుత్వం ఈ ప్రాజెక్టు చేపట్టిందని, 20-30 శాతం పనులు పూర్తయిన ఈ ప్రాజెక్టును తమ ప్రభుత్వం నిర్మాణం పూర్తి చేసిందని కేజ్రీవాల్ తెలిపారు.