ఎయిర్ పోర్టులోకి చొరబడిన పందులు
న్యూఢిల్లీ: కట్టుదిట్టమైన పహారా ఉండే నాగపూర్ విమానాశ్రయంలో భద్రత ఉల్లంఘన జరిగింది. పటిష్టమైన రక్షణ కవచాన్ని ఛేదించుకుని పందుల గుంపు రన్ వేపై హల్ చల్ చేసింది. అదికూడా రాష్ట్రపతి ప్రయాణిస్తున్న విమానం ల్యాండ్ అయిన సమయంలో. సోమవారం చోటుచేసుకున్న ఈ ఘటనపై విమానయాన నియంత్రణ సంస్థ డీజీసీఏ దర్యాప్తు చేపట్టింది.
అసలేం జరిగిందంటే...
రెండు రోజుల పర్యటన కోసం రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ సోమవారం నాగపూర్ కు వచ్చారు. రాష్ట్రపతి ప్రయాణిస్తున్న జుంబో బోయింగ్ 737 విమానం నాగపూర్ విమానంలో కిందకు దిగి టెర్మినల్ బిల్డింగ్ వైపు వెళుతుండగా రన్ వేపై హఠాత్తుగా 8 పందులు ప్రత్యక్షమయ్యాయి. విమానాశ్రయ సిబ్బంది ఉరుకులు పెట్టి వరాహాలను రన్ వే నుంచి వెళ్లగొట్టారు. ఎయిర్ పోర్టులోకి పందుల చొరబాటును సీరియస్ గా పరిగణించి డీజీసీఏ దర్యాప్తు చేపట్టింది. భద్రత, రక్షణ ఉల్లంఘనపై డీజీసీఏ పశ్చిమ విభాగం అధికారి విచారణ చేపట్టారు.