నియంతృత్వ పోకడ.. నీకే చేటు
‘చలో హైదరాబాద్’లో కేసీఆర్‌కు విపక్షనేతల హెచ్చరిక
భవిష్యత్తుపై బెంగతో మున్సిపల్ కార్మికుల అకాల మృతి
అయినా సర్కారు పట్టించుకోకపోవడం శోచనీయం
హైదరాబాద్: సమస్యల పరిష్కారం కోసం నెల రోజులుగా సమ్మె చేస్తున్నా ప్రభుత్వం స్పందింకపోవడంతో మునిసిపల్ కార్మికుల్లో అశాంతి పెరుగుతోందని, భవిష్యత్తుపై బెంగతో కార్మికులు అకాల మరణానికి లోనవుతున్నారని, అయినా ప్రభుత్వం మొండివైఖరి వీడడం లేదని విపక్ష పార్టీలు, కార్మిక జేఏసీ నేతలు ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అనుసరిస్తున్న నియంతృత్వ పోకడలు ఆయనకే చేటు చేస్తాయని హెచ్చరిం చారు. మున్సిపల్ ఉద్యోగ, కార్మిక సంఘాల జేఏసీ పిలుపు మేరకు సోమవారం తెలంగాణలోని తొమ్మది జిల్లాల్లోని మున్సిపల్ కార్మికులు ‘చలో హైదరాబాద్’ కార్యక్రమానికి భారీగా తరలివచ్చారు. సుందరయ్య విజ్ఞాన కేంధ్రం నుంచి ఇందిరాపార్కు వరకు కార్మికులు ప్రదర్శన జరిపారు. అనంతరం ఇందిరా పార్కు వద్ద జరిగిన బహిరంగసభలో విపక్షాల నేతలు ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. మంగళవా రం సాయంత్రంలోగా సమస్యలు పరిష్కరించకపోతే బుధవారం నుంచి ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని ప్రభుత్వానికి హెచ్చరించారు. ఈ నెల 9 వరకు నిరవధిక దీక్షలు, 10న కలెక్టరేట్ల వద్ద పికెటింగ్‌లు నిర్వహిస్తామని జేఏసీ ప్రకటించింది.
మున్సిపల్ కార్మికులపట్ల సీఎం కేసీఆర్ అనుసరిస్తున్న నియంతృత్వ వైఖరి భవిష్యత్తులో ఆయనకే చేటు తెస్తుందని, ప్రజాస్వామ్యంలో నియంతృత్వ పోకడలు సాగవని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. తెలంగాణ వస్తే కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ విధానం ఉండదంటూ అనేకమార్లు చెప్పిన కేసీఆర్, అధికారంలోకి వచ్చాక అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు. మున్సిపల్ కార్మికులు నెల రోజులుగా సమ్మెలో ఉన్నా, వారి సమస్యలను తెలుసుకోలేని రీతిలో ప్రభుత్వముందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ వస్తే బాగుపడతామని కార్మికులు భావించారని, ఇలా బజారున పడాల్సి వస్తుందనుకోలేదన్నా రు. అకాలమరణాల పాలవుతున్న కార్మికుల శవాల మీద బంగారు తెలంగాణ నిర్మిస్తావా? అని కేసీఆర్‌ను ప్రశ్నించారు. కార్యక్రమంలో బీజీపీ ఎమ్మెల్యే ఎన్‌వీఎస్‌ఎస్ ప్రభాకర్, సీపీఎం ఎమ్మెల్యే సున్నం రాజయ్య, టీడీపీ గ్రేటర్ అధ్యక్షుడు కృష్ణయాదవ్ పాల్గొన్నారు.