‘డీజే’ పాటలో ఆ పదాలను తొలగిస్తాం
- బ్రాహ్మణ సంఘాలతో దర్శకుడు హరీశ్ శంకర్, కవి సాహితి
సాక్షి, హైదరాబాద్ బ్యూరో: వివాదాల సుడిగుండంలో చిక్కుకున్నఅల్లు అర్జున్ ‘డీజే– దువ్వాడ జగన్నాథం’ సినిమాను దర్శకుడు హరీశ్ శంకరే స్వయంగా గట్టెక్కించారు. సినిమాలోని ఓ పాటలో ప్రయోగించిన ‘నమక చమకాలు’, ‘ప్రవర’, ‘అగ్రహారాల’ అనే పదాలను తొలగిస్తామని ఆ సినిమా దర్శకుడు హరీశ్‌శంకర్, గీత రచయిత సాహితి తెలిపారు. చిత్రంలోని ఓ పాటలో కొన్ని పదాలను ఉపయోగించడంపై బ్రాహ్మణ సంఘాలు ఆందోళనకు దిగిన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో బ్రాహ్మణ సంఘం నేతలు సోమవారం ‘డీజే’ సినిమా దర్శకుడు హరీష్‌శంకర్‌ను, గేయ రచయిత సాహితిని వారి కార్యాలయంలో కలిశారు. ‘నమక, చమకాల’ ప్రాశస్త్యాన్ని వివరించి, ఆ పదాలను తొలగించాలని కోరారు. దీనిపై హరీష్ శంకర్ స్పందిస్తూ.. ఎవరినీ కించపరిచే ఉద్దేశంతో పాటను రాయలేదని, పండితుల, బ్రాహ్మణ సంఘాల కోరిక మేరకు వాటిని మారుస్తామన్నారు. పాటలో మార్పుచేర్పులకు అంగీకరించిన దర్శక నిర్మాతలకు వారు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ద్రోణంరాజు రవికుమార్, తులసి శ్రీనివాస్, గోగులపాటి కృష్ణమోహన్, ఆలూరి, సుబ్బూజీ తదితరులు పాల్గొన్నారు.