
డిస్కో బాబా స్టెప్పులకు పోలీసులే స్టన్!
ఆయన ఘరానా బాబా.. ఇత్తడి బిస్కెట్లు, ఆర్టిఫిషియల్ రాళ్లను బంగారం బిస్కెట్లు, వజ్రాలు చేస్తానని నమ్మించి ప్రజలను బురిడీ చేస్తూ ఉంటాడు. అంతేకాదు ఆ బాబా వద్ద ఓ స్పెషాలిటీ కూడా ఉంది. అదేమిటంటే.. చెమ్కీలతో మెరిసిపోయే తెల్ల చొక్కా, తెల్ల ప్యాంటు వేసుకున్నాడంటే.. అదిరిపోయే స్టెప్పులు వేస్తుంటాడు. 'ఐయామ్ ఏ డిస్కో' డ్యాన్స్ అంటూ దుమ్ములేపుతాడు. తాజాగా ఆ బాబా తన డ్యాన్స్ టాలెంట్ ను పోలీసులకు చూపించాడు. ఆయన స్టెప్పులను స్వయంగా చూసిన పోలీసులు, ఎంఐఎం ఎమ్మెల్యే అహ్మద్ పాషా ఖాద్రీ విస్తుపోయారు.
దెయ్యాలు, భూతాల పేరుతో అమాయక ప్రజలను దోపిడీ చేస్తున్న 16 మంది మంత్రగాళ్లను హైదరాబాద్‌లోని దక్షిణ మండలం పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అందులో ఈ డిస్కో బాబా ఒకరు. టప్పా చబుత్రాకు చెందిన యునాని వైద్యుడు అన్వరుల్లాఖాన్.. డిస్కో బాబా పేరిట పాతబస్తీలో మోసాలకు పాల్పడుతున్నాడు. తన వద్ద ఉన్న ఇత్తడి బిస్కెట్లు, ఆర్టిఫిషియల్ రాళ్లను బంగారం బిస్కెట్లు, వజ్రాలు అంటూ నమ్మించి మోసం చేయడం ఇతనికి వెన్నతో పెట్టిన విద్య. రియాసత్‌నగర్‌కు చెందిన సయ్యద్ ఇఫే్తకార్ హుస్సేన్ అనే వ్యక్తి ఇంట్లో గుప్త నిధులు తీస్తానంటూ నమ్మించి రూ.38 లక్షలు వసూలు చేశాడు. ఇతనిపై నగరంలోని ఆసిఫ్‌నగర్, హబీబ్‌నగర్, కుల్సుంపురా, షాయినాయత్ గంజ్ తదితర పోలీస్‌స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి.