దూషణలపర్వంలో కొత్త రికార్డు
లక్నో: ఉత్తరప్రదేశ్‌లో అయిదో దశ ఎన్నికల ప్రచారంలో భాగంగా నేతలు తమ నోటికి పనిచెప్పారు. వ్యక్తిగత దూషణల్లో తామెవరికీ తక్కువ కాదని నిరూపించారు. యూపీలో మొత్తం 11 జిల్లాల్లోని 51 నియోజకవర్గాలకు శనివారంతో ఎన్నికల ప్రచారం పూర్తైంది. ఈ నెల 27న పోలింగ్ జరుగనుంది.
ఉత్తరప్రదేశ్ సీఎం అఖిలేశ్ యాదవ్ బాలీవుడ్ సూపర్‌స్టార్ అమితాబ్ బచ్చన్ నుద్దేశించి ‘గుజరాత్ గాడిదలకు ప్రచారం చేయకండి’ అని పరోక్షంగా మోదీని విమర్శించడంపై మండిపడ్డ కమలనాథులు గాడిదలకున్నంత విశ్వాసం అఖిలేశ్‌కు లేదని మండిపడ్డారు. బహ్రీచ్ బహిరంగ సభలో మోదీ మాట్లాడుతూ గాడిదలంటే అఖిలేశ్‌కు భయమెందుకో? అని చురకలంటించారు. 125 కోట్ల దేశ ప్రజలే తన యజమానులనీ, వారికోసం గాడిదలను స్ఫూర్తిగా తీసుకుని పనిచేస్తానని మోదీ ప్రకటించారు.
బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా కాంగ్రెస్, బీఎస్పీ, ఎస్పీలను ‘కసబ్’గా అభివర్ణించడంతో, అమిత్ షా కంటే పెద్ద కసబ్ (ఉగ్రవాది) దేశంలోనే లేరని బీఎస్పీ చీఫ్ మాయావతి కౌంటరిచ్చారు. అఖిలేశ్ కూడా కసబ్‌లో ‘క’ అంటే పావురమనీ (కబూతర్), ఈ ఎన్నికల్లో బీజేపీ పావురాన్ని ప్రజలు వదిలించుకుంటారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.