
'టైపిస్టు పెద్దాయనకు పోలీసుల పహారా'
లక్నో: రోజువారి పనులకోసం ఆ పెద్దాయన సిద్ధమవుతున్నాడు. చేతిలోకి తన టైప్ రైటర్ తీసుకుని బయలుదేరడానికి ముందు తుడుస్తూ కూర్చున్నాడు. ఇంతలో ఒక్కసారిగా పోలీసులు వచ్చారు. వారు ఎందుకొచ్చారో అర్ధంకాని ఆ పెద్దమనిషికి గుండెలో గుబులు. ఇంతలో పోలీసుల నుంచి ఒక మాట' పదండి పెద్దాయన మీకు తోడుగా వస్తాం.. మిమ్మల్ని దిగబెట్టి అక్కడే ఉంటాం' అని.. ఈ మాటలు విని అతడు ఆశ్చర్యపోయాడు. ఆ తర్వాత తాను ఇచ్చిన ఫిర్యాదు గుర్తుచేసుకున్నాడు. పూర్తి వివరాల్లోకి వెళితే..
దాదాపు 35 ఏళ్లుగా లక్నో జనరల్ పోస్టాపీసు ముందు కూర్చుని తన పాత టైప్ రైటర్ సాయంతో బతుకీడుస్తున్న కిషన్ కుమార్ (65) అనే పెద్దాయనపై ఓ ఎస్సై దాడి చేసిన విషయం తెలిసిందే. ఆయన టైప్ రైటర్ను కూడా ఆ ఎస్సై ధ్వంసం చేశాడు. ఈ విషయం సామాజిక మాధ్యమాల్లో హల్ చల్ చేసి చివరికి ఆ ఎస్సై ఉద్యోగం నుంచి సస్పెండ్ అయ్యాడు. అయితే, కిషన్ కుమార్కు బెదిరింపు కాల్ వచ్చినట్లు ఫిర్యాదు వచ్చిన నేపథ్యంలో ఆయన ప్రాణానికి ప్రమాదం పొంచి ఉందని పోలీసులను ఎస్కార్ట్గా పంపిస్తున్నట్లు పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు.
సోమవారం ఓ గుర్తు తెలియని వ్యక్తి నుంచి కిషన్ కుమార్కు ఫోన్ కాల్ వచ్చింది. 'నువ్వు చేసింది మంచి పని కాదు.. నీ పనిచెప్తా' అంటూ ఫోన్ చేసిన వ్యక్తి వార్నింగ్ ఇచ్చాడు. అయితే ఫోన్ కాల్ తిరిగి చేసేందుకు ప్రయత్నించినా సాధ్యం కాలేదు. ఎందుకంటే ఆ ఫోన్ కాల్ వచ్చింది ఇంటర్నెట్ ద్వారా. దీంతో పోలీసుల కిషన్ కుమార్కు భద్రత కల్పించి దర్యాప్తు చేస్తున్నారు.