సాక్షి మహరాజ్‌కు ఈసీ మందలింపు
న్యూఢిల్లీదేశ జనాభా విషయంలో ఒక వర్గాన్ని రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేసినందుకు బీజేపీ ఎంపీ సాక్షి మహరాజ్‌ను ఈసీ మందలించింది. ఈ మేరకు ఎన్నికల కమిషన్ సీనియర్ ముఖ్య కార్యదర్శి ఆర్‌కే శ్రీవాస్తవ ఆయనకు ఒక లేఖ రాశారు. తాను ఆ వ్యాఖ్యలు చేసింది ఎన్నికల ప్రచార సభలో కాదని, ఒక సంత్ సంగమ్‌లో అని సాక్షి మహరాజ్ ఇంతకుముందు ఎన్నికల కమిషన్‌కు పంపిన సమాధానంలో పేర్కొన్నారు. అయితే, ఆ సమాధానంతో తాము సంతృప్తి చెందలేదని కమిషన్ తెలిపింది.
అందువల్ల ఆయనను మందలిస్తున్నట్లు సదరు లేఖలో తెలిపింది. ప్రముఖ రాజకీయ నాయకుడు, ఎంపీ కావడం వల్ల ఎన్నికల సమయంలో బహిరంగంగా మాట్లాడేటప్పుడు మరింత బాధ్యతాయుతంగా ఉండాలని చెప్పింది. భవిష్యత్తులో మరోసారి ఇలాంటి వ్యాఖ్యలు చేసినా, ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించినా కమిషన్‌కు అందుబాటులో ఉన్న అధికారాల ఆధారంగా కఠినమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు.