బట్టతలపై నీళ్లు పోసి మంత్రి ప్రయోగం!
ప్రజలకు సందేశం ఇవ్వడంలో, తమ మనస్సులోని మాటను ప్రజలకు చేర్చడంలో ఒక్కొక్కరిది ఒక్కో స్టైల్. కొందరు నాయకులు పొడవాటి ఉపన్యాసాలు ఇస్తే.. మరికొందరు కళ్లకు కట్టినట్టు ’డెమో’ చూపించి.. తమ చెప్పాలనుకున్నదేదో సూటిగా, మనస్సులో నాటుకుపోయేలా చెప్తారు.
మధ్యప్రదేశ్ పర్యావరణ మంత్రి అంతార్‌సింగ్ ఆర్య కూడా మాటలు చెప్పేరకం కాదు. ఏదైనా ప్రజలకు కళ్లకు కట్టేలా ఆయన ’డెమో’ ఇస్తూ ఉంటారు. తాజాగా చెట్లను పెంచి అడవులను కాపాడే ఆవశ్యకతను ప్రజలకు వివరించేందుకు ఆయన ఇదేవిధంగా ’డెమో’ ఇచ్చారు. తన నియోజకవర్గం కొండప్రాంతమైన సేంధ్వాలోని ఓ గ్రామంలోని సభలో పాల్గొన్న ఆయన.. ప్రజల్లో ఇద్దరిని వేదికపైకి పిలిచారు. అందులో ఒకరు బట్టతల ఉన్న వ్యక్తి. మరొకరు నిండుగా వెంట్రుకలు ఉన్న వ్యక్తి. ఇద్దరి నెత్తిపై మంత్రిగారు నీళ్లు గుమ్మరించారు. ఆ తర్వాత ఓ తుండువస్త్రం తీసుకొని ఆయన వారిద్దరి తలలనూ తుడిచారు. అప్పుడు ప్రజలను అడిగారు. బట్టతల వ్యక్తి తలపై నీళ్లు నిలిచాయా? లేక వెంట్రుకలున్న వ్యక్తి తలపైనా అని.. బట్టతల నున్నగా ఉండటంతో తడి లేదు. కానీ వెంట్రుకలున్న తలపై సహజంగా తడి ఉంది. అదే ప్రజలు చెప్పారు.
ఇంతకు ఆయన ఇవ్వదలుచుకున్న సందేశం ఏమిటంటే.. బట్టతల అంటే చెట్లు, అడవి లేని ప్రాంతం. వెంట్రుకలు ఉన్న తల అంటే చెట్లు, అడవి ఉన్న ప్రాంతం. బట్టతల మాదిరిగానే అడవిలేని ప్రాంతం వాననీటిని కాపాడుకోలేదు. ముఖ్యంగా కొండప్రాంతంలో చెట్లులేకపోతే నీటి సంరక్షణ చాలా కష్టం. అదే చెట్లు, అడవి ఉంటే వెంట్రుకలున్న వ్యక్తి లాగా తడిని, నీటిని కాపాడుకోవచ్చు. స్వయంగా బట్టతల కలిగిన మంత్రిగారి సందేశం అనుకున్నట్టుగానే ప్రజల్లోకి వెళ్లింది. చెట్లను అధికంగా నాటడం ద్వారా వానానీటిని పరిరక్షించుకోవాలని మంత్రి అంతార్ సింగ్ పిలుపునిచ్చారు.