కొండను తవ్వి ఎలుకను పట్టారు
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం పెద్ద నోట్లను రద్దు చేయడం, దీని అమలు తీరుపై కేంద్ర ఆర్థిక శాఖ మాజీ మంత్రి పీ చిదంబరం తీవ్ర విమర్శలు చేశారు. పెద్ద నోట్ల రద్దు వ్యవహారం అతి పెద్ద కుంభకోణమని, దీనిపై విచారణ చేయాలని డిమాండ్ చేశారు. మంగళవారం చిదంబరం మీడియాతో మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం వ్యవహారం కొండను తవ్వి ఎలుకను పట్టినట్టుగా ఉందని అన్నారు.
తాను ఇప్పటి వరకు 2 వేల రూపాయల నోటును తీసుకోలేకపోయానని, దేశవ్యాప్తంగా కొందరు ధనవంతుల నుంచి 2 వేల నోట్లు గల కోట్లాది రూపాయల కరెన్సీ అధికారుల దాడుల్లో పట్టుబడుతోందని చిదంబరం అన్నారు. సామాన్యులు కరెన్సీ దొరకక ఇబ్బందులు పడుతుంటే, మరోవైపు ఇంత పెద్ద మొత్తంలో డబ్బు వారి దగ్గరకు ఎలా చేరిందని ప్రశ్నించారు. వారానికి 24 వేల రూపాయలను విత్ డ్రా చేసుకోవచ్చని కేంద్ర ప్రభుత్వం ప్రకటించినట్టుగా బ్యాంకులు ఖాతాదారులకు ఇవ్వడం లేదని చెప్పారు. ప్రతి బ్యాంకు తమ దగ్గర క్యాష్ లేదని చెబుతున్నాయని పేర్కొన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో డబ్బు ఉందని ప్రభుత్వం ఎలా చెబుతుందని ప్రశ్నించారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ చెప్పినట్టుగా కొన్ని నెలల్లో పెద్ద నోట్ల రద్దు మహా విషాదంగా ముగుస్తుందని చెప్పారు.
పెద్ద నోట్ల రద్దు వ్యవహారంలో బీజేపీ కుట్ర ఉందని, ఈ విషయం ముందే లీకయిందని చిదంబరం ఆరోపించారు. నోట్లను రద్దు చేసి కేంద్ర ప్రభుత్వం పెద్ద తప్పు చేసిందని విమర్శించారు. దీనివల్ల పేద ప్రజలే కష్టాలు పడుతున్నారని, ధనవంతులు ఎక్కడా క్యూలో నిలబడటం లేదని అన్నారు. 1 నుంచి 2 శాతం వరకు జీడీపీ తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారని పేర్కొన్నారు. ప్రపంచంలో ఏ దేశంలో కూడా పూర్తిగా నగదు రహిత ఆర్థిక వ్యవస్థ లేదని చెప్పారు.