బ్యాంకాక్లో బాంబు పేలుడు.. 27 మంది మృతి
బ్యాంకాక్: థాయ్లాండ్ రాజధాని బ్యాంకాక్లో సంభవించిన భారీ బాంబు పేలుడులో మరణించిన వారి సంఖ్య 27కి పెరిగింది. ఈ పేలుడులో మరో 20 మంది గాయపడ్డారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్టు సమాచారం. బ్యాంకాక్ లో మరో బాంబును గుర్తించి స్వాధీనం చేసుకోవడంతో ప్రాణనష్టాన్ని తగ్గించగలిగారు.
సోమవారం సాయంత్రం సెంట్రల్ బ్యాంకాక్లోని కమర్షియల్ హబ్లో బ్రహ్మదేవుని ఆలయానికి సమీపంలో పేలుడు సంభవించింది. బాంబు పేలడం వల్లే ఈ ఘటన జరిగినట్టు థాయ్లాండ్ నేషనల్ పోలీస్ చీఫ్ ధ్రువీకరించారు. స్కూటర్లో దాచిన బాంబు పేలినట్టు భావిస్తున్నామని పోలీసులు తెలిపారు. ఆ వీధిలో మృతుల శరీర భాగాలు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. వెంటనే సహాయక చర్యలు చేపట్టి క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సివుంది.
కమర్షియల్ హబ్ ప్రధాన రహదారిలో ఉన్న బ్రహ్మదేవుని ఆలయానికి రోజూ వేలాది మంది భక్తులు వస్తుంటారు. బాంబు పేలుడు ఘటనలో భారతీయులకు ప్రమాదం జరిగినట్టుగా సమాచారం లేదని థాయ్లాండ్లో భారత దౌత్యాధికారి చెప్పారు. ఇదిలావుండగా, గతేడాది నుంచి థాయ్లాండ్లో సైనిక పాలన సాగుతోంది.
బ్యాంకాక్ బాంబు పేలుడు ఘటనను భారత ప్రధాని నరేంద్ర మోదీ ఖండించారు. ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా తమ దేశం సమర్థించదని మోదీ పేర్కొన్నారు. బాంబు పేలుడు మృతులకు మోదీ సంతాపం ప్రకటించారు.