ప్రొఫైల్ పిక్‌ను డౌన్‌లోడ్ చేయలేరు!
లాస్‌ఏంజెలిస్: సోషల్ మీడియా దిగ్గజాల్లో ఒకటైన ఫేస్‌బుక్ ఇప్పడు ఖాతాదారులందరికీ మరో కొత్త ఫీచర్‌ను అందిస్తోంది. ఫేస్‌బుక్‌లో పెట్టే ప్రొఫైల్ పిక్చర్‌ను మరింత భద్రంగా మార్చే ఈ కొత్త ఫీచర్‌ను తొలుత భారత్‌లో ప్రవేశపెట్టనుంది. అనంతరం ఇతర దేశాలకు వర్తింప చేయనుంది. సాధారణంగా ఫేస్‌బుక్‌లో పెట్టిన ప్రొఫైల్ పిక్చర్‌ను చాలామంది దుర్వినియోగం చేస్తున్నారని.. అందులో మహిళల ఫొటోలనైతే మార్ఫింగ్ చేసి అభ్యంతరకరంగా పోస్టులు చేస్తున్నట్లు ఫేస్‌బుక్ గుర్తించింది. దీంతో ఫేస్‌బుక్ ప్రొఫైల్ పిక్చర్లు దుర్వినియోగం కాకుండా ఢిల్లీలోని సోషల్ రీసెర్చ్ అండ్ లెర్నింగ్ లింక్స్ ఫౌండేషన్ అనే భద్రతా ప్రమాణాల సంస్థతో కలసి ఫేస్‌బుక్ సంస్థ కొత్త ఫీచర్‌ను తయారు చేసింది.
దీనిద్వారా ప్రొఫైల్ పిక్చర్లు ఆన్‌లైన్‌లో దుర్వినియోగం కాకుండా ఉంటాయని.. మన ప్రమేయం లేకుండా ఇతరులు డౌన్‌లోడ్ చేయడం, షేర్‌చేయడం వంటి వాటిని నిరోధించవచ్చని.. ప్రొఫైల్ పిక్చర్లను మరింత సులభంగా మనకు నచ్చిన డిజైన్లలో రూపొందించుకోవచ్చని ఫేస్‌బుక్ సంస్థ ప్రొడక్ట్ మేనేజర్ ఆరతి సోమన్ తన బ్లాగ్‌లో పోస్టు చేశారు. కొత్త ఫీచర్ ద్వారా ప్రొఫైల్ పిక్చర్‌కు చుట్టూ ఓ నీలం రంగు వలయం కనిపిస్తుంటుందని ఆమె తెలిపారు.